సాక్షి, కరీంనగర్(జమ్మికుంట): సరస్వతీ పుత్రుడికి లక్ష్మీ కటాక్షం కరువైంది. పట్టుదలతో మెడిసిన్ సీటు సాధించిన ఆ యువకుడి డాక్టర్ విద్యకు పేదరికం అడ్డు పడుతుంది. కూలీ పని చేసుకుంటే కాని పూటగడవని ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం వేడుకుంటున్నారు. వివరాలు.. జమ్మికుంట మున్సిపల్ పరిధి ధర్మారం గ్రామంలోని రెండో వార్డుకు చెందిన మోతే అశోక్– రాణి దంపతుల కుమారుడు మోతే జయంత్. అశోక్ నాలుగు రేకులు వేసుకొని, చుట్టూ పరదాలు కప్పుకొని, ఆటో అద్దెకు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జయంత్ సోషల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకొని ఎంబీబీఎస్ సీటు సాధించాడు.
1 నుంచి 6వ తరగతి వరకు ఇల్లందకుంట జిల్లా పరిషత్ పాఠశాల, పదో తరగతి వరకు మానకొండూరులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యనభ్యసించి, హైదరాబాద్‌లోని గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. మెడిసిన్ సీటు వచ్చిందని ఆ తల్లితండ్రులు ఎంతో సంబరపడ్డా.. కుమారుడి చదువు కోసం ఫీజు చెల్లించలేని స్థితిలో కూడా లేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదరికం అతడిని వెంటాడుతున్నా పట్టుదలతో చదివి ఇటీవల నిర్వహించిన నీట్‌లో 463 మార్కులతో 2,700 ర్యాంక్ సాధించాడు. ఈనెల 8న నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫీజు చెల్లించి ప్రవేశం పొందాలి. మెడిసిన్ చదువుకు ఏడాదికి రూ.1లక్షకు పైగా ఖర్చువుతుంది. పేద తల్లిదండ్రులు అంత మొత్తంలో ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేదంటున్నారు. దాతలు పెద్ద మనసుతో ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేయండి సారు.. డాక్టర్ చదువుకొని, భవిష్యత్‌లో పేదలకు సేవ చేస్తానని అంటున్నాడు జయంత్.
కేటీఆర్ హామీ
అయితే నీట్‌లో మంచి ర్యాంకు సాధించి.. యువకుడి ఆర్థిక పరిస్థితి చూసి చలించిపోయిన పలువురు తమకు తోచిన సాయం చేస్తున్నారు. మరికొంతమంది యువకుడిని ఆదుకోవాలంటూ ‘సాక్షి కథనాన్ని’ ట్విటర్‌లో పోస్టు చేస్తూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. దగ్గరుండి అతనికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై సమన్వయం చేసుకోవాల్సిందిగా మంత్రి కార్యాలయానికి సూచించారు.
Will take care personally @KTRoffice please coordinate https://t.co/eYx0boCgYC
— KTR (@KTRTRS) November 4, 2022
దాతలు సాయం చేయాల్సిన అడ్రస్
మోతే జయంత్
అకౌంట్ నం : 026312010000566
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ UBI0802638,
యూనియన్ బ్యాంకు, జమ్మికుంట బ్రాంచ్
Comments
Please login to add a commentAdd a comment