ఫలితాన్నివ్వని పార్లమెంటు సమావేశాలు
- నెల గడిచినా నోట్ల రద్దు సమస్యకు పరిష్కారం లేదు
- ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసినా ప్రజల సమస్యలు మాత్రం మిగిలే ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుకతో కలసి పార్లమెంటులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ’ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. దేశంలో అన్నిటికంటే ప్రధానమైనది నోట్ల రద్దు సమస్య. దానిపై పార్లమెంటులో ఏదైనా చర్చ జరిగి, సముచిత నిర్ణయాలు తీసుకుంటారేమోనని, నివారణోపాయాలు చెబుతారేమోనని ప్రజలందరూ ఆశించారు. కానీ ఫలితం శూన్యం. 21 రోజుల పాటు జరిగిన పార్లమెంటు సమావేశాలు మొత్తం నిరర్థకంగా మారాయి.
మరోవైపు ప్రజల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్థిక నిపుణులతో చర్చించి పరిష్కారాలు కనుగొనాలి. లేనిపక్షంలో అల్లకల్లోలం ఏర్పడే పరిస్థితి ఉంది. క్యాష్ లెస్ ఎకానమీ అంటున్నారు. కానీ దేశంలో 8 శాతం గ్రామాల్లోనే బ్యాంకులు ఉన్నాయి. ఏటీఎంలు 2 లక్షలు ఉంటే వాటిలో 10 శాతం కూడా గ్రామాల్లో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాష్ లెస్ ఎకానమీ ఎలా సాధ్యం? ఈ వ్యవహారంతో ప్రజల్లో ప్రధానికి ఆదరణ పలుచబడిపోయినట్టు అనిపిస్తోంది. మీరేం చేస్తున్నారని మా ప్రజాప్రతినిధులను ప్రజలు అడుగుతున్నారు. మా దగ్గర సమాధానం లేదు..’ అని మేకపాటి పేర్కొన్నారు. వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావులు కూడా మాట్లాడారు.