వ్యభిచారం కేసుల్లో ఉమ్మడి రాష్ట్రం సెకండ్!!
ఒక పెద్దాపురం.. ఒక చిలకలూరిపేట.. పేరు ఏదైతేనేం, మన రాష్ట్రంలో వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఎంతగా అంటే.. దేశం మొత్తమ్మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో రెండో స్థానంలో ఉందట. ఈ విషయాన్ని జాతీయ నేర గణాంకాల సంస్థ తన లెక్కల్లో వెల్లడించింది. మన కంటే ముందు ఈ విషయంలో తమిళనాడు నిలిచింది. దేశం మొత్తమ్మీద జరుగుతున్న వ్యభిచారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 20 శాతం వాటా ఉంది. 2013 సంవత్సరానికి సంబంధించి ఎన్సీఆర్బీ వెల్లడించిన గణాంకాలు ఈ వివరాలను తెలిపాయి.
ఉమ్మడి రాష్ట్రం మొత్తమ్మీద చూసుకుంటే.. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనే ఎక్కువ వ్యభిచారం కేసులు, ఉమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తమ్మీద 2,541 బ్రోతల్ కేసులు నమోదైతే.. వాటిలో 489 కేసులు ఆంధ్రప్రదేశ్వే ఉన్నాయి. తమిళనాడులో ఏకంగా 549 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్ జంట కమిషనరేట్ల పరిధిలో హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. శివారు ప్రాంతాల్లోని పలు హోటళ్లలో పలువురు మోడళ్లు, చిన్న స్థాయి నటీమణులు, టీవీ సీరియల్ ఆర్టిస్టులు పలు సందర్భాలలో దొరికేశారు. ఎప్పటికప్పుడు దీన్ని అరికట్టేందుకు పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా.. చాపకింద నీరులా ఈ వ్యవహారం మాత్రం కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి బుక్ అయిన కేసులతో పోలిస్తే పోలీసులు పట్టుకుని, పెట్టీ కేసులుగా వదిలేసినవి, వాళ్ల దృష్టివరకు రాకుండా జరిగేవి కొన్ని రెట్లు ఎక్కువ ఉంటాయి.