ఘటనా స్థలంలో పోలీసులు
అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్ నగర శివార్లలో ఉన్న సంత్ నిరంకారి భవన్‌పై ఆదివారం ఉగ్రవాద దాడి జరిగింది. ప్రార్థనలు జరుగుతుండగా ఇద్దరు ఉగ్రవాదులు భక్తులపైకి గ్రెనేడ్ విసిరారు. అది పేలడంతో ముగ్గురు మరణించగా మరో 20 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడిని తాము ఉగ్రవాదుల దుశ్చర్యగానే భావిస్తున్నామని పోలీసులు చెప్పగా, దాడి వెనుక ఐఎస్‌ఐతో సంబంధం ఉన్న ఖలిస్తానీ, కశ్మీరీ ఉగ్రవాద సంస్థలు ఉండొచ్చనీ, పంజాబ్‌లో మళ్లీ కల్లోలాన్ని సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయతిస్తోందని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆరోపించారు. అమృత్‌సర్ శివార్లలో, అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో ఉన్న రాజాసన్సీ ప్రాంతంలోని అద్లివాల్ అనే గ్రామంలో ఉన్న సంత్ నిరంకారి భవన్‌పై ఈ దాడి జరిగింది.
దాదాపు 200 మంది నిరంకారీలు లోపల ప్రార్థనలు చేస్తుండగా, మొహాలకు ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు బైక్‌పై అక్కడకు చేరుకున్నారు. ద్వారం వద్ద తనిఖీలు చేస్తున్న ఓ మహిళను తుపాకీతో బెదిరించి లోపలకు చొరబడిన అనంతరం ప్రార్థనలు చేస్తున్న వారిపైకి గ్రెనేడ్ విసిరి పరారయ్యారు. దీనిని ఉగ్ర చర్యగానే తాము పరిగణిస్తున్నామని పంజాబ్ డీజీపీ సురేశ్ అరోరా వెల్లడించారు. గ్రెనేడ్ పడిన ప్రాంతంలో చిన్న గుంత ఏర్పడిందన్నారు. అక్కడ పడి ఉన్న గ్రెనేడ్ ముక్కలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. నిరంకారి భవన్ ప్రాంతంలో ఎక్కడా సీసీటీవీ కెమెరాలను అమర్చలేదని ఐజీ ఎస్‌ఎస్ పర్మార్ చెప్పారు. దాడి జరిగిన నిరంకారి భవన్‌కు సీల్ వేసిన పోలీసులు, పంజాబ్‌లోని ఇతర నిరంకారి భవన్‌ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
హెచ్చరికలు ఉన్నా దాడి..
1980, 90ల్లోని తీవ్ర హింసాత్మక పరిస్థితుల నుంచి బయటపడి, ఇటీవలే శాంతి నెలకొన్న పంజాబ్‌లో మళ్లీ కల్లోలాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఇటీవలే హెచ్చరించారు. మరోవైపు ఆరు నుంచి ఏడు మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు ప్రస్తుతం పంజాబ్‌లో ఉన్నారనీ, వారు ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా నిఘా సమాచారం ఉంది. కొన్ని రోజుల క్రితమే పఠాన్‌కోట్ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి కారును నలుగురు కలిసి లాక్కొని పరారయ్యారు. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తంగానే ఉన్నా ఆదివారం నిరంకారి భవన్‌పై దాడి జరగడం గమనార్హం.
తీవ్రంగా భయపడ్డాం:ప్రత్యక్ష సాక్షులు
గ్రెనేడ్ దాడి కారణంగా తాము తీవ్ర భయానికి లోనయ్యామని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గ్రెనేడ్ పేలిన అనంతరం భవన్‌లో దట్టమైన పొగ అలముకుందనీ, భక్తులంతా పరుగులు తీశారని చెప్పారు. ప్రతి ఆదివారం తాము ఇక్కడ ప్రార్థనలు చేసుకోవడం మామూలేనన్నారు. సిమ్రన్‌జిత్ కౌర్ అనే మహిళ మాట్లాడుతూ ‘ప్రతి ఆదివారం నేను ఇక్కడ సేవకు వస్తాను. నేను గేటు వద్ద విధుల్లో ఉండగా యుక్తవయసులో ఉన్న ఓ వ్యక్తి మొహానికి ముసుగు కప్పుకుని వచ్చాడు. ఏదో విసిరి పరారయ్యాడు. అది బాంబు అని తర్వాత అర్థమైంది. అంతటా దట్టమైన పొగ అలముకుంది. అక్కడున్న వారంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు’ అని ఆమె తెలిపారు.
ప్రశాంతతకు భంగం కలగనివ్వం: సీఎం
పంజాబ్ చాలా కష్టపడి సంపాదించుకున్న శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు దుష్టశక్తులకు అవకాశం ఇవ్వబోమని సీఎం అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. ప్రజలెవ్వరూ భయపడాల్సిన పని లేదని ఆయన అభయమిచ్చారు. ఈ దాడి వెనుక ఐఎస్‌ఐతో సంబంధం ఉన్న ఖలిస్తానీ, కశ్మీరీ ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు. పంజాబ్‌లో కల్లోలం సృష్టించేందుకు పాక్ దుర్మార్గ ప్రయత్నాలు చేస్తోందన్న భావన ఈ దాడితో బలపడిందన్నారు. మృతుల బంధువులకు రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించిన సీఎం, క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశించారు. దాడి వెనుక ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. గత 18 నెలల్లో 15 ఉగ్ర కుట్రలను భగ్నం చేసినట్లు సీఎం చెప్పారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు.. రోదిస్తున్న బాధితుల కుటుంబీకులు
Comments
Please login to add a commentAdd a comment