అత్యాచార భారత్.. రోజూ 93 మంది అబలలు బలి
చెన్నై: ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా.. నిరసనలు, ఆందోళనలు చేసినా.. ప్రభుత్వాలు మారినా.. మన దేశంలో మహిళలకు ఇప్పటికీ తగిన భద్రత లేదు. రోజురోజుకూ మహిళలపై ఆగడాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ సగటున 93 మంది మహిళలు అత్యాచారాలకు బలవుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదికలో ఈ నివ్వెరపరిచే విషయం వెల్లడైంది.
2012 సంవత్సరలో మన దేశంలో 24,923 అత్యాచారాలు జరగగా.. 2013లో ఆ సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగించే విషయం. 33,707 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఉదంతం అనంతరం కఠిన చట్టం రూపొందించినా మహిళలకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2012లో ఢిల్లీలో 585 అత్యాచార కేసులు నమోదు కాగా, 2013లో 1441 కేసులు అంటే క్రితం ఏడాది కంటే రెట్టింపు కావడం గమనార్హం. మనదేశంలో మహిళలకు భద్రత లేని నగరాల్లో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత ముంబై, జైపూర్, పుణె ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే గతేడాది మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 4,335 రేప్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రాజస్థాన్ (3285), మహారాష్ట్ర (3063), ఉత్తరప్రదేశ్ (3050) రాష్ట్రాలలో అత్యధిక కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో ఎక్కువగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు ఉన్నారు. నేరాలకు పాల్పడుతున్నవారిలో 94 శాతం మంది పరిచయం ఉన్నవారే. తెలిసినవారు, ఇంటిపక్కన ఉన్నవారు ఎక్కువగా అత్యాచారాలకు పాల్పడుతుండగా, బంధువులు కూడా నేరాలకు ఒడిగడుతున్నారు.