భారత్‌ @ 519 | 519 Corona Cases Rise In India | Sakshi
Sakshi News home page

భారత్‌ @ 519

Published Wed, Mar 25 2020 3:18 AM | Last Updated on Wed, Mar 25 2020 10:19 AM

519 Corona Cases Rise In India - Sakshi

బయటతిరగొద్దంటూ రాంచీలో వేడుకుంటున్న పోలీసు అధికారి

న్యూఢిల్లీ: చైనాలో పుట్టి ప్రపంచమంతా విస్తరించిన కరోన వైరస్‌ కేసులు భారత్‌లో 519కి చేరుకున్నాయి. కోవిడ్‌ కారణంగా ముంబైలో సోమవారం సాయంత్రం ఒక వ్యక్తి మరణించడంతో దేశంలో ఇప్పటివరకూ ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య పదికి చేరింది. దేశంలోని మొత్తం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్‌ నిబంధనలు విధించగా, కొంతమంది వీటిని అతిక్రమించగా పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో నిబంధనలను అతిక్రమించిన వారిపై వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు యుద్ధ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిందేనని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ నిబంధనలను చాలామంది అతిక్రమిస్తున్న నేపథ్యంలో మరిన్ని కఠిన చర్యలకు పూనుకోవాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ ప్రభావంతో పరిశ్రమలు మూతపడటం, ఉపాధి అవకాశాలకు గండిపడుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. (21 రోజులు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌)

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దేశంలోని ప్రింట్‌ మీడియా సీనియర్‌ జర్నలిస్టులతో వీడియో లింక్‌ ద్వారా మాట్లాడుతూ కోవిడ్‌ కట్టడికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నమ్మకం ప్రజల్లో కల్పించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ భద్రత దృష్ట్యా సామాజిక ఐక్యతను కాపాడటం చాలా కీలకమని మోదీ చెప్పినట్లు అధికారిక ప్రకటన ఒకటి తెలిపింది. నిరాశావాదం వ్యాప్తిని అడ్డుకోవాలని కోరారు. సామాజిక దూరం పాటించడం ఎంత ముఖ్యమో ప్రధాని వివరించారని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాలని, లాక్‌డౌన్‌ నిర్ణయాలపై ప్రజలకు వివరించాలని కోరినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

రానున్న రెండు వారాలు కీలకం 
కోవిడ్‌ తీవ్రత దృష్ట్యా పంజాబ్, మహారాష్ట్రతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో ఇప్పటికే కర్ఫ్యూ ప్రకటించగా ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం లాక్‌డౌన్‌ నిబంధనలను అన్ని జిల్లాలకు విస్తరించింది. అహ్మదాబాద్‌కు వచ్చిన 65 ఏళ్ల వ్యక్తి ఒకరు వ్యాధి లక్షణాలతో ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రిలో చేరారని, రక్తపోటు, మధుమేహం వంటివి ఉన్న నేపథ్యంలో ఈ వ్యక్తి మార్చి 20వ తేదీ ఆసుపత్రిలో చేరి సోమవారం సాయంత్రం మరణించారని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దేశం మొత్తమ్మీద మంగళవారం సాయంత్రం నాటికి 519 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 43 మంది విదేశీయులు ఉన్నారు. వ్యాధి నయమైన వారు, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయిన వారిని పరిగణనలోకి తీసుకుంటే దేశంలో 470 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఆసుపత్రులను గుర్తించండి 
కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరిగితే అందరికీ తగిన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రులను గుర్తించడంతోపాటు వాటిని సంసిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గాబా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఒక లేఖ రాశారు. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ దేశంలో కోవిడ్‌ నియంత్రణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకూ 1.87 లక్షల మందిపై నిఘా కొనసాగుతోందని, 35,073 మందిపై 28 రోజుల పరిశీలన ముగిసిందని మంత్రి తెలిపారు.  మరోవైపు... కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటవ తేదీ నుంచి ఎనిమిదవ తరగతి వరకూ ఉన్న విద్యార్థులు పరీక్షలకు హాజరైనా, కాకపోయినా అందరినీ తరువాతి తరగతుల్లోకి ప్రమోట్‌ చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. మార్చి 31వ తేదీ వరకూ అన్ని పరీక్షలు, తరగతులను కూడా సస్పెండ్‌ చేశారు.

వార్తా పత్రికలు, టీవీ ఛానళ్లు పనిచేసేలా చూడండి 
వైరస్‌ విజృంభణ నేపథ్యంలో దేశం మొత్తమ్మీద వార్తా పత్రికలు, టెలివిజన్‌ ఛానళ్లు పనిచేసేలా చూడాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ.. రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ అధికారులు అన్ని కేంద్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ప్రజలకు ఎప్పటికప్పుడు సాధికార సమాచారం అందించేందుకు వార్తా పత్రికలు, టెలివిజన్లు ఎంతో కీలకమని.. ప్రజల్లో అవగాహన పెంచేందుకు, దేశంలో వైరస్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలందరికీ తెలియజేసేందుకు ఇవి తమ పనిని కొనసాగించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. టీవీ ఛానళ్లతోపాటు వార్తా సంస్థలు, టెలిపోర్ట్‌ ఆపరేటర్లు, డిజిటల్‌ శాటిలైట్‌ న్యూస్‌ గాదరింగ్, డైరెక్ట్‌ టు హోం, హై ఎండ్‌ ఇన్‌ద స్కై, మల్టీ సిస్టమ్‌ ఆపరేటర్స్, కేబుల్‌ ఆపరేటర్లు, ఎఫ్‌ఎం రేడియో, కమ్యూనిటీ రేడియో స్టేషన్‌లన్నీ పనిచేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. వీటిపై ఎలాంటి నియంత్రణలు ఉండరాదని స్పష్టం చేసింది. ఈ సంస్థల్లో సిబ్బంది ఉండేందుకు అనుమతించాలని తెలిపారు.

పటియాలాలో రోడ్లమీదికొచ్చినందుకు గుంజీలు తీయిస్తున్న పోలీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement