బుద్ధగయ పేలుళ్ల కేసులో పూజారి అరెస్టు
బీహార్లోని బుద్ధగయ మహాబోధి ఆలయంలో సంభవించిన పేలుళ్ల కేసులో ఓ పూజారిని అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన అనూప్ బ్రహ్మచారి అనే పూజారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేలుళ్లు జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న బ్రహ్మచారిని రాష్ట్ర పోలీసుల సాయంతో ఎన్ఐఏ బృందం అరెస్టు చేసింది.
అనూప్ బ్రహ్మచారిని ప్రస్తుతం భద్రతా కారణాల రీత్యా గయ పట్టణంలోని రాంపూర్ పోలీసు స్టేషన్లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అతడిని ఎన్ఐఏ బృందం విచారించనుంది. జూలై ఏడో తేదీన మహాబోధి ఆలయంలో జరిగిన పేలుళ్లలో మొత్తం పది బాంబులు పేలగా, మరో మూడింటిని ముందే గుర్తించి నిర్వీర్యం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి బుద్ధగయ ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది సహా పలువురిని ఎన్ఐఏ బృందాలు క్షుణ్ణంగా విచారించాయి. వినోద్ మిస్త్రి అనే అనుమానితుడితో సహా ఆరుగురిని ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకుంది. తాజాగా పూజారిని అరెస్టు చేసింది.