మళ్లీ ఓటెత్తిన కశ్మీర్, జార్ఖండ్
‘మూడో దశ’లో 59 శాతం, 61 శాతంగా పోలింగ్ నమోదు
రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ ప్రశంసలు
శ్రీనగర్/రాంచీ: ఉగ్ర దాడులు, ఎన్నికల బహిష్కరణ పిలుపులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా జమ్మూకశ్మీర్ ప్రజలు మరోసారి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు. రాష్ర్టంలో ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించాలనుకున్న ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు ఓటుతో బుద్ధి చెప్పారు. మంగళవారం జమ్మూకశ్మీర్‌లో 16 నియోజకవర్గాలకు జరిగిన మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో 59 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే వృద్ధులు సహా ఓటర్లంతా 1,781 పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. చాలా చోట్ల సున్నా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనా లెక్కచేయకుండా భారీ క్యూలలో నిలబడ్డారు. తొలి రెండు దశల్లో నమోదైన 72 శాతం పోలింగ్‌తో పోలిస్తే మూడో దశలో పోలింగ్ తక్కువే అయినప్పటికీ 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే 16 నియోజకవర్గాల్లో నమోదైన 49 శాతం పోలింగ్‌కన్నా ఇది 9 శాతం అధికం కావడం విశేషం. గుల్మార్గ్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కొందరు దుండగులు పెట్రోల్ బాంబు విసిరిన ఘటన మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
మూడో దశ ఎన్నికల బరిలో నిలిచిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా 144 మంది అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. బద్గాం జిల్లాలోని చరార్ ఎ షరీఫ్ నియోజకవర్గంలో అత్యధికంగా 82.74 పోలింగ్ శాతం (2008లో 74.58) నమోదైనట్లు ప్రధాన ఎన్నికల అధికారి ఉమాంగ్ నరూలా తెలిపారు. మరోవైపు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ సొంత పట్టణమైన సోపోర్ నియోజకవర్గంలో అత్యల్పంగా 30 శాతం పోలింగ్ (2008లో 19.95 శాతం) నమోదైందన్నారు. ముఖ్యంగా గత వారం ఉగ్రవాద దాడులు జరిగిన బారాముల్లా జిల్లాలోని యూరి నియోజకవర్గంలో 79 శాతం (2008లో 81.73 శాతం) పోలింగ్ నమోదైనట్లు నరూలా చెప్పారు. మరోవైపు ఒమర్ అబ్దుల్లా ప్రాతినిధ్యం వహించిన బీర్వా నియోజకవర్గంలో గతంతో పోలిస్తే పోలింగ్ 17 శాతం పెరిగిందన్నారు. 2008లో బీర్వాలో 57.17 శాతం పోలింగ్ నమోదవగా ఈసారి ఏకంగా 74.14 శాతం నమోదైందన్నారు.
జార్ఖండ్‌లో తగ్గని జోరు...
జార్ఖండ్‌లో 17 స్థానాలకు మంగళవారం జరిగిన మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో 60.89 శాతం పోలింగ్ నమోదైంది. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ మొత్తంమీద ప్రశాంతంగా ముగిసింది. సిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 74.77 శాతం పోలింగ్ నమోదవగా రాంచీ నియోజకవర్గంలో అత్యల్పంగా 44.44 శాతం పోలింగ్ రికార్డయింది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండటంతో 14 నియోజకవర్గాల్లో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకే ముగియగా మరో 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 వరకూ పోలింగ్ కొనసాగింది. తొలి రెండు దశల్లో పోలింగ్ శాతం 61.92, 64.68గా నమోదవడం తెలిసిందే.
ప్రజాస్వామ్యానికి నూతన శక్తి: మోదీ
జమ్మూకశ్మీర్, జార్ఖండ్‌లలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారీగా పోలింగ్‌లో పాల్గొంటుండటంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకుగానూ రెండు రాష్ట్రాల ప్రజలను ప్రశంసించారు. పోలింగ్ శాతాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి నూతన శక్తిని అందిస్తుందని మంగళవారం జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో జరిగిన సభలో మోదీ పేర్కొన్నారు.