మహానగర పాలక సంస్థలో చోటుచేసుక్ను ఈ-టెండరింగ్ కుంభకోణంలో 27 మంది ఇంజనీర్లను దోషులుగా గుర్తించారు.
సాక్షి, ముంబై: మహానగర పాలక సంస్థలో చోటుచేసుక్ను ఈ-టెండరింగ్ కుంభకోణంలో 27 మంది ఇంజనీర్లను దోషులుగా గుర్తించారు. ఇందులో తొమ్మిది మంది ఇంజినీర్లను సస్పెండ్ చేయగా మిగతా ఇంజినీర్లపై దర్యాప్తు జరుగుతోంది. అంతేకాక 40 మంది కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే చెప్పారు. గత వారంరోజులుగా బీఎంసీలో కొనసాగుతున్న ఈ ఉత్కంఠకు తెరపడింది.
ఈ ఘటన బీఎంసీ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారుల్లో, ఇంజనీర్లలో కలకలం రేపింది. బీఎంసీ పరిధిలో తమతమ వార్డు స్థాయిలో చేపట్టే వివిధ మరమ్మతులు, అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని, కార్పొరేటర్లు, అధికారులు కుమ్మక్కై తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకే పనులు అప్పజెపుతున్నారని, అందుకు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయని అనేక ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఈ-టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సీతారాం కుంటే భావించారు. కాని ఈ ప్రక్రియను అధికారులు, కార్పొరేటర్లు వ్యతిరేకించారు. అయినప్పటికీ కుంటే దీన్ని బలవంతంగా అమలు చేశారు. ఇందులో కూడా అధికారులు కుమ్మక్కై తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకే బాధ్యతలు అప్పగించారు. గత ఆరు నెలల కాల వ్యవధిలో రూ.600 కోట్లతో పూర్తిచేసిన నాలాలు, మురికి కాల్వల శుభ్రత, ఇతర అభివృద్ధి పనుల్లో ఏకంగా రూ.100 కోట్ల మేర అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గతవారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందులో హస్తమున్న ఇంజినీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కుంటే వెల్లడించారు. దీంతో ప్రత్యేకంగా నియమించిన కమిటీ 27 మంది ఇంజినీర్లను దోషులుగా గుర్తించింది.