నేరాలు మన సమాజంలోని చీకటి కోణాలను వెల్లడిస్తే, వాటి నివారణకు అనుసరించే మార్గాలు సమాజం తాలూకు సున్నితత్వాన్ని, అదే సమయంలో దాని దృఢ సంకల్పాన్ని తెలియజేస్తాయి. ఏటా గడిచిన సంవత్సరంలో జరిగిన నేరాలపై విడుదలయ్యే జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు ఈసారి కాస్త ముందుగానే వెలువడ్డాయి. నేరాల సంఖ్య పెరిగిందని, ఎప్పటిలానే మహిళల భద్రత విషయంలో సంతృప్తికరమైన ప్రగతి సాధించలేకపోయామని, ముఖ్యంగా నగరాల్లో పరిస్థితి ఏమంత గర్వకారణంగా లేదని తాజా నివేదిక చూస్తే అర్థమవుతుంది. 2019తో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై నేరాల్లో 24.65 శాతం తగ్గుదల కనిపిస్తున్న సంగతి కాదనలేనిది. ఇతర నగరాల్లో సైతం 8.3 శాతం తగ్గాయి. కానీ 2020లో దీర్ఘకాలం లాక్‌డౌన్ నిబంధనలు అమలుకావడం, పౌరుల కదలికలపై పరిమితులు విధించడం పర్యవసానంగానే ఇది సాధ్యమైంది. అయితే లాక్‌డౌన్ వల్ల వారిపై గృహహింస బాగా పెరిగింది. సంఖ్యాపరంగా మహిళలపై నేరాలు తగ్గినట్టు కనబడుతున్నా నేరగాళ్ల క్రౌర్యం తీవ్రత పెరగడాన్ని గమనించవచ్చు. ముంబైలో ఇటీవల బయటపడిన ఒక అత్యాచార ఘటనే ఇందుకు ఉదాహరణ. 997 అత్యాచార ఘటనలతో ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే ఢిల్లీలో ఎక్కువే. దేశవ్యాప్తంగా 2020లో రోజుకు సగటున 80 హత్యలు, 77 అత్యాచార ఘటనలు జరిగిన తీరు మన ప్రభుత్వాల అలస త్వాన్ని ఎత్తిచూపుతున్నాయి. హత్యల్లో దేశంలోనే ప్రథమ స్థానంతో, అత్యాచార ఘటనల్లో ద్వితీయ స్థానంతో ఉత్తరప్రదేశ్ వెలవెలబోతోంది. ఎస్సీ వర్గాల పౌరులపై అంతక్రితంతో పోలిస్తే దేశ వ్యాప్తంగా నేరాలు 9.4 శాతం, ఎస్టీలపై 9.3 శాతం పెరగటం మారని మన సమాజ పోకడలను పట్టిచూపుతోంది.
నమోదైన కేసుల ఆధారంగా మాత్రమే ఎన్‌సీఆర్‌బీ నివేదిక రూపొందుతుందని మరిచిపోకూ డదు. బాధితుల భయాందోళనలవల్ల పోలీసుల దృష్టికి రాని కేసులు, వచ్చినా రకరకాల ప్రభా వాలకు లొంగి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం వంటి కారణాల వల్ల నమోదైన కేసులతో పోలిస్తే... జరిగినవి అనేక రెట్లు అధికంగా ఉండొచ్చు. పోలీసులు తక్షణం స్పందించే విధానం నేర నివారణకు ఉపయోగపడుతుంది. నిరుడు డిసెంబర్‌లో ఢిల్లీలో పదహారేళ్ల బాలికను దుండగులు అపహరించారని వచ్చిన ఫిర్యాదుతో వెనువెంటనే పోలీసులు కదలడంవల్లే ఆమె సురక్షితంగా బయటపడింది. దుండగులు సైతం చిక్కారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్‌తో ఇటీవలే ఒక తెలుగు యువతి ఢిల్లీలో నేరగాళ్ల నుంచి తప్పించుకున్న తీరు కూడా ఇందుకు ఉదాహరణ. తనను అపహరించుకుపోతున్న ఆటోవాలపై దిశ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలీసు లకు ఆ బాలిక సమాచారం ఇవ్వడం, వైఎస్సార్ కడప జిల్లాలోని ఒక డీఎస్పీ వెనువెంటనే రంగం లోకి దిగి ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసి ఆమెను కాపాడటం సత్వర చర్యలవల్ల ఎలాంటి ఫలితం సిద్ధిస్తుందో తెలియజెబుతుంది. ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తమ బాధ్యత తీరిందని ఏపీ పోలీసులు ఊరుకోలేదు. ఆమె తిరిగొచ్చేవరకూ అన్నివిధాలా అండగా నిలబడ్డారు. తక్షణ స్పందనతోపాటు అదే స్ఫూర్తితో చురుగ్గా దర్యాప్తు చేయడం, పకడ్బందీ సాక్ష్యాధారాలు సేకరించి శిక్షపడేలా చూడటం నేర నివారణకు ఎంతగానో తోడ్పడుతుంది. స్పందన, దిశ యాప్ మొదలుకొని డయల్ 100 వరకూ మొత్తం ఆరు మార్గాల్లో ఫిర్యాదు చేసేందుకు వీలవడంతో అంతక్రితం సంవత్స రంకన్నా 2020లో ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు 15 శాతం తగ్గటం గమనించదగ్గది.
దేశంలో సైబర్ నేరాలు గతంతో పోలిస్తే పెరగడం ఆ రంగంపై శ్రద్ధ పెట్టాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది. కంప్యూటర్లు, సెల్‌ఫోన్‌ల ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీల పెరగడాన్ని గమనించిన నేరగాళ్లు ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు అపహరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఈ రంగంలో నేరాలు 11.8 శాతం అధికం కావడం ఆందోళన కలిగించే అంశం. స్థానికంగా ఉండి నేరం చేస్తూ కూడా అందుకు ఖండాంతరాల్లోని సర్వర్లను వినియోగించటంవల్ల వెనువెంటనే నేరగాళ్ల ఆచూకీ రాబట్టడం కష్టమవుతోంది. దీనికితోడు సైబర్ నేరంపై ఫిర్యాదు ఇచ్చినా తగినవిధంగా స్పందించని పోలీసుల వైఖరి సైతం ఈ రకమైన నేరాల పెరుగుదలకు కారణమవుతోంది. ఈ విషయంలో రాజ స్తాన్, కేరళ రాష్ట్రాల తీరు ఆదర్శనీయం. ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రాజస్తాన్ నిర్ణయిస్తే, కేరళ సైబర్ పోలీసు బెటాలియన్‌ను రూపొందిస్తోంది. నేర నివారణకు రూపొందించే వ్యవస్థలు, నిందితులకు వెనువెంటనే శిక్షలుపడేలా చర్యలు తీసుకోవటంవంటివి నిస్సందేహంగా శాంతిభద్రతలు సజావుగా ఉండేందుకు తోడ్పడతాయి. కానీ మొత్తంగా సామాజిక దురాచారాలు, సంస్కృతి పేరుతో చలామణి అవుతున్న విలువలు, అధికారంలో ఉన్నవారు బాధ్య తారహితంగా మాట్లాడే తీరు మారనంతకాలం నేరాలను సమూలంగా నాశనం చేయడం అసాధ్యం. దురదృష్టవశాత్తూ ఆ వైపుగా దృష్టి సారించకపోగా అవి మరింత విజృంభించేందుకు నాయకులు దోహదపడుతున్నారు. మహిళలను కించపరచడం, అట్టడుగు వర్గాలవారిని నిరాదరించటం, తమ వారైతే వెనకేసుకొచ్చే ధోరణి రాను రాను పెరుగుతున్నాయి. బాధ్యతాయుతమైన ప్రవర్తననూ, జవాబుదారీతనాన్నీ నేతలు అలవర్చుకోనంతకాలం పరిస్థితి పెద్దగా మారదు. సురక్షితమైన సమాజం రూపొందటానికి అడ్డదారులుండబోవని గుర్తించాల్సివుంది.
నేరాలు తగ్గేదెలా?
Published Fri, Sep 17 2021 4:09 AM | Last Updated on Fri, Sep 17 2021 4:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment