సాక్షి, న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రపంచంలోని మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే లక్ష జనాభాకు 62 మంది కోవిడ్ బారిన పడ్డారని, మనదేశంలో లక్ష జనాభాకు 7.9 మంది మాత్రమే కరోనాకు చిక్కారని వెల్లడించారు. ఇక కోవిడ్-19 మరణాల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా లక్ష జనాభాకు 4.2 మంది మరణించగా, మనదేశంలో లక్ష జనాభాకు 0.2 మరణాలు మాత్రమే సంభవించాయని ప్రకటించారు. ఇప్పటివరకు 3303 మంది కరోనా సోకి చనిపోయారు.
కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. మొదటి లాక్‌డౌన్ ప్రారంభమైనప్పుడు రికవరీ రేటు 7.1 శాతం ఉండగా, రెండవ లాక్‌డౌన్ సమయంలో రికవరీ రేటు 11.42 శాతం, తర్వాత అది 26.5 9శాతానికి పెరిగి.. ప్రస్తుతం 39.62 శాతానికి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 61,149 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నాయని, 42,298 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని లవ్ అగర్వాల్ ప్రకటించారు. కాగా, గత 24 గంటల్లో 1,07,609 కరోనా నిర్థారిత పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తెలిపింది. (గుర్రాల నుంచే కోవిడ్ వ్యాక్సిన్)
ఇక రాష్ట్రాల వారిగా చూసుకుంటే 37136 కరోనా పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ (12140), తమిళనాడు (12448), ఢిల్లీ(10554) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో మొత్తం ఇప్పటివరకు 1,06,750 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు..!)
Comments
Please login to add a commentAdd a comment