ప్రతీకాత్మక చిత్రం
లక్నో: కరోనా కట్టడి, మహిళల రక్షణపై ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసే మరో ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది. స్టేట్ హోంలో ఆశ్రయం పొందుతున్న 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా తేలడం.. వారిలో ఐదుగురు గర్భవతులు ఉండటం అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. వివరాలు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూపీ ప్రభుత్వ షెల్టర్ హోంలో ఉంటున్న బాలికలకు ఇటీవల కోవిడ్ నిర్ధారణ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో 57 మందికి కరోనా సోకిన విషయం బయటపడింది. అంతేగాకుండా వారిలో ఐదుగురు గర్భం దాల్చినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఈ ఘటనపై మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. (మతిభ్రమించిన మహిళపై రాళ్ల దాడి)
ఈ నేపథ్యంలో సీపీఐ(ఎమ్) పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలి ఆదివారం కాన్పూర్ ఎస్‌ఎస్‌పీ దినేశ్ కుమార్‌ను కలిసి షెల్టర్ హోం ఘటనపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. హోంలో ఉన్న బాలికలు గర్భవతులు కావడం, వారిలో ఒకరికి హెచ్‌ఐవీ పాజిటివ్, మరొకరికి హెపటైటిస్ సీ ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయని.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. రెస్క్యూ హోంలో ఉన్న వారికి రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. హోంలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం లోపించిందని మండిపడ్డారు. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పూనం కపూర్.. హోంలో చేరిన తర్వాత ఎవరూ గర్భం దాల్చలేదని.. వీరంతా లైంగికదాడి కేసుల్లో బాధితులు అని పేర్కొన్నారు. (ఆరోగ్యశాఖ కార్యాలయంలో కరోనా)
ఇక కాన్పూర్ జిల్లా కలెక్టర్ బ్రహ్మదేవ్ రామ్ తివారి ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ‘‘వివిధ జిల్లాల్లోని శిశు సంక్షేమ కమిటీల నుంచి ఇక్కడి హోంకు ఐదుగురు బాలికలు వచ్చారు. వారంతా లైంగిక దాడి బాధితులు. ఇక్కడికి రావడానికి ముందే వారు గర్భవతులుగా ఉన్నారు’’ అని వివరణ ఇచ్చారు. అదే విధంగా హోంలో రెండు రోజుల క్రితం ఇద్దరికి వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షల కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని.. అనంతరం మరో 55 మంది శాంపిల్స్ పరీక్షించగా వారు కూడా మహమ్మారి బారిన పడినట్లు తేలిందన్నారు. కరోనా బాధితులను కోవిడ్ ఆస్పత్రులకు తరలించి.. మిగిలిన వారికి క్వారంటైన్ చేసినట్లు వెల్లడించారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ 17 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 507 మంది కోవిడ్‌తో మరణించారు. ఇక కాన్పూర్‌లోనూ కరోనా పంజా విసురుతోంది. ప్రస్తుతం అక్కడ 400 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment