క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం. (ఇన్‌సెట్లో) తీవ్రగాయాలపాలైన చిన్నారి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూలు బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లడంతో 27 మంది విద్యార్థులు సహా 30 మంది మృతిచెందారు. మృతుల్లో ఎక్కువ మంది ప్రాథమిక తరగతుల విద్యార్థులే (పదేళ్ల లోపువారే) ఉన్నారు. కంగ్రా జిల్లా గురుచల్‌లోని రాంసింగ్ పఠానియా మెమోరియల్ స్కూల్‌కు చెందిన బస్సు 45 మంది విద్యార్థులు, టీచర్లు, సహాయక సిబ్బందితో సమీప గ్రామాల్లో విద్యార్థులను దించేందుకు బయలుదేరింది. గురుచల్ పట్టణం దాటగానే బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న 100 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది.
దీన్ని గమనించిన పక్కనున్న గ్రామస్తులు హుటాహుటిన సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు. కాసేపటికే ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. గాయపడిన విద్యార్థులను వెంటనే పఠాన్‌కోట్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 26 మంది విద్యార్థులు, డ్రైవర్ మదన్ లాల్ (67), ఇద్దరు మహిళా టీచర్లు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థి కన్నుమూశాడని హిమాచల్ రవాణా మంత్రి గోవింద్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలుస్తోంది.
బస్సు శకలాలు, లోయలో రాళ్లు రప్పల మధ్య చిన్నారుల శవాలతో ఘటనాస్థలం దయనీయంగా మారింది. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో ఆసుపత్రి వద్ద వాతావరణం ఉద్విగ్నంగా మారింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ పఠానియా, రాష్ట్ర మంత్రులు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు.బస్సు ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రమాదం దురదృష్టకరం. చిన్నారుల మృతి నన్ను కలచివేసింది. చిన్నారుల తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని మోదీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్.. మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment