NCRB data
-
Rajasthan Elections 2023: ప్రచారాస్త్రంగా ‘మహిళలపై నేరాలు’.. ఇవీ గణాంకాలు..
‘మహిళలపై నేరాలు’ ప్రధాన ప్రచారాస్త్రంగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు సాగుతున్నాయి. వీటిపైనే బీజేపీ తమ ప్రచార ర్యాలీలు, బహిరంగ సభల్లో అధికార కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ మేనిఫెస్టోలలో మహిళా భద్రతకు సంబంధించి అనేక హామీలు ప్రకటించాయి. ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేతలందరూ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. నవంబర్ 15న బార్మర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో మహిళలపై అఘాయిత్యాల్లో రాజస్థాన్ అగ్రగామిగా ఉందని ఆరోపించారు. గణాంకాలు ఇవీ.. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం.. 2021 సంవత్సరంలో అత్యధికంగా రేప్ కేసులు నమోదైన రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించింది. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ 376 కింద 6,337 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 2,845 కేసులు నమోదయ్యాయి. ఇక 2021లో దేశవ్యాప్తంగా 31,677 అత్యాచార కేసులు నమోదయ్యాయి. మహిళలపై ఇతర నేరాల విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్ తర్వాత రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. 2021లో అత్యధికంగా 56,083 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్‌లో 40,738 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో మహిళలపై నేరాల సంఖ్య 2020 కంటే 2021లో దాదాపు 17 శాతం పెరిగింది. అయితే ఇది 2019 కేసుల సంఖ్య 41,550 కంటే 2 శాతం తగ్గడం గమనార్హం. 2021లో దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు సంబంధించి 4,28,278 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి. -
తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు.. దేశంలోనే నెం.1
న్యూఢిల్లీ: 2021లో తెలంగాణలో క్రైం రేటు విపరీతంగా పెరిగింది. అంతేకాదు మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపులు సైతం భారీగా పెరిగాయి. సైబర్ నేరాల్లోనూ తెలంగాణ దేశంలోనే తొలిస్థానలో ఉందని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జాతీయ నేర గణాంక సంస్థ 2021 నివేదిక ప్రకటించింది. దీని ప్రకారం మానవ అక్రమ రవాణా, ఆహార కల్తీ కేసుల్లోనూ తెలంగాణ మళ్లీ టాప్‌గా నిలిచింది. ఇక రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది 2019లో 2,691 సైబర్ నేరాలు నమోదవ్వగా. .2020లో ఈసంఖ్య 5,024కు చేరింది. కాగా 2021లో సైబర్ నేరాలు 200 శాతం పెరిగి ఏకంగా 10,303కు చేరాయి. దేశ వ్యాప్తంగా 52, 430 సైబర్ నేరాల కేసులు వెలుగు చూస్తే అత్యధికంగా తెలంగాణలోనే 20 శాతం నమోదవుతున్నాయి. సైబర్ నేరాల్లో 8, 829 కేసులతో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో ఆర్థిక నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. 2019లో 11, 465.. 2020లో 12.985..కేసులు నమోదయితే 2021లో ఏకంగా 20,759 కేసులు వచ్చాయి. 23, 757 ఆర్థిక నేరాల కేసులతో రాజస్థాన్ అగ్ర స్థానంలో ఉంది. వృద్ధులపై దాడుల్లో తెలంగాణ మూడు, రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఏటీఎం, ఆన్లైన్ బ్యాంకింగ్, ఓటీపీ, మార్ఫింగ్ మోసాలు, ఫేక్ ప్రొఫైల్ తయారీ తెలంగాణలో అధికమని ఎన్సీఆర్బీ నివేదికలో తేలింది. చదవండి: హతవిధీ!..పదేళ్ల తర్వాత విధులకు..గుండెపోటుతో -
నేరాలు తగ్గేదెలా?
నేరాలు మన సమాజంలోని చీకటి కోణాలను వెల్లడిస్తే, వాటి నివారణకు అనుసరించే మార్గాలు సమాజం తాలూకు సున్నితత్వాన్ని, అదే సమయంలో దాని దృఢ సంకల్పాన్ని తెలియజేస్తాయి. ఏటా గడిచిన సంవత్సరంలో జరిగిన నేరాలపై విడుదలయ్యే జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు ఈసారి కాస్త ముందుగానే వెలువడ్డాయి. నేరాల సంఖ్య పెరిగిందని, ఎప్పటిలానే మహిళల భద్రత విషయంలో సంతృప్తికరమైన ప్రగతి సాధించలేకపోయామని, ముఖ్యంగా నగరాల్లో పరిస్థితి ఏమంత గర్వకారణంగా లేదని తాజా నివేదిక చూస్తే అర్థమవుతుంది. 2019తో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై నేరాల్లో 24.65 శాతం తగ్గుదల కనిపిస్తున్న సంగతి కాదనలేనిది. ఇతర నగరాల్లో సైతం 8.3 శాతం తగ్గాయి. కానీ 2020లో దీర్ఘకాలం లాక్డౌన్ నిబంధనలు అమలుకావడం, పౌరుల కదలికలపై పరిమితులు విధించడం పర్యవసానంగానే ఇది సాధ్యమైంది. అయితే లాక్డౌన్ వల్ల వారిపై గృహహింస బాగా పెరిగింది. సంఖ్యాపరంగా మహిళలపై నేరాలు తగ్గినట్టు కనబడుతున్నా నేరగాళ్ల క్రౌర్యం తీవ్రత పెరగడాన్ని గమనించవచ్చు. ముంబైలో ఇటీవల బయటపడిన ఒక అత్యాచార ఘటనే ఇందుకు ఉదాహరణ. 997 అత్యాచార ఘటనలతో ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే ఢిల్లీలో ఎక్కువే. దేశవ్యాప్తంగా 2020లో రోజుకు సగటున 80 హత్యలు, 77 అత్యాచార ఘటనలు జరిగిన తీరు మన ప్రభుత్వాల అలస త్వాన్ని ఎత్తిచూపుతున్నాయి. హత్యల్లో దేశంలోనే ప్రథమ స్థానంతో, అత్యాచార ఘటనల్లో ద్వితీయ స్థానంతో ఉత్తరప్రదేశ్ వెలవెలబోతోంది. ఎస్సీ వర్గాల పౌరులపై అంతక్రితంతో పోలిస్తే దేశ వ్యాప్తంగా నేరాలు 9.4 శాతం, ఎస్టీలపై 9.3 శాతం పెరగటం మారని మన సమాజ పోకడలను పట్టిచూపుతోంది. నమోదైన కేసుల ఆధారంగా మాత్రమే ఎన్సీఆర్బీ నివేదిక రూపొందుతుందని మరిచిపోకూ డదు. బాధితుల భయాందోళనలవల్ల పోలీసుల దృష్టికి రాని కేసులు, వచ్చినా రకరకాల ప్రభా వాలకు లొంగి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం వంటి కారణాల వల్ల నమోదైన కేసులతో పోలిస్తే... జరిగినవి అనేక రెట్లు అధికంగా ఉండొచ్చు. పోలీసులు తక్షణం స్పందించే విధానం నేర నివారణకు ఉపయోగపడుతుంది. నిరుడు డిసెంబర్లో ఢిల్లీలో పదహారేళ్ల బాలికను దుండగులు అపహరించారని వచ్చిన ఫిర్యాదుతో వెనువెంటనే పోలీసులు కదలడంవల్లే ఆమె సురక్షితంగా బయటపడింది. దుండగులు సైతం చిక్కారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్‌తో ఇటీవలే ఒక తెలుగు యువతి ఢిల్లీలో నేరగాళ్ల నుంచి తప్పించుకున్న తీరు కూడా ఇందుకు ఉదాహరణ. తనను అపహరించుకుపోతున్న ఆటోవాలపై దిశ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలీసు లకు ఆ బాలిక సమాచారం ఇవ్వడం, వైఎస్సార్ కడప జిల్లాలోని ఒక డీఎస్పీ వెనువెంటనే రంగం లోకి దిగి ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసి ఆమెను కాపాడటం సత్వర చర్యలవల్ల ఎలాంటి ఫలితం సిద్ధిస్తుందో తెలియజెబుతుంది. ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తమ బాధ్యత తీరిందని ఏపీ పోలీసులు ఊరుకోలేదు. ఆమె తిరిగొచ్చేవరకూ అన్నివిధాలా అండగా నిలబడ్డారు. తక్షణ స్పందనతోపాటు అదే స్ఫూర్తితో చురుగ్గా దర్యాప్తు చేయడం, పకడ్బందీ సాక్ష్యాధారాలు సేకరించి శిక్షపడేలా చూడటం నేర నివారణకు ఎంతగానో తోడ్పడుతుంది. స్పందన, దిశ యాప్ మొదలుకొని డయల్ 100 వరకూ మొత్తం ఆరు మార్గాల్లో ఫిర్యాదు చేసేందుకు వీలవడంతో అంతక్రితం సంవత్స రంకన్నా 2020లో ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు 15 శాతం తగ్గటం గమనించదగ్గది. దేశంలో సైబర్ నేరాలు గతంతో పోలిస్తే పెరగడం ఆ రంగంపై శ్రద్ధ పెట్టాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది. కంప్యూటర్లు, సెల్ఫోన్ల ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీల పెరగడాన్ని గమనించిన నేరగాళ్లు ఓటీపీలు, పాస్వర్డ్లు అపహరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఈ రంగంలో నేరాలు 11.8 శాతం అధికం కావడం ఆందోళన కలిగించే అంశం. స్థానికంగా ఉండి నేరం చేస్తూ కూడా అందుకు ఖండాంతరాల్లోని సర్వర్లను వినియోగించటంవల్ల వెనువెంటనే నేరగాళ్ల ఆచూకీ రాబట్టడం కష్టమవుతోంది. దీనికితోడు సైబర్ నేరంపై ఫిర్యాదు ఇచ్చినా తగినవిధంగా స్పందించని పోలీసుల వైఖరి సైతం ఈ రకమైన నేరాల పెరుగుదలకు కారణమవుతోంది. ఈ విషయంలో రాజ స్తాన్, కేరళ రాష్ట్రాల తీరు ఆదర్శనీయం. ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రాజస్తాన్ నిర్ణయిస్తే, కేరళ సైబర్ పోలీసు బెటాలియన్‌ను రూపొందిస్తోంది. నేర నివారణకు రూపొందించే వ్యవస్థలు, నిందితులకు వెనువెంటనే శిక్షలుపడేలా చర్యలు తీసుకోవటంవంటివి నిస్సందేహంగా శాంతిభద్రతలు సజావుగా ఉండేందుకు తోడ్పడతాయి. కానీ మొత్తంగా సామాజిక దురాచారాలు, సంస్కృతి పేరుతో చలామణి అవుతున్న విలువలు, అధికారంలో ఉన్నవారు బాధ్య తారహితంగా మాట్లాడే తీరు మారనంతకాలం నేరాలను సమూలంగా నాశనం చేయడం అసాధ్యం. దురదృష్టవశాత్తూ ఆ వైపుగా దృష్టి సారించకపోగా అవి మరింత విజృంభించేందుకు నాయకులు దోహదపడుతున్నారు. మహిళలను కించపరచడం, అట్టడుగు వర్గాలవారిని నిరాదరించటం, తమ వారైతే వెనకేసుకొచ్చే ధోరణి రాను రాను పెరుగుతున్నాయి. బాధ్యతాయుతమైన ప్రవర్తననూ, జవాబుదారీతనాన్నీ నేతలు అలవర్చుకోనంతకాలం పరిస్థితి పెద్దగా మారదు. సురక్షితమైన సమాజం రూపొందటానికి అడ్డదారులుండబోవని గుర్తించాల్సివుంది. -
రూ.2 వేల నోటు, మరో షాకింగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ట రద్దు తరువాత చలామణిలోకి వచ్చిన పెద్ద నోటు రూ.2వేల నోటుపై తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ నోట్లను చెక్ పెట్టేందుకంటూ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి నరేంద్ర మోదీ సర్కార్ ఆ తరువాత అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్లతో రూ.2వేల నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే రూ.2వేల నోట్లు కాపీ కొట్టడానికి ఈజీగా, భద్రతా డొల్లతనంతో నిండి ఉన్నాయని తాజాగా తేలింది. దేశంలో హల్ చల్ చేస్తున్న నకిలీనోట్లలో సగానికిపైగా రూ.2 వేల నోట్లు ఉన్నాయని, తాజా రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) అందించిన డేటా ప్రకారం పీఎం నరేంద్ర మోదీ డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా పట్టుబడిన నకిలీ నోట్లలో ఎక్కువ శాతం రూ.2వేల నోట్లు ఉన్నాయని ఈ డేటా వెల్లడించింది. మొత్తంలో 56 శాతం రూ. 2వేల నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించాయి.. అంతేకాదు రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో నకిలీ కరెన్సీ పట్టుబడి, గుజరాత్ ఫేక్ కరెన్సీ అడ్డాగా మారిందని డేటా ద్వారా తెలుస్తోది. కాగా 2016, నవంబర్ 8న రూ .1000, రూ .500 నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించిన ప్రధాని మోదీ, అవినీతి, నకిలీ నోట్లు, నల్లధనాన్ని నిరోధించేందుకు తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. భారతదేశంలో నకిలీ కరెన్సీపై తాము ఈ చేపట్టిన ఈ మహాయజ్ఞంలో ప్రజలు తమకు సహకరించాలనీ కోరిన సంగతి తెలిసిందే. Promise: Demonetization will eliminate fake currency, mitron bas 50 din dijiye Reality: Latest NCRB data shows 👉 56% of all fake currency seized in India is the new ₹2000 note 👉 Gujarat is the hub of fake currency. State where highest number of fake notes were found — Dhruv Rathee (@dhruv_rathee) January 15, 2020 -
ఎన్సీఆర్బీ నివేదికలో ‘డేటా’ గల్లంతు!
సాక్షి, న్యూఢిల్లీ : 2017లో దేశంలో జరిగిన వివిధ రకాల నేరాల గురించి సమాచారాన్ని సేకరించి, వాటిని విశ్లేషించిన ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)’ సోమవారం ఆ డేటాకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. 2018లోనే విడుదల చేయాల్సిన ఈ డేటాను ఏడాది ఆలస్యంగా విడుదల చేయడానికి కారణం ఏమిటో వివరించలేదు. విడుదల చేసిన డేటాలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. దేశంలో చోటు చేసుకున్న మూక హత్యలు, సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు చేసిన లేదా చేయించిన హత్యల వివరాలు, కాపు పంచాయతీల ఆదేశాల మేరకు జరిగిన హత్యలు, మత ఘర్షణల్లో చనిపోయిన వారి డేటాను విడుదల చేయలేదు. ఈ నేరాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించినప్పటికీ డేటాను ప్రచురించక పోవడం ఆశ్చర్యంగా ఉందని, దీన్ని చివరి నిమిషంలో ప్రచురించకుండా ఎందుకు నిలిపివేశారో ఉన్నతాధికారులకే తెలియాలని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. దేశంలో 2017లో గోరక్షణ పేరిట మూక హత్యలు, మత విద్వేష సంఘటనలు ఎక్కువగా జరిగాయి. ‘పిల్లలను ఎత్తుకుపోయే కిడ్నాపర్లు వచ్చారు’ అంటూ సోషల్ మీడియా ప్రచారం వల్ల జరిగిన హత్యల వివరాలు కూడా డేటా నుంచి పూర్తిగా మాయమయ్యాయి. పైగా ఈ సారి నివేదికలో ముడుపెన్నడూ లేనిది ‘జాతి వ్యతిరేక శక్తుల’ పేరిట మూడు కొత్త కేటగిరీలను చేర్చారు. వాటిలో ఒకటి ఈశాన్య రాష్ట్రాల తిరుగుబాటుదారులు, రెండు నక్సలైట్లు లేదా వామపక్ష తీవ్రవాదుల, మూడు జిహాది టెర్రరిస్టులు సహా టెర్రరిస్టులు. ఈ మూడు వర్గీకరణల కిందకు వచ్చే వారంతా జాతి వ్యతిరేక శక్తులంటూ వారు ఇంత వరకు భారతీయ శిక్షా స్మతి, ఆయుధాల చట్టం, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద చేసిన నేరాల గురించి వెల్లడించారు. టెర్రరిస్టు దాడుల్లో చనిపోయిన హిందువుల గురించి ఇచ్చారు. హిందువుల దాడుల్లో మరణించిన ముస్లింల గురించి ఎక్కడా, ఏ కేటగిరీ కింద కూడా ఇవ్వలేదు. డేటాలో పలు నేరాలకు సంబంధించిన వివరాలు గల్లంతవడం వెనక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదు. ఇలా జరగడం ఇదే కొత్త కాదు. బీజీపీ ప్రభుత్వం తన రాజకీయ లక్ష్యాల కోసం గత కొన్ని ఏళ్లుగా ఇలాంటి సమాచారాన్ని దాస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ఒక్క నేరాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అనేక గణాంకాల వివరాలను తొక్కిపెట్టింది. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న నిరుద్యోగుల శాతం వివరాలను దాచేయడమే కాకుండా మూడు నెలలకోపారి నిరుద్యోగంపై జరిగే సర్వేలను నిలిపి వేసింది. 2011 జనాభా లెక్కలకు సంబంధించి కులాల విశ్లేషణా వివరాలను కూడా 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తొక్కి పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను కూడా బీజేపీ ప్రభుత్వం తొక్కి పెడుతూ వస్తోంది. ఇలా చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమే కాదు. ఇలాంటి నేరాలు, ఆర్థిక గణాంకాలు విడుదల చేయకపోతే భవిష్యత్తుతో నేరాలను అరికట్టేందుకు, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు విధాన నిర్ణయాలు తీసుకోవడం ఎలా సాధ్యం అవుతుందని మేథావులు ప్రశ్నిస్తున్నారు. -
గతేడాది రైలుప్రమాదాల్లో 25వేల మంది మృతి
రైలు ప్రమాదాలు మన దేశంలో తరచు ఏదో ఒకమూల జరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం.. అంటే 2014లో జరిగిన రైలు ప్రమాదాల్లో దాదాపు 25 వేల మందికి పైగా మరణఇంచారు, మరో 3,882 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని జాతీయ నేర రికార్డుల బ్యూరో వెల్లడించింది. ఎన్ సీ ఆర్ బీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... రైలు ప్రమాదాలకు సంబంధించి 2014లో మొత్తం 28,360 కేసులు నమోదయ్యాయి. అవి అంతకు ముందు సంవత్సరం వాటి కంటే మాత్రం 9.2 శాతం తక్కువే. ఎక్కువగా 61.6 శాతం ప్రమాదాలు రైళ్లలోంచి పడిపోవడం లేదా రైలు పట్టాల మీద వేరే వాహనాలతో రైళ్లు ఢీకొనడం వల్ల జరిగాయి. ఇలాంటి ప్రమాదాలు మహారాష్ట్రలో ఎక్కువగా జరిగాయి. మొత్తం కేసుల్లో 42.5 శాతం ఇక్కడివే ఉన్నాయి. మెకానికల్ వైఫల్యాల వల్ల.. అంటే డిజైన్ సరిలేకపోవడం, ట్రాక్ వైఫల్యాలు, బ్రిడ్జిలు/సొరంగాల సమస్యల కారణంగా 469 ప్రమాదాలు సంభవించాయి. ఇలాంటి రైల్వే మెకానికల్ వైఫల్యాల వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 385 మంది మరణించారు. ఉగ్రవాదులు/తీవ్రవాదుల దుశ్చర్యల కారణంగా 18 ప్రమాదాలు సంభవించాయి. వాటిలో 18 ప్రాణాలు పోయాయి. డ్రైవర్ల తప్పిదాల కారణంగా 60 ప్రమాదాలు సంభవించగా, 67 మంది మరణించారు. -
దేశంలో రోజుకు 92 అత్యాచారాలు!
భారతదేశంలో ప్రతిరోజూ సగటున 92 మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారట. దేశ రాజధానిలో అయితే రోజుకు నాలుగు చొప్పున ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో అత్యధికంగా ఇక్కడే 1636 కేసులు నమోదయ్యాయి. జాతీయ నేర రికార్డుల సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. 2012లో మన దేశంలో మొత్తం 24,923 అత్యాచార కేసులు నమోదైతే.. 2013లో వాటి సంఖ్య 33,707కు పెరిగింది. ఈ 33వేల మందిలో సగానికి పైగా.. అంటే 15,556 కేసుల్లో బాధితులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసువారేనట. ఢిల్లీలో గడిచిన సంవత్సరంతో పోలిస్తే అత్యాచారాలు రెట్టింపు అయ్యాయి. 2012లో కేవలం 706 కేసులే నమోదు కాగా, 2013లో ఏకంగా 1636 నమోదయ్యాయి. ఢిల్లీ తర్వాత ముంబైలో 391, జైపూర్‌లో 192, పుణెలో 171 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. సగటున మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అయితే రోజుకు 11 అత్యాచారాలు జరుగుతున్నాయి. 2013లో అక్కడ 4,335 కేసులు నమోదయ్యాయి. ఇది అన్ని రాష్ట్రాల్లోకీ అత్యధికం. ఆ తర్వాతి స్థానంలో 3285 కేసులతో రాజస్థాన్, 3063 కేసులతో మహారాష్ట్ర, 3050 కేసులతో ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. మైనర్లపై అత్యాచారాలు 2012 సంవత్సరంలో 9082 నమోదు కాగా, 2013లో 13,304 నమోదయ్యాయి. ప్రధానంగా నగరాల్లోనే ఈ బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. 94 శాతం కేసుల్లో నిందితులు బాధితులకు బాగా తెలిసినవారే అవుతున్నారు. 539 కేసుల్లో సొంత తల్లిదండ్రులు, 10782 కేసుల్లో పొరుగువాళ్లు, 2,135 కేసుల్లో బంధువులు, 18,171 కేసుల్లో తెలిసినవారు నిందితులుగా ఉన్నారు. -
వ్యభిచారం కేసుల్లో ఉమ్మడి రాష్ట్రం సెకండ్!!
ఒక పెద్దాపురం.. ఒక చిలకలూరిపేట.. పేరు ఏదైతేనేం, మన రాష్ట్రంలో వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఎంతగా అంటే.. దేశం మొత్తమ్మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో రెండో స్థానంలో ఉందట. ఈ విషయాన్ని జాతీయ నేర గణాంకాల సంస్థ తన లెక్కల్లో వెల్లడించింది. మన కంటే ముందు ఈ విషయంలో తమిళనాడు నిలిచింది. దేశం మొత్తమ్మీద జరుగుతున్న వ్యభిచారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి 20 శాతం వాటా ఉంది. 2013 సంవత్సరానికి సంబంధించి ఎన్సీఆర్బీ వెల్లడించిన గణాంకాలు ఈ వివరాలను తెలిపాయి. ఉమ్మడి రాష్ట్రం మొత్తమ్మీద చూసుకుంటే.. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనే ఎక్కువ వ్యభిచారం కేసులు, ఉమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తమ్మీద 2,541 బ్రోతల్ కేసులు నమోదైతే.. వాటిలో 489 కేసులు ఆంధ్రప్రదేశ్వే ఉన్నాయి. తమిళనాడులో ఏకంగా 549 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్ జంట కమిషనరేట్ల పరిధిలో హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. శివారు ప్రాంతాల్లోని పలు హోటళ్లలో పలువురు మోడళ్లు, చిన్న స్థాయి నటీమణులు, టీవీ సీరియల్ ఆర్టిస్టులు పలు సందర్భాలలో దొరికేశారు. ఎప్పటికప్పుడు దీన్ని అరికట్టేందుకు పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా.. చాపకింద నీరులా ఈ వ్యవహారం మాత్రం కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి బుక్ అయిన కేసులతో పోలిస్తే పోలీసులు పట్టుకుని, పెట్టీ కేసులుగా వదిలేసినవి, వాళ్ల దృష్టివరకు రాకుండా జరిగేవి కొన్ని రెట్లు ఎక్కువ ఉంటాయి. -
అత్యాచార భారత్.. రోజూ 93 మంది అబలలు బలి
చెన్నై: ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా.. నిరసనలు, ఆందోళనలు చేసినా.. ప్రభుత్వాలు మారినా.. మన దేశంలో మహిళలకు ఇప్పటికీ తగిన భద్రత లేదు. రోజురోజుకూ మహిళలపై ఆగడాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ సగటున 93 మంది మహిళలు అత్యాచారాలకు బలవుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదికలో ఈ నివ్వెరపరిచే విషయం వెల్లడైంది. 2012 సంవత్సరలో మన దేశంలో 24,923 అత్యాచారాలు జరగగా.. 2013లో ఆ సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగించే విషయం. 33,707 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఉదంతం అనంతరం కఠిన చట్టం రూపొందించినా మహిళలకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2012లో ఢిల్లీలో 585 అత్యాచార కేసులు నమోదు కాగా, 2013లో 1441 కేసులు అంటే క్రితం ఏడాది కంటే రెట్టింపు కావడం గమనార్హం. మనదేశంలో మహిళలకు భద్రత లేని నగరాల్లో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత ముంబై, జైపూర్, పుణె ఉన్నాయి. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే గతేడాది మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 4,335 రేప్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రాజస్థాన్ (3285), మహారాష్ట్ర (3063), ఉత్తరప్రదేశ్ (3050) రాష్ట్రాలలో అత్యధిక కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో ఎక్కువగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు ఉన్నారు. నేరాలకు పాల్పడుతున్నవారిలో 94 శాతం మంది పరిచయం ఉన్నవారే. తెలిసినవారు, ఇంటిపక్కన ఉన్నవారు ఎక్కువగా అత్యాచారాలకు పాల్పడుతుండగా, బంధువులు కూడా నేరాలకు ఒడిగడుతున్నారు.