
జపాన్ యువతిపై గ్యాంగ్ రేప్.. నిందితుల అరెస్ట్
బుద్ధగయ: బీహార్లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం బుద్ధ గయలో దారుణం జరిగింది. జపాన్ నుంచి వచ్చిన ఓ విద్యార్థిని (22) ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను పరో అనే గ్రామంలో నిర్బంధించి, మూడు వారాలుగా ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. దుండగుల బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు నిందితులు టూరిస్ట్ గైడ్లుగా ఆమెతో పరిచయం చేసుకున్నారు. నవంబర్లో ఆమె తొలుత కోల్కతాకు వచ్చింది. అక్కడ ముగ్గురు వ్యక్తులు ఆమెకు పరిచయమయ్యారు. ముగ్గురు కలసి ఆమెను బుద్ధగయకు కారులో తీసుకెళ్లారు. ఇందుకోసం 76 వేల రూపాయలు అద్దె వసూలు చేశారు. అక్కడ మరో్ ఇద్దరు వ్యక్తులు వీరితో కలిశారు. ఐదుగురు ఆమెను ఓ గదిలో బంధించి దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని వారణాశికి చేరుకుంది. అక్కడ నుంచి కోల్కతా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.