నాలుగేళ్లలో 41 ఎయిర్ క్రాషెస్
న్యూఢిల్లీ: గత నాలుగేళ్లలో మిలిటరీకి సంబంధించి 41 గగనతల ప్రమాదాలు సంభవించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రమాదాలకు గురైన వాటిలో విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయని, 65 మంది మృత్యువాత పడ్డారని చెప్పింది. అయితే, సామాన్య పౌరులెవరూ ఈ ప్రమాదాల కారణంగా చనిపోలేదని స్పష్టం చేసింది. లోక్ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖమంత్రి మనోహర్ పారికర్ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
అందులో 'ఏప్రిల్ 1, 2012 నుంచి జూలై 2016 మధ్య అంటే నాలుగేళ్లలో శిక్షణలో ఉన్న హెలికాప్టర్లు, విమాన ప్రమాదాలు 41 చోటుచేసుకున్నాయి. వీటివల్ల 65 మంది చనిపోయారు. ఇందులో వైమానిక విభాగానికి చెందిన ఎయిర్ క్రాష్ లు ఎక్కువగా (28) ఉన్నాయి. అలాగే పాదాతి దళానికి చెందిన హెలికాప్టర్ల ప్రమాదాలు ఏడు జరగగా.. నావికా దళానికి చెందిన ప్రమాదాలు నాలుగు జరిగాయి' అని ఆయన చెప్పారు.