సాక్షి, న్యూఢిల్లీ : భూగోళం అగ్నిగోళంగా మారుతోంది. ప్రపంచంలోనే అట్టుడుకిపోతోన్న 15 ప్రాంతాల్లో ఉత్తర, కేంద్ర భారత్‌లోని ఎనిమిది ప్రాంతాలు చోటు చేసుకున్నాయి. వాటిల్లో రాజస్తాన్‌లోని చురు, గంగానగర్ ప్రాంతాలున్నాయని ‘ఎల్ డొరాడో’ అనే వాతావరణ సంస్థ వెబ్‌సైట్ సోమవారం వెల్లడించింది. ఆదివారం నాడు చురులో 48.9, గంగానగర్‌లో 48.6 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. వాటితోపాటు రాజస్తాన్‌లోని ఫలోడి, బికనర్, జైసాల్మర్, మధ్యప్రదేశ్‌లోని నౌగాంగ్, కజూరహో, హర్యానాలోని నార్నౌల్ ప్రాంతాలు మండిపోతున్నాయి. నైరుతి, కేంద్ర భారత్ ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు మరో రెండు రోజులపాటు కొనసాగి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు, తూర్పు రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, సౌరాష్ట్ర, కచ్, విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో మోస్తారు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పాకిస్థాన్, రాజస్తాన్ ఎడారుల్లో ఉత్పన్నమైన వేడి కారణంగా ఈ వడగాలులు వీస్తున్నాయని, రాళ్లవాన, ఈదురు గాలులతో కూడిన వర్షాల వల్ల మరో రెండు రోజుల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉందని వెల్లడించింది. రాజస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో ఓ రైతు సహా ముగ్గురు మరణించారు. తూర్పు, ఉత్తర భారత్ ప్రాంతాల్లో జూన్ 7 నుంచి 9 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, కేరళ మారుమూల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment