అరెస్టయిన భంతే సంఘపియే సుజోయ్
పట్నా : బిహార్‌లోని బౌద్ధగయలో వెలుగుచూసిన ‘బాలురపై టీచర్ కీచక చర్య’లో కొత్తకోణం వెలుగుచూసింది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపుర నుంచి పేద కుటుంబాలకు చెందిన పిల్లలను చదువు పేరుతో తీసుకొచ్చి సెక్స్ వర్కర్లుగా పనిచేయిస్తున్నారని ఎస్పీ రమణ్‌కుమార్ చౌదురి నేతృత్వంలో ఏర్పాటైన సిట్ విచారణలో వెల్లడైంది. ప్రజ్ఞా జ్యోతి బుద్దిస్ట్ స్కూల్ అండ్ మెడిటేషన్ సెంటర్ పేరుతో బౌద్ధ సన్యాసి భంతే సంఘపియే సుజోయ్ నిర్వహిస్తున్న విద్యాలయం అసభ్య కార్యకలాపాలకు అడ్డాగా మారిందని సిట్ అధికారులు వెల్లడించారు.
ప్రజ్ఞా జ్యోతి బుద్దిస్ట్ స్కూల్ అండ్ మెడిటేషన్ సెంటర్‌లో చదువుతున్న 15 మంది బాలురపై టీచర్ లైంగిక దాడికి యత్నించాడని ఆరోపణలు రావడంతో పోలీసులు బుధవారం ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల పోలీసు కస్టడీ విధించింది. కాగా, బాధిత విద్యార్థులను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చదువు చెప్పిస్తామని చెప్పి పేద పిల్లలను గయకు తరలించిన అనంతరం వారిపై లైంగిక, భౌతిక దాడులకు దిగినట్టు అధికారులు తెలిపారు. పిల్లలను సెక్స్‌వర్కర్లుగా కోల్‌కత వంటి నగరాలకు పంపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. పిల్లలతో మఠంలో రాత్రుళ్లు నగ్నంగా డ్యాన్సులు కూడా చేయించినట్టు విచారణలో వెల్లడైందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై అంతర్జాతీయ బుద్ధిస్ట్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. బౌద్ధ మతాన్ని భ్రష్టు పట్టించే ఇలాంటి చర్యలకు పూనుకున్నవారికి కఠిన శిక్ష పడాలని స్పష్టం చేసింది. కేసు విచారణకు పోలీసులకు పూర్తి మద్ధతు తెలుపుతున్నట్టు వెల్లడించింది. గయలో ఉన్న 160 మఠాలపై కార్యాకలాపాలపై ఇక నుంచి నిఘా వేస్తామని తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. మా పిల్లలకు చదువు చెప్తాం అని చెప్పి గయలోని బుద్దిస్ట్ స్కూల్ సన్యాసులు మమ్మల్ని కోరారు. ఒక్కో పిల్లాడికి వెయ్యి రూపాయలు ఇచ్చి తీసుకెళ్లార’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment