
చాక్లెట్.. పేరు వినగానే నోరూరిపోతుంది. దీన్ని ఇష్టపడని వారు నూటికో కోటికో ఒక్కరుంటారు. అలాంటి చాక్లెట్ కరోనా సమయంలోనూ చాలామంది ఇళ్లలో తిష్టవేసిందట. కరోనా భయంతో పదేపదే కిరాణా షాపుకు వెళ్లలేని వారు ఒక్కసారిగా నెలకు సరిపడా సామాన్లు తెచ్చేసుకుంటారు. అయితే అలా తెచ్చుకునే లిస్టులో చాక్లెట్ ముందు వరుసలో ఉందని ఓ అధ్యయనం తెలుపుతోంది. లక్నోలోని ఐఐఎమ్(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్) అధ్యయనం ప్రకారం ఈ లాక్‌డౌన్‌లో 42 శాతం భారతీయులు చాక్లెట్‌ను ముందస్తుగా తెచ్చేసుకుని ఇంట్లో నిల్వ పెట్టుకున్నారు. స్కూళ్లు లేకపోవడంతో పిల్లల అల్లరికి కళ్లెం వేయాలంటే చాక్లెట్‌ను మించిన పరిష్కారం లేదు. (చిరు వ్యాపారులపై ఫేస్‌బుక్ సర్వే)
ఇష్టమైన బ్రాండ్లకే మొగ్గు
దీంతో చాక్లెట్ కొనే తల్లిదండ్రుల సంఖ్య బాగా పెరిగిపోయింది. తొలి దశ లాక్‌డౌన్‌లో 39 శాతం వినియోగదారులు ఎప్పుడూ తినే చాక్లెట్లు కాకుండా కొత్త బ్రాండ్లను టేస్ట్ చేసేందుకు మొగ్గు చూపారు. కానీ రెండో దశకు వచ్చేసరికి 54 శాతం మంది మళ్లీ తమకు ఇష్టమైన బ్రాండ్లను కొనుగోలు చేశారు. మొత్తంగా 75 % మంది బియ్యం, 65 % గోధుమ పిండిని ఎక్కువ మోతాదులో తెచ్చుకుని ముందుగానే నిల్వ చేసి పెట్టుకున్నారు. కూరగాయల విషయానికొస్తే.. ఉల్లిపాయలు, ఆలుగడ్డలు నిల్వ చేసుకున్న లిస్టులో ఉన్నాయి. ఇవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండటం కూడా ఓ కారణమే. (చిన్నారుల్లో కరోనా ప్రభావం తక్కువే: సర్వే)
కొత్త ప్రయోగాలతో వంటింట్లో గడిపేస్తున్న జనాలు
ప్రజల్లో పరిశుభ్రత స్పృహ గణనీయంగా పెరిగింది. 40 శాతం మంది సానిటరీ న్యాప్‌కిన్లు, టిష్యూలు, న్యాపీస్ కొనుక్కోగా 39 శాతం మంది క్రిమి సంహారకాలను కొనుగోలు చేశారు. అలాగే లాక్‌డౌన్ కాలంలో 53 శాతం మంది టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుండగా, 45 % ఆన్‌లైన్ కార్యకలాపాల్లో పాల్గొనడం, నిద్రపోవడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. కేవలం 24 శాతం జనాలు మాత్రం పుస్తకాలు చదువుతున్నారు. ఇక వంటచేసేవారి సంఖ్య పెరగడం విశేషం. 44 % కొత్త కొత్త ప్రయోగాలతో వంటింట్లోనే గడిపేస్తున్నారు. 20 శాతం మంది ధ్యానం చేస్తున్నారు. అధ్యయనకారుడు ప్రొఫెసర్ సత్య భూషణ్ దాస్ మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోందన్నారు. అలాగే కుటుంబంతో కలిసి కాలక్షేపం చేస్తుండటం శుభపరిణామం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment