![Crime against women in Rajasthan What data says - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/22/Rajasthan-ncrb.jpg.webp?itok=Vj6SWaNr)
‘మహిళలపై నేరాలు’ ప్రధాన ప్రచారాస్త్రంగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు సాగుతున్నాయి. వీటిపైనే బీజేపీ తమ ప్రచార ర్యాలీలు, బహిరంగ సభల్లో అధికార కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ మేనిఫెస్టోలలో మహిళా భద్రతకు సంబంధించి అనేక హామీలు ప్రకటించాయి.
ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేతలందరూ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. నవంబర్ 15న బార్మర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో మహిళలపై అఘాయిత్యాల్లో రాజస్థాన్ అగ్రగామిగా ఉందని ఆరోపించారు.
గణాంకాలు ఇవీ..
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం.. 2021 సంవత్సరంలో అత్యధికంగా రేప్ కేసులు నమోదైన రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించింది. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ 376 కింద 6,337 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 2,845 కేసులు నమోదయ్యాయి. ఇక 2021లో దేశవ్యాప్తంగా 31,677 అత్యాచార కేసులు నమోదయ్యాయి.
మహిళలపై ఇతర నేరాల విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్ తర్వాత రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. 2021లో అత్యధికంగా 56,083 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్‌లో 40,738 కేసులు నమోదయ్యాయి.
రాజస్థాన్‌లో మహిళలపై నేరాల సంఖ్య 2020 కంటే 2021లో దాదాపు 17 శాతం పెరిగింది. అయితే ఇది 2019 కేసుల సంఖ్య 41,550 కంటే 2 శాతం తగ్గడం గమనార్హం. 2021లో దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు సంబంధించి 4,28,278 కేసులు నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment