తొలిదశలో 64 శాతం పోలింగ్
► యూపీలో 73 నియోజకవర్గాలకు ముగిసిన ఎన్నికలు
► ఓటింగ్ స్వల్ప హింసాత్మకం
లక్నో: దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో తొలిదశ కింద శనివారం 15 జిల్లాల్లోని 73 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. ఓటింగ్ సందర్భంగా అక్కడక్కడా స్వల్ప హింసాత్మక ఘటనలు జరిగాయి. 64.22 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఓటరు స్లిప్‌లను దౌర్జన్యంగా లాక్కోవడం, రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని ముఖ్య ఎన్నికల అధికారి వెంకటేష్ చెప్పారు. ఇవే నియోజకవర్గాల్లో 2012 ఎన్నికలతో పోలిస్తే తాజాగా పోలింగ్ మూడు శాతం పెరిగింది. ఈ దశలో మొత్తం ఓటర్లు 2.6 కోట్లు కాగా వారిలో 1.17 కోట్ల మంది మహిళలు. 839 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇప్పటిదాకా ఎన్నికల సంఘం ఇక్కడ రూ.9.56 కోట్ల నగదు, 14కోట్ల విలువైన 4.44 లక్షల లీటర్ల మద్యం, రూ.14 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. శనివారం హాపూర్, షామ్లీ, ముజఫర్‌నగర్, బాగ్‌పట్, మీరట్, ఘజియాబాద్, గౌతమ బుద్ధ నగర్, బులంద్ షహర్, అలీగఢ్, మథుర, హత్రాస్, ఆగ్రా, ఫిరోజాబాద్, ఎటా, కాస్‌గంజ్ జిల్లాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం జిల్లాలు 75.
మీరట్, బాగ్‌పట్‌లో ఘర్షణలు...
బాగ్‌పట్‌లో ఓటర్లను అడ్డుకుంటున్నారంటూ వివిధ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 10 మంది గాయపడ్డారు. బాగ్‌పట్ జిల్లాలోని మరో గ్రామంలో ఆర్‌ఎల్‌డీ కార్యకర్తలు దళితులను ఓటు వేయకుండా అడ్డుకోగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మీరట్‌లో ఓ బీజేపీ నేత సోదరుడు పోలింగ్ బూత్‌కు తుపాకీ తేవడంతో పోలీసులు అరెస్టుచేశారు.
తొలిదశలోని ప్రముఖులు వీరే...
తొలిదశ పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తనయుడు పంకజ్ సింగ్ (నోయిడా), కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు ప్రదీప్ మాథుర్ (మధుర), బీజేపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌శర్మ, బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ కూతురు మృగాంకా సింగ్ (కైరానా), బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీ కాంత్ (మీరట్), ఆర్జేడీ అధినేత లాలూ అల్లుడు రాహుల్ సింగ్ (సికింద్రాబాద్), రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్ మనవడు సందీప్ (అత్రౌలి) తదితర ప్రముఖులు పోటీలో నిలిచారు.
బీజేపీ ఖాతాలోకి 3 ఎమ్మెల్సీలు
రాష్ట్రంలోæ అసెంబ్లీ ఎన్నికల హడావుడి నడుస్తుండగానే.. బీజేపీకి శుభ సంకేతాలు కనబడుతున్నాయి. కాన్పూర్, బరేలీ, గోరఖ్‌పూర్ స్థానాలకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఈ మూడు చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం, పేదల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మోదీ తీసుకొచ్చిన పథకాలే తమను గెలిపించాయని అభ్యర్థులు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటమే.. యూపీలో మళ్లీ కమలం వికసించేందుకు సంకేతమని కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు.