కశ్మీర్‌లో హై అలర్ట్ !
♦ ఇస్మాయిల్ కోసం ముమ్మర గాలింపు
♦ దక్షిణ కశ్మీర్‌లో ఉండొచ్చని అంచనా
♦ కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్ర
శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్రీకులపై ఉగ్రదాడిలో ఏడుగురు మరణించిన దుర్ఘటనను కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. దాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్ అంతటా బుధవారం హైఅలర్ట్ ప్రకటించింది. భద్రతా బలగాలన్నీ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కొందరు కేంద్రమంత్రులు కశ్మీర్‌లో మకాం వేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కశ్మీర్ గవర్నర్, సీఎం, పారా మిలిటరీ దళా ల ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఘటన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ ఇస్మాయిల్‌ను పట్టుకునేందుకు భద్రతాదళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
ఇతడు దక్షిణ కశ్మీర్‌లో ఉండొచ్చనే అనుమానంతో ఆ ప్రాం తమంతా తనిఖీలు చేపట్టారు. చాలా ఏళ్ల క్రితమే ఇస్మాయిల్ కశ్మీర్‌కు వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది దక్షిణ కశ్మీర్‌కు మకాం మార్చినట్లు తెలుస్తోంది. అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి అమర్‌నాథ్ యాత్రికులపై దాడి చేయడంతో ఏడుగురు మరణించడం తెలిసిందే. ఇస్మాయిల్‌తోపాటు మరో ముగ్గురు దాడిలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఇటీవల లష్కరే తోయిబాకు చెందిన కొందరు ఉగ్రవాదులను భద్రతాసిబ్బంది మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతీకా ర చర్యతోనే ఉగ్రవాదులు దాడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
పరిస్థితిని సమీక్షించిన కేబినెట్ కమిటీ
న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రీకులపై దాడితోపాటు చైనాతో ఏర్పడ్డ విభేదాలపై భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ ఢిల్లీలో బుధవారం చర్చించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించిన ఈ సమావేశానికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేబినెట్ సమావేశానికి ముందు ఈ భేటీ జరిగింది.
ఉగ్రవాదుల కథ ముగిసినట్టే: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
ఉగ్రవాదుల దాడి జరిగినప్పటికీ అమర్నాథ్ యాత్ర మరింత భద్రతతో యథావిధిగా కొనసాగుతుందని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. కశ్మీర్ ఉగ్రవాదం చివరిదశలో ఉందని, గత రెండు మూడు వారాలుగా భారత సైన్యం ఎంతో ప్రగతి సాధించిందని ప్రకటించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హంస్‌రాజ్ అహిర్‌తోపాటు ఆయన శ్రీనగర్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారని వెల్లడించారు. జాతి మొత్తం కశ్మీర్‌కు బాసటగా నిలుస్తుందని మంత్రి అన్నారు.
గో రక్షకులను యుద్ధానికి పంపండి
అమర్‌నాథ్ ఘటనపై ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: గోసంరక్షణ పేరుతో హత్యలు చేస్తున్న గోరక్షకులను ఉగ్రవాదులతో యుద్ధం చేయడానికి పంపించాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి గురించి స్పందిస్తూ ఆయన పైవిధంగా అన్నారు. ‘రాజకీయాల్లో క్రీడలు, సాంస్కృతిక విషయాల గురించి చర్చించవద్దని బీజేపీ చెబుతుంది. ఇప్పుడు మతం, రాజకీయాలు కలిసి ఉగ్రదాడి రూపంలో వచ్చాయి. ఉగ్రవాదుల వద్ద ఆయుధాలు కాకుండా గోమాంసం ఉండుంటే వారు ఈపాటికే గో రక్షకుల చేతిలో చచ్చేవారా? ఈ మధ్యకాలంలో గోరక్షకుల అంశం తీవ్రంగా మారుతోంది. అలాంటప్పుడు ఉగ్రవాదులతో పోరాడమని గోరక్షకులనే ఎందుకు పంపకూడదు? ’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఠాక్రే.
ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బుద్గామ్ జిల్లాలోని రాద్ గ్రామంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. సైనికులు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. వారి నుంచి ఆయుధాలు, పేలుడుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు గాలింపుచర్యలు ముమ్మరం చేశాయి. మంగళవారం సాయంత్రం ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలవగా, బుధవారం కూడా కొనసాగాయి. తనిఖీల్లో భాగంగా భద్రతాదళాలు ఒక ఇంటిలో సోదాలు జరపగా, అందులో ఉన్న ఉగ్రవాదులు సైనికులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సీఆర్‌పీఎఫ్ జవాన్లు దాడిని తిప్పి ముష్కరులను హతమార్చారు. మృతులను జావిద్ షేక్, దావూద్, అఖిల్‌గా గుర్తించారు. జావిద్ హిజ్బుల్ జిల్లా కమాండర్‌గా పనిచేస్తున్నాడు.
ఇద్దరు సైనికులూ బలి
పాకిస్థాన్ సైన్యం మరోసారి దుస్సాహసం చేసింది. బుధవారం నియంత్రణ రేఖ వెంబడి ముందస్తు హెచ్చరికలేవీ లేకుండా కాల్పులు జరిపింది. నేరుగా భారత జవాన్లపై గురి చూసి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. కేరన్ సెక్టర్‌లో కుప్వారా వద్ద ఈ దుర్ఘటన జరిగింది. హిజ్బుల్ ఉగ్రవాదులను భారత్ దళాలు మట్టుబెట్టినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది.