ఆ కోర్సులకు 371డి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవు | 371D not applys for neet | Sakshi
Sakshi News home page

ఆ కోర్సులకు 371డి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవు

Published Fri, Aug 25 2017 2:05 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

ఆ కోర్సులకు 371డి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవు - Sakshi

ఆ కోర్సులకు 371డి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎన్టీఆర్, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని ‘డీఎం, ఎంసీహెచ్‌’ సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల సీట్ల భర్తీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

  పీజీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సీట్లపై స్పష్టం చేసిన హైకోర్టు
  మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేత.. సీట్ల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌
నీట్‌ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించిన ధర్మాసనం
సెప్టెంబర్‌ 11న తుది విచారణ చేపడతామని వెల్లడి
 


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎన్టీఆర్, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని ‘డీఎం, ఎంసీహెచ్‌’ సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల సీట్ల భర్తీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆ కోర్సుల్లో సీట్ల భర్తీపై ఇటీవల విధించిన స్టేను గురువారం ఎత్తివేసింది. ఈ రెండు విశ్వవిద్యాలయాల పరిధిలోని విద్యా సంస్థలన్నీ కూడా జాతీయ స్థాయి కౌన్సెలింగ్‌ (నీట్‌) ద్వారా సూపర్‌ స్పెషాలిటీ సీట్లను భర్తీ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికరణ 371డి, రాష్ట్రపతి ఉత్తర్వులు ఈ కోర్సులకు వర్తించవని తేల్చి చెప్పింది. అయితే తెలంగాణ, ఏపీల విద్యార్థులకు ఇప్పుడు 371డి, రాష్ట్రపతి ఉత్తర్వులు గుదిబండగా మారాయని వ్యాఖ్యానించింది. ఇవి ముఖ్యమైన అంశాలని, వీటిపై తుది విచారణ సమయంలో తేలుస్తామని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణ్యన్, జస్టిస్‌ తేలప్రోలు రజనిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర ఉత్తర్వులు సమంజసమే..
ఎన్టీఆర్, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాల పరిధిలో సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల సీట్లను జాతీయ స్థాయి కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ డాక్టర్‌ బి.సతీశ్‌కుమార్, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై ఈ నెల 17న విచారణ జరిపిన ధర్మాసనం.. సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో సీట్ల భర్తీపై స్టే విధించింది. తాజాగా గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సీట్ల భర్తీపై కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదని తేల్చి చెప్పింది. ‘‘కేసు ఎంత మంచిదైనా, కేసు దాఖలు చేసిన వ్యక్తికి అనుకూలంగా ప్రాథమిక ఆధారా లున్నా కూడా... మధ్యంతర ఉత్తర్వుల ద్వారా తాను పొందే ప్రయోజనం అధిక సంఖ్యాకులకు నష్టదాయకమైతే, ఆ వ్యక్తి అటువంటి మధ్యంతర ఉత్తర్వులను పొంద జాలడు.. ఈ వ్యాజ్యాల్లో ఈ నెల 17న మేం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు కొంత మందికి లబ్ధి చేకూరుస్తాయి. కానీ దేశ వ్యాప్తంగా సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవే శాలు పొందిన అనేక మందికి కష్టతరంగా మారాయి. వారంతా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారే. కాబట్టి ‘బ్యాలెన్స్‌ ఆఫ్‌ కన్వీనియన్స్‌’, వారికి కలుగుతున్న కష్టా న్ని పరిగణనలోకి తీసుకుంటూ స్టేను ఎత్తి వేస్తున్నాం..’’ అని ధర్మాసనం పేర్కొంది.

తుది విచారణలో తేలుస్తాం
రాష్ట్రపతి ఉత్తర్వులు, 371డి అధికరణల వర్తింపునకు సంబంధించిన ప్రశ్నలకు అత్యంత ప్రాముఖ్యత ఉందని.. వాటిని ఈ వ్యాజ్యాల్లో తుది విచారణ సమయంలో తేలుస్తామని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం తమ ఉత్తర్వులను సందీప్‌ కేసులో నీట్‌ను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఇస్తున్నామని తెలిపింది. ‘‘రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయాలన్న మా మధ్యంతర ఉత్తర్వుల ద్వారా తలెత్తే పరిణామాలను అంచనా వేయలేకపోయాం. మా ఉత్తర్వుల తరువాత ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాలు పొందిన తెలంగాణ, ఏపీ విద్యార్థుల ప్రవేశాలను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ రద్దు చేసింది. ఇలా చాలా మంది విద్యార్థుల ప్రయోజనాలను పణంగా పెట్టలేం. అందువల్ల ఈ అంశంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో కొందరు విద్యార్థులు పొందిన ప్రవేశాల రద్దు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని ఆదేశిస్తున్నాం. తుది విచారణను సెప్టెంబర్‌ 11న చేపడతాం..’’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

371డి ఆటోమేటిక్‌గా పోవాల్సి ఉంది
వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పుడే 371డి అధికరణ దానంతట అదే తొలగిపోయినట్లని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ అసమతుల్యతను తొలగించడానికి అధికరణ 371డిని తీసుకొచ్చారు. అంతేతప్ప దేశంలోని మిగతా రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్‌కు మధ్య కాదు. ఒక ఇంట్లో విభజన గోడను నిర్మిస్తే.. దానిని ప్రహరీగోడగా భావించడానికి వీల్లేదు. అలాగే 371డి కింద ఉన్న రక్షణను జాతీయస్థాయికి విస్తరింప చేయడానికి వీల్లేదు. అసలు పార్లమెంట్‌ ఉద్దేశం కూడా ఇది కాదు. 371డిని తాత్కాలిక, సంధికాల, ప్రత్యేక ప్రొవిజన్‌గా రాజ్యాంగంలో పేర్కొన్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైంది. ఆ తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలకు అభివృద్ధి, విద్యా, ఉపాధి అవకాశాల్లో కొన్ని రక్షణలు కల్పిస్తూ 371డిని తీసుకొచ్చారు. అయినా తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష చల్లారిపోలేదు. 2009 తరువాత కూడా ఆందోళనలు కొనసాగి 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఏ ప్రాంతం కోసమైతే 371డిని తీసుకొచ్చారో అదిప్పుడు స్వతంత్ర రాష్ట్రమైంది. 1956 నుంచి 1969 వరకు చేస్తూ వచ్చిన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను తోసిపుచ్చి.. దాని స్థానంలో 371డి రూపంలో చిన్న లబ్ధి చేకూర్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైన నేపథ్యంలో రాయితీ కింద ఇచ్చిన ఆ చిన్న లబ్ధి దానంతట అదే (ఆటోమేటిక్‌గా) పోవాల్సి ఉంది..’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఒకరికి లబ్ధి.. మరొకరు బాధితులు
రాష్ట్రపతి ఉత్తర్వులు, అధికారుల తీరు, చట్ట నిబంధనలు, న్యాయ స్థానాల తీర్పుల వల్ల తెలంగాణ, ఏపీల్లోని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు దేశంలోని మిగతా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను చేర్చుకునే పరిస్థితి లేదని... ఈ నిషేధం వల్ల విద్యార్థులు ఒకరిపై ఒకరు జాలిపడే పరిస్థితి వచ్చిందని ధర్మాసనం పేర్కొంది. సమస్య తీవ్రతను ఎవరూ పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించింది. ‘‘రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల ఒక గ్రూపు విద్యార్థులు లబ్ధి పొందుతుంటే.. మరో గ్రూపు విద్యార్థులు బాధితులుగా మారుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పోస్టులను జిల్లా, ప్రాంతీయ, రాష్ట్రస్థాయి పోస్టులుగా విభజించారు. అఖిల భారత సర్వీసులకు ఈ ఉత్తర్వులు వర్తించవు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) తీసుకొచ్చిన చట్ట సవరణతో పీజీ మెడికల్‌ కోర్సులు, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు కూడా అఖిల భారత సర్వీసుల్లా అయ్యాయి. కాబట్టి ఈ కోర్సులకు అధికరణ 371డి, రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవు..’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

గుదిబండగా మారాయి
‘‘40 ఏళ్ల క్రితం ఏ ప్రయోజనం కోసమైతే పోరాడారో దానికే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన చాలా మంది విద్యార్థులు బాధితులుగా మారారు. ఉభయ రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో అందు బాటులో ఉన్న సీట్ల కంటే దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో.. ఈ రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఎన్నో రెట్లు అవకాశాలు న్నాయి. దీనిని బట్టి రాష్ట్రపతి ఉత్తర్వులు, 371డి అధికరణ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ప్రయోజనకరం కంటే గుదిబండగానే మారాయి...’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement