దేశంలో నల్లడబ్బు 30 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: దేశంలో నల్లడబ్బు దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు మూలుగుతోందని తమ అధ్యయనంలో తేలినట్లు అంబిట్ కాపిటల్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ఇది భారత జాతీయ స్థూల ఉత్పత్తిలో 20 శాతానికి సమానమని పేర్కొంది. అదే థాయ్‌లాండ్, అర్జెంటీనా దేశాల జాతీయ స్థూల ఉత్పత్తి కన్నా అధికమని తెలిపింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల బంగారం లేదా బులియన్ మార్కెట్లో నల్లడబ్బు పెట్టుబడులు తగ్గిపోయాయని, భౌతికంగానే నల్లడబ్బు మూలుగుతోందని అంబిట్ సంస్థ తెలియజేసింది. ఫార్మల్ బ్యాంకింగ్‌లో కూడా నల్లడబ్బు లావాదేవీలు గణనీయంగా తగ్గిపోవడంతో బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోయాయని, నల్లడబ్బు రుణాల రేట్లు గతేడాది 24 శాతం ఉండగా, ఇప్పుడు 34 శాతానికి పెరిగిందని వెల్లడించింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ప్రస్తుతం 30 శాతం నల్లడబ్బు చెలామణి అవుతోందని, ఒకప్పుడు ఇంతకన్నా ఎక్కువ శాతం ఉండేదని, రియల్ ఎస్టేట్‌లో రేట్లు పడిపోవడమే నల్లడబ్బు పెట్టుబడులు తగ్గాయనడానికి సూచన అని అంబిట్ సంస్థ పేర్కొంది. 1970, 80 ప్రాంతాల్లోనే దేశంలో నల్లడబ్బు ఎక్కువగా పేరుకుపోయినట్లు తమ అధ్యయనంలో తేలిందని ఆ సంస్థ వెల్లడించింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బును దేశానికి రప్పించడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విఫలమైనా బంగారం కొనుగోళ్లపై నిఘా వేయడం లాంటి చర్యల వల్ల దేశంలో నల్లడబ్బు లావా దేవీలను మోదీ ప్రభుత్వం తగ్గించగలిగిందని తెలిపింది.