ప్రతీకాత్మక చిత్రం
చెన్నై: కరోనా బారినపడి చనిపోయినవారి అంత్యక్రియలను అడ్డుకుంటే మూడేళ జైలు శిక్ష తప్పదని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ఆదివారం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కోవిడ్‌తో మృతి చెందినవారి అంతిమ సంస్కారాలు గౌరవంగా సాగాలని వెల్లడించింది. కోవిడ్ మృతుల అంతిమ సంస్కారాలకు ఆటంకం కలిగించడం, అందుకు కారకులుగా మారి నేరస్తులుగా మిగులొద్దని హితవు పలికింది. గతవారం చెన్నైలో వెలుగు చూసిన ఓ హృదయవిదారక ఘటన సంచలనం కావడం.. చెన్నై హైకోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
(చదవండి: ఆ దురలవాటు కట్టడికిదే సమయం: మోదీ)
ఆఘటన వివరాలిలా.. చెన్నైకి చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ సైమన్ హెర్కులస్ కరోనా వైరస్ బారిన పడి ఏప్రిల్ 19వ తేదీన మరణించారు. ఆయన మృతదేహాన్ని కిల్‌పాక్ ప్రాంతంలోని శ్మశానంలో ఖననం చేసేందుకు మున్సిపల్ అధికారులు అనుమతించారు. అక్కడికి మృతదేహం తీసుకెళ్లాక ఖననం చేసేందుకు స్థానికులు అనుమతించలేదు. దాంతో అన్నానగర్‌లోని శ్మశానానికి అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ స్థానికులు అంబులెన్స్‌ను అడ్డుకోవడంతోపాటు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అంబులెన్స్ డ్రైవర్, శానిటేషన్ వర్కర్, మున్సిపల్ ఉద్యోగి, ఇతరులు అంబులెన్స్‌ను వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది.
రాత్రి పొద్దుపోయాక డాక్టర్ సైమన్ స్నేహితుడు డాక్టర్ కె.ప్రదీప్ కుమార్, ఇతర సిబ్బందితో కలిసి స్వయంగా గొయ్యి తవ్వి మృత దేహాన్ని ఖననం చేశారు. ప్రభుత్వం తాజా నిర్ణయం సందర్భంగా గతవారం జరిగిన ఉదంతాన్ని తలుచుకుని ప్రదీప్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ బాధితులకు సేవలందించిన డాక్టర్ చనిపోతే.. ఇంతటి కర్కషంగా ప్రవర్తిసారా అని ప్రశ్నించారు. ఇదిలాఉండగా.. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కోవిడ్ పోరులో ముందుండే సిబ్బంది చనిపోతే రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడు వ్యాప్తంగా 1,821 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో చైన్నై, కోయంబత్తూరు,మధురై, తిరుపూర్, సాలెంలలోనే సగం కేసులున్నాయి.
(చదవండి: చివరకు అంత్యక్రియలపైనా అలజడి)
Comments
Please login to add a commentAdd a comment