యువశక్తికి జోహార్లు
రాక్ కాన్‌సర్ట్‌లో మోదీ 60 వేల మంది హాజరు
న్యూయార్క్: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించి విలక్షణతను చాటుకున్న మోదీ తాజాగా ప్రపంచయువతకు సందేశమిచ్చేందుకు అసాధారణ వేదికను ఎంచుకున్నారు. ఆదివారం న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో 60 వేలమంది హాజరైన ఓ రాక్‌స్టార్ కాన్‌సర్ట్‌లో జే జెడ్, బియాన్స్, కేరీ అండర్‌వుడ్, స్టింగ్, అలీసియా కీస్ వంటి ప్రఖ్యాత మ్యూజిక్ స్టార్లతో వేదికను పంచుకుంటూ పలు సామాజిక అంశాల పై మాట్లాడారు. ప్రపంచ శాంతి, పారిశుద్ధ్యం, యువశక్తి గురించి ఆంగ్లంలో ఏడు నిమిషాలు ప్రసంగించి ఆకట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన, అందరికీ విద్య, పారిశుద్ధ్యం కోసం కృషి చేస్తున్న గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియా నటుడు హ్యూ జాక్‌మాన్ మోదీని తొలుత సభకు పరిచయం చేశారు. ‘చాయ్‌వాలా’ నుంచి గుజరాత్ సీఎంగా, భారత ప్రధానిగా మోదీ ఎన్నికైన వైనాన్ని వివరించారు.
న్యూయార్క్ వాసులారా ఎలా ఉన్నారంటూ మోదీ పలకరించడంతో సభికులంతా హర్షాతిరేకాలను తెలియజేశారు. ప్రపంచంలో తమకు ఏదైనా సాధ్యమేనన్న దృక్పథం ఉన్న యువతకు భారత్ సహా యావత్ ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని మోదీ ప్రశంసించారు. యువతే ప్రపంచ భవిష్యత్తు అని పేర్కొన్నారు. భారత్‌ను మార్చడంలో 80 కోట్ల మంది యువతీయువకులు కూడా చేతులు కలుతున్నారని చెప్పారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నందుకు యువతను చూసి గర్వపడుతున్నానన్నారు. ‘‘మీకు నా జోహార్లు. మీలో ఒక్కొక్కరినీ చూసి గర్విస్తున్నా. మిమ్మల్ని చూసి మీ కుటుంబాలు, స్నేహితులు, దేశం కూడా ఇలాగే గర్విస్తుందని భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ప్రసంగాన్ని ముగించే ముందు సభికులందరికీ నమస్తే అంటూ అభివాదం చేయడంతో ఆ ప్రాంతమంతా చప్పట్లు, హర్షాతిరేకాలతో మార్మోగింది. చివరగా ప్రపంచ శాంతి గురించి సంస్కృతంలో సందేశాన్ని వినిపించారు.