మిజో గుండెపై బాంబుల వర్షం
మిజో గుండెపై బాంబుల వర్షం
Published Mon, Mar 6 2017 7:48 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
మిజోరాం దేశ రాష్ట్రాల్లో ఒకటిగా అందరికీ తెలుసు. కానీ, మిజోరాం సొంత రాష్ట్రంగా ఏర్పడటానికి చేసిన ప్రయత్నాల గురించి.. తిన్న ఎదురుదెబ్బల గురించి మాత్రం కొందరికే తెలుసు. సొంత ప్రభుత్వంతో తన గుండెలపై బాంబుల వర్షం కురిపించుకున్న తొలి రాష్ట్రం మిజోరాం. అవును. మిజోరాంపై భారత ప్రభుత్వం బాంబుల వర్షం కురిపించింది. ఆ విషయాన్ని బయటకు రానికుండా ఎన్నో గొంతులు నులిమేసింది. అయినా నిజం ఎన్నటికీ చావదు. అందుకే ఆనాటి ప్రభుత్వ చర్య భవిష్యత్తు తరాలకు తెలియాలని కొందరు తమ పుస్తకాల్లో రాశారు.
1961లో అసోం నుంచి మిజోరాంను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్ పెరిగింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మిజో నేషనల్ ఫ్రంట్ అక్టోబర్ 28, 1961న ఏర్పడింది. తొలుత రాజకీయ అవసరాలను నేరవేర్చుకునేందుకు ఉద్యమం ప్రశాంతంగా సాగింది. ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర బలగాలు మానవహక్కులను ఉల్లంఘిస్తూ చేసిన ప్రయత్నాలు మిజో ప్రజలను విచక్షణ కోల్పోయేలా చేశాయి.
దాంతో మిజో నేషనల్ ఫ్రంట్ ఆయుధాలను చేత పట్టింది. బలగాలను మిజోరాం నుంచి పంపేయాలనే ఉద్దేశంతో మిజో నేషనల్ ఫ్రంట్ ఆపరేషన్ జెరికోను ప్రారంభించింది. ఐజ్వాల్, లుంగ్లేయ్‌ల్లోని అస్సాం రైఫిల్స్‌కు చెందిన స్ధావరాలపై వరుస దాడులు నిర్వహించింది. ఆ మరుసటి రోజు మిజో నేషనల్ ఫ్రంట్ భారత్ నుంచి విడిపోయి స్వతంత్ర రాజ్యంగా ఏర్పడినట్లు ప్రకటించుకుంది. ఆపరేషన్ జెరికోతో భారత ప్రభుత్వం, భద్రతా దళాలు షాక్‌కు గురయ్యాయి.
మిజో నేషనల్ ఫ్రంట్ దెబ్బకు భద్రతా దళాలు ఐజ్వాల్, లుంగ్లేయ్‌లలో పూర్తిగా పట్టుకోల్పోయాయి. ఆయుధ కర్మాగారాలు, ఐజ్వాల్ కోశాగారం మిజోల చేతిలోకి వెళ్లిపోయాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న ఇందిరా గాంధీ ప్రభుత్వం మార్చి 5వ తేదీన ఐజ్వాల్‌పై బాంబు దాడి చేయాలని ఆదేశించింది. క్షణాల్లో ఐజ్వాల్‌కు చేరువలో ఉన్న ఎయిర్‌బేస్‌ల నుంచి నాలుగు యుద్ధవిమానాలు ఐజ్వాల్‌పై దాడి చేశాయి. తొలుత బుల్లెట్ల వర్షం కురిపించిన విమానాలు.. కొద్ది క్షణాల తర్వాత బాంబుల వర్షం కురిపించాయి.
దాంతో ఐజ్వాల్‌లో పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భయభ్రాంతులకు గురైన మిజో ప్రజలు పట్టణం నుంచి కొండ ప్రాంతాలకు పారిపోయారు. మార్చి 13వ తేదీ వరకూ ఎయిర్‌ఫోర్స్ ఐజ్వాల్‌పై దాడులు నిర్వహించింది. రెబెల్స్‌లో కొందరు తలదాచుకోవడానికి మయన్మార్ అడవులకు, మరికొందరు అప్పటి తూర్పు పాకిస్తాన్(నేటి బంగ్లాదేశ్)కు పారిపోయారు.
ఎయిర్‌ఫోర్స్ దాడులను గుర్తు చేసుకున్న ఓ మిజో నేషనల్ ఫ్రంట్ వెటరన్.. ప్రభుత్వం బాంబు దాడులకు దిగుతుందని తాము కలలో కూడా ఊహించలేదని చెప్పారు. నలువైపుల నుంచి వచ్చిన జెట్లు తమపై బాంబుల వర్షం కురిపించాయని.. అదృష్టవశాత్తు ఆ ఘటనలో 13మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ప్రభుత్వం మిజోరాం గుండెపై దెబ్బకొట్టినా.. మిజో వాసుల ఆశయాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయిందని గద్గద స్వరంతో తెలిపారు. ఐజ్వాల్ దాని దగ్గరి జిల్లాలపై ప్రభుత్వం బాంబు దాడులు జరిపి ఈ నెల 5వ తేదీతో 50 ఏళ్లు పూర్తయ్యాయి.
Advertisement
Advertisement