Bodh Gaya
-
దలైలామాపై చైనా గూఢచారి నిఘా
దలైలామాపై చైనా గూఢచారి నిఘా -
దలైలామా భద్రతపై అలర్ట్.. పోలీసుల అదుపులో ‘చైనా మహిళ’
పట్నా: బౌద్ధమత గురువు దలైలామా బిహార్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం బుద్ధగయాలో పర్యటిస్తున్నారు. మూడురోజుల పాటు సాగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. దలైలామా పర్యటన వేళ భద్రతాపరమైన అలర్ట్ ప్రకటించారు పోలీసులు. దలైలామాపై గూఢచర్యానికి పాల్పడుతోందన్న అనుమానాలతో చైనాకు చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమెను తిరిగి చైనా పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దలైలామా పర్యటన వేళ చైనా మహిళ అనుమానాస్పద కదలికలపై గురువారం స్థానిక పోలీసులను అలర్ట్ చేశారు అధికారులు. ఆమె ఆనవాళ్లను సూచించే ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. ఆమె పేరు సాంగ్ షియావోలాన్ అని పోలీసులు తెలిపారు. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు హాని తలపెట్టేందుకు వచ్చినట్లు అనుమానిస్తున్నామని వెల్లడించారు. ‘గయాలో నివసిస్తున్న చైనా మహిళ గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఆమె గత రెండేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పోలీసులను అప్రమత్తం చేశాం. చైనా మహిళ కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చైనా మహిళ ఎక్కడ ఉందనే విషయంపై స్పష్టత లేదు. ఆమె చైనా గూఢచారి అనడాన్ని కొట్టిపారేయలేం.’ అని తెలిపారు గయా సీనియర్ ఎస్పీ హర్‌ప్రీత్ కౌర్. ఆమె ఊహాచిత్రాలు బుధవారం నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చైనా మహిళ గురించి తెలిసిన వారు సమాచారం అందివ్వాలని పోలీసులు కోరుతున్నారు. చైనా గూఢచారి అయిన ఆ మహిళ బుద్ధగయాతో పాటు పలు ప్రాంతాల్లో ఏడాదికిపైగా నివసిస్తున్నట్లు తెలిసింది. అయితే, విదేశాంగ శాఖ వద్ద ఆమె గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. బుద్ధగయాకు గత వారు చేరుకున్నారు దలైలామా. కోవిడ్-19 కారణంగా బుద్ధ పర్యటక ప్రాంతమైన బుద్ధగయాను రెండేళ్ల తర్వాత సందర్శించారు. గయా అంతర్జాతీయ విమానాశ్రయానికి డిసెంబర్ 22న చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ త్యాగరాజన్, ఎస్పీ హర్‌ప్రీత్ కౌర్ ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 29-31 వరకు జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది బౌద్ధ సన్యాసులు ఇప్పటికే బిహార్‌కు చేరుకున్నారు. ఇదీ చదవండి: బెంగాల్ కేబినెట్ మంత్రి ఆకస్మిక మృతి.. మమతా బెనర్జీ దిగ్భ్రాంతి -
బోధ్ గయ పేలుళ్లకు హైదరాబాద్‌లోనే కుట్ర!
సాక్షి, సిటీబ్యూరో: బీహార్‌లోని బోధ్ గయలో ఏడాది క్రితం చోటు చేసుకున్న మూడు పేలుళ్లకు కుట్ర హైదరాబాద్ నుంచే జరిగిందా..? ఔననే అంటున్నారు దర్యాప్తు అధికారులు. అప్పట్లో మారేడ్‌పల్లి ప్రాంతంలో తలదాచుకున్న సూత్రధారి కౌసర్ పర్యవేక్షణలోనే ఈ పేలుళ్లు జరిగాయని పేర్కొంటున్నారు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం పట్నాలోని ప్రత్యేక న్యాయస్థానంలో సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అందులోనే హైదరాబాద్ ప్రస్తావన తీసుకువచ్చింది. మయన్మార్‌లో రోహింగ్యాలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రతీకారం తీర్చుకోవాలని జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ఉగ్రవాద సంస్థ భావించింది. బౌద్ధుల ప్రార్థన స్థలాలను టార్గెట్ చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో పాటు తమ ప్రతీకారం తీర్చుకోవాలని వీరు భావించారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ జహీదుల్ ఇస్లాం అలియాస్ కౌసర్ జేఎంబీలో కీలకపాత్ర పోషించారు. ఆ సంస్థ తరఫున బంగ్లాదేశ్‌లో అనేక పేలుళ్లకు పాల్పడటంతో కొన్నేళ్ల క్రితం అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. రెండేళ్ల క్రితం జైలు నుంచి తప్పించుకున్న ఇతను పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా మీదుగా భారత్‌లోకి చేరుకున్నాడు. అనేక ప్రాంతాల్లో తలదాచుకున్న అనంతరం చెన్నైతో పాటు హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలోనూ కొన్నాళ్లు వ్యాపారిగా షెల్టర్ తీసుకున్నాడు. అక్కడ ఉండగానే బీహార్‌లోని బోధ్‌గయను టార్గెట్‌గా ఎంచుకున్నాడు. దీనిపై తనకు జేఎంబీ కేడర్‌కు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించిన దిల్వార్ హోస్సేన్‌కు సమాచారం ఇచ్చాడు. రెండు రోజులకే మారేడ్‌పల్లికి వచ్చిన హోస్సేన్ నేరుగా వెళ్లి కౌసర్‌ను కలిశాడు. వీరిద్దరూ చర్చించిన తర్వాత బోధ్‌గయలోనే పేలుళ్లకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తమ అనుచరులైన ఆదిల్ షేక్, అబ్దుల్ కరీం, రెహ్మాన్, ఆరిఫ్‌లకు తెలిపి హైదరాబాద్ రప్పించారు. నవంబర్ 20న సిటీకి వచ్చిన వీరు డిసెంబర్ 15 వరకు ఇక్కడే ఉన్నారు. ఆ మధ్య కాలంలోనే కుట్రను పూర్తి చేసిన కౌసర్ పేలుడు పదార్థాల సమీకరణ, రెక్కీ నిర్వహించడం, బాంబులు తయారు చేయడం, వాటిని నిర్దేశిత ప్రాంతాల్లో అమర్చడం వంటి బాధ్యతలు అప్పగించాడు. డిసెంబర్ 16న కౌసర్, హోస్సేన్ చెన్నైకు మిగిలిన వారు పట్నాకు వెళ్లిపోయారు. పథకం ప్రకారం ఈ ఉగ్రవాదులు గత ఏడాది జనవరి 19న బోధ్‌గయలోని మూడు చోట్ల తక్కువ తీవ్రతగల బాంబులను అమర్చారు. వీటిలో ఒకటి పేలగా... మరో రెండింటిని పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాల్లో నిందితును అరెస్టు చేసింది. వీరి విచారణలోనే సిటీ కోణం వెలుగులోకి వచ్చింది. దీంతో దర్యాప్తులో భాగంగా గత ఏడాది హైదరాబాద్‌కు వచ్చి ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాలను పరిశీలించి వెళ్లింది. -
బోధ్ గయను సందర్శించడానికి వచ్చి..
పాట్నా : బౌద్దుల పవిత్ర పుణ్యక్షేత్రం బోధ్ గయాను దర్శించడానికి వచ్చిన ఓ ఆస్ట్రేలియన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. వివరాలు.. సిడ్నికి చెందిన హీత్ అల్లాన్ అనే వ్యక్తి బోధ్ గయను దర్శింకుందామని బిహార్ వచ్చాడు. ఈ క్రమంలో సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం అడవికి వెళ్లిన స్థానికులకు ఉరేసుకుని మరణించిన హీత్ కనిపించాడు. వెంటనే వాళ్లు ఈ విషయం గురించి పోలీస్‌లకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హీత్ బ్యాగ్, డైరీ, వాటర్ బాటిల్‌తో పాటు ఓ సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిలో హీత్ తన సోదరి ఫోన్ నంబర్ రాసి.. ఈ విషయం గురించి ఆమెకి సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హీత్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
చదువు పేరిట బాలురతో...
పట్నా : బిహార్‌లోని బౌద్ధగయలో వెలుగుచూసిన ‘బాలురపై టీచర్ కీచక చర్య’లో కొత్తకోణం వెలుగుచూసింది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపుర నుంచి పేద కుటుంబాలకు చెందిన పిల్లలను చదువు పేరుతో తీసుకొచ్చి సెక్స్ వర్కర్లుగా పనిచేయిస్తున్నారని ఎస్పీ రమణ్‌కుమార్ చౌదురి నేతృత్వంలో ఏర్పాటైన సిట్ విచారణలో వెల్లడైంది. ప్రజ్ఞా జ్యోతి బుద్దిస్ట్ స్కూల్ అండ్ మెడిటేషన్ సెంటర్ పేరుతో బౌద్ధ సన్యాసి భంతే సంఘపియే సుజోయ్ నిర్వహిస్తున్న విద్యాలయం అసభ్య కార్యకలాపాలకు అడ్డాగా మారిందని సిట్ అధికారులు వెల్లడించారు. ప్రజ్ఞా జ్యోతి బుద్దిస్ట్ స్కూల్ అండ్ మెడిటేషన్ సెంటర్లో చదువుతున్న 15 మంది బాలురపై టీచర్ లైంగిక దాడికి యత్నించాడని ఆరోపణలు రావడంతో పోలీసులు బుధవారం ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల పోలీసు కస్టడీ విధించింది. కాగా, బాధిత విద్యార్థులను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చదువు చెప్పిస్తామని చెప్పి పేద పిల్లలను గయకు తరలించిన అనంతరం వారిపై లైంగిక, భౌతిక దాడులకు దిగినట్టు అధికారులు తెలిపారు. పిల్లలను సెక్స్‌వర్కర్లుగా కోల్‌కత వంటి నగరాలకు పంపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. పిల్లలతో మఠంలో రాత్రుళ్లు నగ్నంగా డ్యాన్సులు కూడా చేయించినట్టు విచారణలో వెల్లడైందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై అంతర్జాతీయ బుద్ధిస్ట్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. బౌద్ధ మతాన్ని భ్రష్టు పట్టించే ఇలాంటి చర్యలకు పూనుకున్నవారికి కఠిన శిక్ష పడాలని స్పష్టం చేసింది. కేసు విచారణకు పోలీసులకు పూర్తి మద్ధతు తెలుపుతున్నట్టు వెల్లడించింది. గయలో ఉన్న 160 మఠాలపై కార్యాకలాపాలపై ఇక నుంచి నిఘా వేస్తామని తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. మా పిల్లలకు చదువు చెప్తాం అని చెప్పి గయలోని బుద్దిస్ట్ స్కూల్ సన్యాసులు మమ్మల్ని కోరారు. ఒక్కో పిల్లాడికి వెయ్యి రూపాయలు ఇచ్చి తీసుకెళ్లార’ని తెలిపారు. -
బాలురపై టీచర్ కీచక చర్య..!
పట్నా : విద్యాబుద్ధులు చెప్తానని సుద్దులు పలికిన ఓ బౌద్ధ సన్యాసి తన స్కూల్లో చదువుతున్న విద్యార్థులపట్ల అసభ్యంగా ప్తవర్తించాడు. వారిపై లైంగిక దాడికి దిగడంతోపాటు గొడ్డును బాదినట్టు బాదాడు. ఈ ఘటన బౌద్ధగయలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. ‘ప్రజ్ఞా జ్యోతి బుద్ధిస్ట్ అండ్ మెడిటేషన్ సెంటర్’ పేరుతో బౌద్ధగయలోని మస్తీపూర్‌లో ఓ బౌద్ద సన్యాసి పాఠశాల నిర్వహిస్తున్నాడు. అస్సాం రాష్ట్రానికి చెందిన 15 మంది బాలురు అక్కడ విద్యనభ్యసిస్తున్నారు. స్కూల్లో టీచర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 15 మంది విద్యార్థులు ఆరోపించారు. తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించారు. కాగా, నిందితున్ని కస్టడీలోకి తీసుకున్నామని గయ ఎస్పీ రాజ్‌కుమార్ షా వెల్లడించారు. బిహార్‌లో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వంపై ఓవైపు ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండగా.. ఈ ఘటన జరగడం విశేషం. బిహర్‌లోని ముజఫర్‌పూర్‌లో షెల్టర్ హోం నిర్వహణ పేరుతో బాలికలపై లైంగిక దాడులు జరిగిన విషయం కొన్ని నెలల కిందట బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 24 మంది బాలికలు లైంగిక దాడికి గురైనట్టు వెల్లడైంది. -
ఉలిక్కి పడ్డ బుద్ధ గయ
పట్న : భారీ ఉగ్ర కుట్రను బిహార్ పోలీసులు భగ్నం చేశారు. అప్రమత్తమై బోధ్(బుద్ధ) గయలో మరో మారణ హోమం జరగకుండా నిలువరించగలిగారు. దలైలామ పర్యటన, రిపబ్లిక్ డే నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు శుక్రవారం సాయంత్రం రెండు క్రూడ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి.. తనిఖీలను విస్తృతం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... బౌద్ధ గురువు దలైలామా ప్రస్తుతం భోద్ గయలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తనిఖీలు కొనసాగుతుండగా.. శుక్రవారం సాయంత్రం వంట గదిలో ఓ స్వల్ఫ పేలుడు సంభవించింది. తొలుత గ్యాస్ లీకేజీ అని భావించిన పోలీసులు.. తర్వాత ఫ్లాస్క్‌లో బాంబు అమర్చి పేలుడుకు పాల్పడినట్లు నిర్ధారించారు. వెంటనే బాంబ్ స్వ్కాడ్ రంగంలోకి దిగి ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో కాలచక్ర మైదానంలో రెండు శక్తివంతమైన బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దలైలామా శుక్రవారం తన కార్యక్రమాలను ముగించుకుని వెళ్లిన కాసేపటికే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాగా, 2013 బుద్ధ గయలో వరుస పేలుళ్లు(9 చోట్ల) దేశం మొత్తాన్ని దిగ్ర్భాంతికి గురి చేశాయి. అయితే అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం మాత్రం సంభవించలేదు. ఈ ఘటన తర్వాత సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఆలయ ప్రాంగణంలో మోహరించేందుకు కేంద్ర హోం శాఖ ప్రయత్నాలు చేసినా.. అవి సఫలం కాలేదు. దీంతో ఆలయ సిబ్బంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకుంది. ఇది కూడా చదవండి... బుద్ధ గయపై నెత్తుటిచారిక -
బౌద్ధంలోకి 300 మంది హిందువులు
బౌద్ధుల పుణ్యక్షేత్రమైన బుద్ధగయలో సుమారు 300 మంది వెనుకబడిన కులాలకు చెందిన హిందువులు బౌద్ధమతం స్వీకరించారు. కుల వివక్ష, అంటరానితనం వదిలించుకోవడం కోసమే తాము బౌద్ధమతంలో చేరినట్లు మతమార్పిడి చేసుకున్నవారు తెలిపారు. బీహార్ లోని ఔరంగాబాద్, జహనాబాద్ జిల్లాలతోపాటు, మహరాష్ట్ర లోని నాగ్ పూర్, సతారా నగరాలనుంచి, మధ్యప్రదేశ్ జబల్ పూర్, రేవా నుంచి వచ్చిన వారంతా బౌద్ధంలో చేరినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మయన్మార్ కు చెందిన బౌద్ధ సన్యాసి చంద్రముని, బుద్ధ గయలోని బర్మా విహార్ ఆశ్రమంలో జరిగిన దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించిన బాబా సాహెబ్ అంబేద్కర్ మిషన్... ఈ హిందువుల మతమార్పిడి కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించినట్లు అధికారులు చెప్తున్నారు. -
మహాబోధి ఆలయంలో మోదీ ప్రత్యేక ప్రార్థనలు
గయ: కృష్ణాష్టమి పర్వదినం రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం బీహార్ లోని బుద్ధ గయలో పర్యటించారు. ఈ సందర్భంగా మహాబోధి ఆలయంలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బుద్ధుని సన్నిధిలో కొద్దిసేపు ధ్యానం చేశారు.అంతకు ముందు గయ విమానాశ్రయంలో మోదీకి అంతర్జాతీయ బౌద్ధుల సంఘం కార్యదర్శి లామా లోబోజాంగ్, మహాబోధి ఆలయం వద్ద ప్రధాన అర్చకుడు భాంటి ఛాలిందా స్వాగతం పలికారు. కాగా రెండు రోజుల క్రితం అంతర్జాతీయ బౌద్ధుల సమావేశం ఢిల్లీలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే దాని ముగింపు సమావేశం మాత్రం బుద్ధగయలో జగరనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరు అవుతారు. ప్రధాని పర్యటన సందర్భంగా మరోవైపు ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ) కి చెందిన 16 మంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. -
బుద్ధగయను సందర్శించిన లంక అధ్యక్షుడు
పాట్నా: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన బుద్ధగయను సందర్శించారు. మంగళవారం బుద్ధగయలోని పవిత్ర మహాబోధి ఆలయంలో ఆయన ప్రార్థనలు చేశారు. లంక అధ్యక్షుడి రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిసేన రేపు ఉదయం తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. -
జపాన్ యువతిపై గ్యాంగ్ రేప్.. నిందితుల అరెస్ట్
బుద్ధగయ: బీహార్‌లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం బుద్ధ గయలో దారుణం జరిగింది. జపాన్ నుంచి వచ్చిన ఓ విద్యార్థిని (22) ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను పరో అనే గ్రామంలో నిర్బంధించి, మూడు వారాలుగా ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. దుండగుల బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు నిందితులు టూరిస్ట్ గైడ్లుగా ఆమెతో పరిచయం చేసుకున్నారు. నవంబర్‌లో ఆమె తొలుత కోల్‌కతాకు వచ్చింది. అక్కడ ముగ్గురు వ్యక్తులు ఆమెకు పరిచయమయ్యారు. ముగ్గురు కలసి ఆమెను బుద్ధగయకు కారులో తీసుకెళ్లారు. ఇందుకోసం 76 వేల రూపాయలు అద్దె వసూలు చేశారు. అక్కడ మరో్ ఇద్దరు వ్యక్తులు వీరితో కలిశారు. ఐదుగురు ఆమెను ఓ గదిలో బంధించి దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని వారణాశికి చేరుకుంది. అక్కడ నుంచి కోల్‌కతా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బౌద్ధ క్షేత్రంపై ముస్కర పంజాకు ఏడాది.
-
మహాబోధి ఆలయానికి ఆదాయపన్ను నోటీసు
బీహార్‌లో ఇటీవల ఉగ్రవాదుల దాడికి గురైన మహాబోధి ఆలయానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఆదాయపన్ను శాఖ ఆ ఆలయానికి నోటీసులు జారీచేసింది. ఆలయ ఆదాయ, వ్యయాల వివరాలు సమర్పించాలంటూ మహాబోధి ఆలయ పాలకమండలికి ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్లు బుద్ధగయ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ (బీఎంటీసీ) ప్రతినిధి ఒకరు తెలిపారు. 64 ఏళ్ల క్రితం బుద్ధగయ ఆలయ చట్టం రూపొందిన తర్వాత ఈ ఆలయానికి ఆదాయపన్ను నోటీసు రావడం ఇదే తొలిసారి. ఈ విషయమై మంగళవారం నాడు ఆదాయపన్ను అధికారులతో భేటీ అయ్యి చర్చించనున్నట్లు బీఎంటీసీ సభ్య కార్యదర్శి ఎన్.దోర్జీ తెలిపారు. తాము కూడా చర్చించుకుని అప్పుడు నోటీసులకు సమాధానం పంపుతామని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చే విరాళాల రూపంలో ఆలయానికి 2012-13 సంవత్సరంలో 6.29 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. -
'మహాబోధి' పేలుళ్ల కేసును వేగవంతం చేయండి
బుద్ద గయలోని మహాబోధి దేవాలయంలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై చేపట్టిన విచారణ మరింత వేగవంతం చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చీఫ్ శరత్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆ పేలుళ్లపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ, బీహార్ రాష్ట్ర పోలీసులతో ఆయన బీహార్ రాజధాని పాట్నాలో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా కేసు పురోగతిపై శరత్‌కుమార్ ఆయా అధికారులతో చర్చించారు. అలాగే ఆ కేసులో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఎన్ఐఏ, బీహార్ పోలీసు ఉన్నతాధికారులు శరత్‌కుమార్‌కు ఈ సందర్బంగా వివరించారు. బీహార్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం బుద్ద గయలోని మహాబోధి దేవాలయం దేవాలయంలో పేలుళ్లు జరిగిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. భారత్ - నేపాల్ సరిహద్దుల్లో గురువారం బీహార్ పోలీసులకు చిక్కిన యాసిన్ భత్కల్‌కు ఈ పేలుళ్లతో సంబంధం ఉండవచ్చని శరత్ కుమార్ అనుమానించారు. అలాగే మావోయిస్టులు చర్య కావచ్చని దీన్ని తోసిపుచ్చుడానికి వీలు లేదన్నారు. జులై 7న మహాబోది దేవాలయంలో వరుసగా బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు బౌద్ధ బిక్షువులు గాయపడిన సంగతి తెలిసిందే. -
'మహాబోధి'భద్రతకు నెలకు రూ.50 లక్షలు!
బాంబు పేలుళ్ల నేపథ్యంలో బుద్ద గయలోని మహాబోధి ఆలయానికి పటిష్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అమీర్ సుభాని బుధవారం పాట్నాలో వెల్లడించారు. ఆ ఆలయ భద్రత బాధ్యతలను ఇకపై కేంద్ర పారిశ్రామిక భద్రత దళాల (సీఐఎస్ఎఫ్) సిబ్బంది పర్యవేక్షిస్తారని తెలిపారు. 261 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ ఆలయాన్ని పహరా కాస్తుంటారని చెప్పారు. అందుకోసం నెలకు రూ.50 లక్షలు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. సిబ్బంది జీతభత్యాల కింద ఆ మొత్తాన్ని రాష్ట్ర ఖజానా నుంచి చెల్లిస్తామని చెప్పారు. అయితే దీనిపై కేంద్ర హోం శాఖకు నివేదికను సమర్పించినట్లు తెలిపారు. తుది నిర్ణయం రావాలసి ఉందని అన్నారు. ఈ ఏడాది జూలై 7న మహాబోధి ఆలయంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. దాంతో ఆ రాష్ట ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని ప్రధానికి లేఖ రాశారు. అందుకు సంబంధించిన ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. దాంతో కేంద్ర హోం శాఖ మంత్రి షిండే ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్దుడు మహాబోధి దేవాలయంలోని వృక్షం కింద జ్ఞనోదయం పొందాడు. దీంతో దేశవిదేశాల నుంచి ఏటా వేలాది మంది పర్యాటకులు ఆ ఆలయాన్ని సందర్శిస్తారు. అంతేకాకుండా 2002లో యూనెస్కో ఆ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. -
బుద్ధగయ పేలుళ్ల కేసులో పూజారి అరెస్టు
బీహార్‌లోని బుద్ధగయ మహాబోధి ఆలయంలో సంభవించిన పేలుళ్ల కేసులో ఓ పూజారిని అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన అనూప్ బ్రహ్మచారి అనే పూజారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేలుళ్లు జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న బ్రహ్మచారిని రాష్ట్ర పోలీసుల సాయంతో ఎన్ఐఏ బృందం అరెస్టు చేసింది. అనూప్ బ్రహ్మచారిని ప్రస్తుతం భద్రతా కారణాల రీత్యా గయ పట్టణంలోని రాంపూర్ పోలీసు స్టేషన్లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అతడిని ఎన్ఐఏ బృందం విచారించనుంది. జూలై ఏడో తేదీన మహాబోధి ఆలయంలో జరిగిన పేలుళ్లలో మొత్తం పది బాంబులు పేలగా, మరో మూడింటిని ముందే గుర్తించి నిర్వీర్యం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి బుద్ధగయ ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది సహా పలువురిని ఎన్ఐఏ బృందాలు క్షుణ్ణంగా విచారించాయి. వినోద్ మిస్త్రి అనే అనుమానితుడితో సహా ఆరుగురిని ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకుంది. తాజాగా పూజారిని అరెస్టు చేసింది.