గుర్గావ్‌లో ఏడేళ్ల విద్యార్థి దారుణ హత్య
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ శివారులోని గుర్గావ్లో దారుణం చోటుచేసుకుంది. ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రెండో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల ప్రద్యుమన్ ఠాకూర్ మృతదేహం స్కూల్ టాయ్‌లెట్‌లో పడి ఉండటాన్ని శుక్రవారం ఉదయం గుర్తించారు. కాగా ఘటనా స్థలానికి కొద్దిదూరంలో ఓ కత్తిని కూడా లభ్యమైంది.
స్కూల్ యాజమాన్యం సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా కత్తితో ప్రద్యుమన్ గొంతుకోసి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. స్కూల్ సిబ్బందితో పాటు, తోటి విద్యార్థులను ప్రశ్నిస్తున్నామని, అలాగే సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి రవీంద్ర కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి స్కూల్ బస్సు డ్రైవర్, హెల్పర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని విద్యార్థి తండ్రి వరుణ్ ఠాకూర్ ఆరోపించారు. తాను ఉదయం స్కూల్‌లో డ్రాప్ చేసినప్పుడు ప్రద్యుమన్ సంతోషంగా ఉన్నాడని, సుమారు తొమ్మిది గంటల సమయంలో స్కూల్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిపారు. తమ కుమారుడికి బ్లీడింగ్ అవుతోందని, ఆస్పత్రికి తీసుకువెళుతున్నామని త్వరగా రావాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏం జరిగిందో తెలియపోయినప్పటికీ తన బిడ్డది ముమ్మాటికీ హత్యేనని ఆయన అన్నారు.
గత ఏడాది ఇదే స్కూల్‌కు చెందిన వసంత్ కుంజ్ బ్రాంచ్లో ఒకటో తరగతి విద్యార్థి ఆడుకోవడానికి వెళ్లి...వాటర్ ట్యాంక్‌లో శవమై తేలాడు. ఇందుకు సంబంధించి స్కూల్ ప్రిన్సిపల్‌తో పాటు నలుగురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.