
నిర్లక్ష్యమే నిండుప్రాణాలు తీసింది!
‘ఉత్కళ్’ ప్రమాద కారణాలపై విచారణ
► నిర్లక్ష్యం, సమాచారలోపమే కారణమని ప్రాథమిక నిర్ధారణ
► ‘నిర్వహణ లోపం’పై వైరల్ అవుతున్న ఆడియోక్లిప్
► మృతులు 22.. క్షతగాత్రులు 156: సర్కారు అధికారిక ప్రకటన
న్యూఢిల్లీ/ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ రైలు ప్రమాద దుర్ఘటనకు మానవతప్పిదమే కారణమని రైల్వే శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ ప్రాంతంలో రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతున్నట్లు తెలియటంతో.. ఈ పనులకు అనుమతి ఉందా? స్టేషన్ మేనేజర్‌కు సమాచారం ఇచ్చారా? అనే అంశాలపై విచారణ జరుగుతున్నట్లు స్పష్టం చేసింది. కాగా, రైల్వే ఇంజనీరింగ్ విభాగం వెల్లడించిన సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగిన ట్రాక్‌పై చిన్నపాటి మరమ్మతు పనులు జరుగుతున్నందున 20 నిమిషాల పాటు ఈ ట్రాక్‌పైకి అనుమతించకూడదని సూచించినట్లు తెలిసింది. అయితే తనకు మరమ్మతులకు సంబంధించిన సమాచారమేదీ లేదని స్టేషన్ సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.
దీంతో అధికారుల నిర్లక్ష్యం, సమాచారలోపమే ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఘటన జరిగిన తర్వాత ఇద్దరు రైల్వే ఉద్యోగుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ లభ్యమైంది. ‘ఘటన జరిగిన ట్రాక్‌పై వెల్డింగ్ పని నడుస్తోంది. సమీపంలోని క్రాసింగ్ వద్ద గేట్లను మూసేశారు. కార్మికులు ట్రాక్‌పై ఓ బ్లాక్‌ను వెల్డింగ్ చేస్తుండగానే.. ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. 14 బోగీలు పట్టాలు తప్పాయి’ అని వారిద్దరు మాట్లాడుకున్నట్లు ఆడియో క్లిప్ ద్వారా స్పష్టమైంది. విద్రోహ కోణమా? సాంకేతిక లోపమా? పూర్తి మానవ తప్పిదమేనా? అనే అంశాలపైనా విచారణ జరుగు తుందని రైల్వే బోర్డు (ట్రాఫిక్) సభ్యుడు జంషెడ్ మహ్మద్ తెలిపారు.
కాగా, శనివారం నాటి ఈ దుర్ఘటనలో 22 మంది మృతి చెందారని.. 156 మందికి గాయాలైనట్లు యూపీ సర్కారు అధికారికంగా ప్రకటించింది. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని యూపీ సమాచార శాఖ ప్రధాన కార్యదర్శి అవనీశ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై రైల్వే శాఖమంత్రి సురేశ్ ప్రభు విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా ఈ ఘటనకు బాధ్యులెవరనేది ఆదివారం సాయంత్రం కల్లా తనకు తెలపాలని రైల్వే బోర్డు చైర్మన్‌ను మంత్రి ఆదేశించారు. కాగా, రైలు ప్రమాద ఘటనల్లో ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా లింక్ హాఫ్‌మన్ బుష్ (ఎల్‌బీహెచ్) కోచ్‌లను దశలవారిగా తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ కొంతకాలంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ఘటనలో నలుగురు అధికారులను సస్పెండ్ చేయగా సెక్రటరీ స్థాయి అధికారి సహా ముగ్గురిని రైల్వేశాఖ సెలవుపై పంపింది.