
ఆటోలో అన్ని బంగారు బిస్కెట్లా!
బెంగళూరు : ఆటోలో తీసుకువెళుతున్న మూడు కిలోల బంగారు బిస్కట్లను హైగ్రౌండ్స్ పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు సెంట్రల్ విభాగం డీసీపీ సందీప్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం అర్ధరాత్రి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌కు వెళుతున్న ఆటోను ఆనందరావు సర్కిల్ వద్ద నాకాబందీ నిర్వహిస్తున్న హైగ్రౌండ్స్ పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. బెంగళూరు నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బిస్కట్ల రూపంలో ఉన్న బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు.
ఆటోలో ప్రయాణిస్తున్న కోయంబత్తూరుకు చెందిన నటరాజ్, బాల, రాంకుమార్ల వద్ద ఉన్న సూట్‌కేసులో మూడు కిలోల బంగారు బిస్కట్లు, 42 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించి వారి వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవు. వారి వద్ద ఉన్న బంగారం, నగదు స్వాధీనం చేసుకొని, వారిని పోలీసులు అదపులోకి తీసుకున్నారు. నిందితులను ఆదాయ పన్ను శాఖ అధికారులు విచారిస్తున్నారని డీసీపీ పేర్కొన్నారు.