పనామా దోషులకు శిక్ష పడుతుందా?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా లీకైన పనామా పత్రాల ద్వారా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, దిగ్గజాల పేర్లు వరుసగా బయటకు వస్తున్నాయి. ఆ పేర్లను చూసి అరే! వీళ్లున్నారే అంటూ మనం ఆశ్చర్యపడుతున్నాం. చట్టం ప్రకారమే తాము నడుచుకుంటున్నామని పేర్లు వెలుగులోకి వచ్చిన వారు సమర్థించుకుంటున్నారు. ఇంతవరకు సరే! భారత్‌లో పన్నులు ఎగవేస్తూ పనామాలో నకిలీ కంపెనీల పేరిట కోట్లాది రూపాయలు దాచుకున్న బిగ్ షాట్స్‌పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఆ అక్రమ డబ్బును వెనక్కి తీసుకొస్తుందా? అన్నది ప్రస్తుతం కోటానుకోట్ల రూపాయల ప్రశ్న.
పనామా అంత పెద్ద సంఖ్యలో కాకపోయినప్పటికీ ఇంతకుముందు స్విస్, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకుల జాబితాలు వెలువడ్డాయి. వాటి విషయంలో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? కనీసం విచారణ ఏ దశలో ఉందన్న వార్తలు కూడా రావడం లేదే! అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విదేశాల్లో మూలుగుతున్న భారతీయుల 70 వేలకోట్ల రూపాయలను భారత్‌కు రప్పిస్తామని బీరాలు పలికిన బీజేపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఆ దిశగా ఇసుమంతా విజయం సాధించలేదే! అలాంటి బీజేపీ ప్రభుత్వం పనామా విషయంలో ముందుకు కదులుతుందా? అంబానీ, అదానీ లాంటి పెద్దల జోలికి వెళ్లే సాహసం చేస్తుందా ?
కార్పొరేట్ దిగ్గజాలకు, ప్రభుత్వ పెద్దలకు మధ్యన సాన్నిహిత్యం సాగినంతకాలం, నీరా రాడియాలాంటి లాబీయిస్టుల కారణంగా కార్పొరేట్ సానుకూల చట్టాలు రూపొందినంతకాలం ఎన్ని అవినీతి కుంభకోణాలు వెలుగులోకి వచ్చినా వ్యవస్థలో ఎలాంటి మార్పు కనిపించదు. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తే పెద్ద చేపలను వదిలేసి చిన్న చేపలను పట్టుకుని అవినీతిపై చర్యలు తీసుకున్నామంటూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది.
పనామా లీక్స్ విషయంలో కూడా సరిగ్గా స్పందిస్తామని, ఇంటర్నేషనల్ ఆటోమేటిక్ ఇన్‌ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ ట్రీటి అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగస్వామి అవడం మాట అటుంచి, కనీసం ఈ ఒప్పందం పట్ల సానుకూలంగా కూడా స్పందించని పనామా ప్రభుత్వం పట్ల ఈ ట్రీటీ కింద ఎలా చర్యలు తీసుకుంటారో అరుణ్ జైట్లీకే తెలియాలి. పైగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ రూపొందించిన ఈ ఒప్పందంలోనే ఎన్నో లొసుగులు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చర్యలు ఉంటాయో ఊహించవచ్చు.
పనామాలాంటి అవినీతి కేసుల్లో దర్యాప్తు చాలావరకు అంతర్జాతీయ లేఖలు, ప్రత్యుత్తరాల వరకే పరిమితం అవుతుంది. తాము ఎంత చిత్తశుద్ధితో దోషులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా పని జరగడం లేదని, అందుకు అంతర్జాతీయ ఒప్పందాలు అడ్డు వస్తున్నాయని భారత్ లాంటి దేశాలు సాకులు చెప్పి తప్పించుకోవడమూ సహజమే. అడ్డం పడుతున్న ఒప్పందాలు సవరించుకోవచ్చుగదా, వాటి కోసం చిత్తశుద్ధితో కృషి చేయవచ్చుగదా!
పనామా చిట్టాల్లో బయటపడ్డ వారిలో ఎక్కువ మంది చట్ట నిబంధనల ప్రకారమే విదేశాల్లో వ్యాపార లావాదేవీలు నెరుపుతుండవచ్చు. చట్టప్రకారమే అయినప్పటికీ వాటిల్లో నైతికతపాలు ఎంతన్నది మనకు ముఖ్యం. నైతికత ఆధారంగా చట్టాలు రూపొందించినప్పుడు, దాని ఆధారంగానే న్యాయవ్యవస్థ తీర్పులు వెలువరించినప్పుడు మాత్రమే ఇలాంటి అంశాల్లో న్యాయం జరుగుతుంది.
నైతికత మూలసూత్రంగానే చట్టాలు, శాసనాలతోపాటు ఆర్బీఐ నియంత్రణా వ్యవస్థలో మార్పులు వస్తేగానీ పనామా దోషులకు శిక్ష పడదు. చెట్టాపట్టాలేసుకొని నడుస్తున్న రాజకీయ, కార్పొరేట్ వ్యవస్థలను విడదీసి సరైన చట్టాల రూపకల్పనకు మార్గం పడాలంటే, ప్రభుత్వ తీరులో పారదర్శకత కనిపించాలంటే ప్రజల్లో చైతన్యం రావడమే తక్షణ అవసరం. పనామా స్కామ్‌లోనే ఐస్‌లాండ్ ప్రధాన మంత్రిని గద్దె దించిన అక్కడి ప్రజల చైతన్యమే ప్రస్తుతం మనకు స్ఫూర్తికావాలి.