ముంబై: వయసు చిన్నదే, కానీ మనసు పెద్దది, ఆశయం అంతకన్నా పెద్దది. ఇంకేముందీ.. తన చిట్టి చిట్టి చేతులతో కుకీస్ తయారు చేశాడు. వాటిని అమ్ముతూ పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించాడు. అనంతరం వచ్చిన సొమ్మునంతటినీ ముంబై పోలీస్ ఫౌండేషన్‌కు అందించాడు. ముంబైలోని కబీర్ అనే ఓ మూడేళ్ల బాలుడు కప్ కేకులు తయారు చేశాడు. కేకులు తినే వయసులో వాటిని తయారు చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును.. దాని వెనక పెద్ద సంకల్పమే ఉంది. తను సొంతంగా తయారు చేసిన కేకులను అమ్ముతూ కరోనా వ్యతిరేక పోరుకు తాను సైతం అంటూ విరాళాలు సేకరించాడు. (ఆడితే ఆడావు.. వాటిపై కాలు మాత్రం పెట్టకు)
రూ.10 వేలు లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ అంచనాలను మించి రూ.50 వేల వరకు వచ్చాయి. దీంతో ఎంతగానో సంబరపడిపోయిన కబీర్ యాభైవేల రూపాయల చెక్కును తన తల్లిదండ్రులు కరీష్మా, కేశవ్‌లతో కలిసి ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌కు అందించాడు. అంతేకాక లాక్‌డౌన్‌లో అలుపెరగకుండా పోరాటం చేస్తున్న పోలీసుల నోరు తీపి చేస్తూ స్వీట్లు కూడా పంచాడు. బుడ్డోడి ఆరాటానికి ముచ్చటపడిన పోలీసులు అతడి గురించి సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు కబీర్‌ను చూసి ఆశ్చర్యానందాలకు లోనవుతున్నారు. "ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద ఆలోచనో" అంటూ పొగుడుతున్నారు. (మాస్టర్ చెఫ్‌కి యాక్షన్ హీరో అవార్డ్)
Comments
Please login to add a commentAdd a comment