‘వెయ్యిమంది పాలకుల నిరంకుశాధికారం కూడా ఒక వ్యక్తిమాత్రుడి హేతువు ముందు దూదిపింజెలా కొట్టుకుపోతుంద’ంటాడు ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలి. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచి గూండా మూకల్ని మందలుగా వదుల్తూ హత్యలూ, విధ్వంసాలతో ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న టీడీపీ నేతృత్వంలోని అధికార ఎన్డీయే కూటమికి ఈ జ్ఞానం తలకెక్కే సమయం ఆసన్నమైంది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు వివిధ జాతీయ పార్టీల నాయకులు హాజరై మద్దతు తెలపడం, హింసాకాండపై ప్రదర్శించిన వీడియోనూ, ఛాయా చిత్రాలనూ చూసి దిగ్భ్రాంతి చెందటం దీన్నే చాటుతోంది.
ఏపీలో ఇంత దారుణమైన పరిస్థితులున్నాయని ఇన్నాళ్లుగా తెలియదని సమాజ్‌వాదీ, ఉద్ధవ్ శివసేన, ఆప్, తృణమూల్, ఐయూఎంఎల్, అన్నా డీఎంకే, వీసీకే పార్టీల నేతలు ప్రకటించారు. ఒకటా రెండా... గత యాభై రోజులుగా రాష్ట్రంలో చిత్తూరు మొదలుకొని శ్రీకాకుళం వరకూ ఏదోమూల పాలకపక్ష మూకలు మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. నడిరోడ్లపై పట్టపగలు హత్యలకు పాల్పడుతున్నాయి. కత్తులు, కొడవళ్లు, గొడ్డళ్లు, రాళ్లతో ఇళ్లపైకి పోయి వీరంగం వేస్తున్నాయి. బుల్‌డోజర్లతో నివాసగృహాలను నేలమట్టం చేస్తున్నాయి. ఇంతవరకూ 36 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి.
300 మందిపై హత్యాయత్నాలు, మొత్తంగా వెయ్యికి పైగా దాడులు జరిగాయి. వీరి ఆగడాలు తట్టుకోలేక దాదాపు 4,000 మంది స్వస్థలాలు విడిచిపోయారు. 30 మంది వరకూ బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ముఠాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రిగా కూడా బాధ్యతలు వెలగబెడుతున్న ఆయన పుత్రరత్నం లోకేశ్ వెనకుండి ప్రోత్సహిస్తుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్టు మిగిలిపోయారు.
పశ్చిమ బెంగాల్ వంటిచోట్ల జరిగిన స్వల్ప స్థాయి సంఘటనలకే కేంద్ర బలగాలను పంపి హడావిడి చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న అరాచకాలను చూసీచూడనట్టు వదిలేసింది. ఎన్డీయే వంచనా శిల్పం ఎంతటిదో చెప్పటానికి మంగళవారం నాటి ఉదంతాలు తార్కాణం. పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ పల్లెసీమల్లో, పట్టణాల్లో భూ యాజమాన్య హక్కులను నిర్ధారించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు సూచించారు.
ఇంచుమించు అదే సమయంలో ఆ కూటమి నేతృత్వంలోనే ఉన్న ఏపీ ప్రభుత్వం గతంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు చట్టాన్ని రద్దు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టింది. అంతకుముందు ఎన్నికల ప్రచారఘట్టంలో సైతం ఈ చట్టంపై టీడీపీ, జనసేన అధినేతలు అవాకులూ చవాకులూ మాట్లాడుతుంటే బీజేపీ గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. రాజకీయాల్లో కనీస నైతిక విలువలు పాటించాలన్న స్పృహలేని ఇలాంటి పార్టీలు పాలన చేజిక్కించుకోవటం మన ప్రజాస్వామ్య ప్రారబ్ధం.
‘సూపర్ సిక్స్’ పేరుతో ప్రజానీకాన్ని వంచించి, ఎన్నికల సంఘాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని సాధించిన గెలుపును చూసి బలుపని భ్రమపడుతున్న కూటమి నేతలు ఇంతవరకూ వాగ్దానాల అమలు ఊసెత్తడం లేదు. వాటి సంగతేం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఫలితాలు వెలువడుతుండగానే ప్రారంభమైన దాడులను కొనసాగించి జనం దృష్టి మళ్లించకపోతే తమకు రాజకీయ మనుగడ లేదన్న నిర్ణయానికొచ్చి ఈ రాక్షసకాండకు తెరలేపారు.
వినుకొండలో పట్టపగలు అందరూ చూస్తుండగా టీడీపీ కార్యకర్త జిలానీ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త రషీద్‌ను కత్తితో నరికి చంపితే కనీసం ప్రాథమిక దర్యాప్తు కూడా జరపకుండా పల్నాడు జిల్లా ఎస్పీ వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని ప్రకటించారు. ఇలాంటి అధికారుల కారణంగానే మారణాయుధాలతో రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి.
ఈ హింసాత్మక వాతావరణం పర్యవసానంగానే పసిపిల్లలు మొదలుకొని అనేకమందిపై అత్యాచారాలు సాగుతున్నాయి. హత్యలు జరుగుతున్నాయి. ఆడ పిల్లలపై ఎవరు అకృత్యాలకు పాల్పడినా వెంటనే వచ్చి వాలతానని, దుండగులను పట్టి బంధి స్తామని ఎన్నికల ప్రచార సమయంలో పెద్ద కబుర్లు చెప్పిన పవన్ పత్తాలేరు.
దాడులకు, హత్యలకు పాల్పడుతుంటే సాధారణ ప్రజానీకం భయపడి వాగ్దానాలపై తమను నిలదీయటానికి సాహసించరని కూటమి పాలకులు భ్రమపడుతున్నట్టుంది. ఢిల్లీ ధర్నాలో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ చెప్పినట్టు బుల్డోజర్ పాలన ఎల్లకాలం సాగదు. యూపీలో ఈ తరహా పాలనే సాగిస్తున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో జనం గట్టిగా బుద్ధి చెప్పారు.
కాస్తయినా ఇంగితజ్ఞానం ఉంటే గతం కన్నా తాము మెరుగైన పాలన అందిస్తున్నామని నిరూపించుకోవటానికి కృషి చేయాలి. సకాలంలో హామీలు నెరవేర్చి ప్రజల మన్ననలు పొందాలి. కానీ జరుగుతున్నదంతా అందుకు భిన్నం. బడులు తెరిచి నెల్లాళ్లయినా ఇంతవరకూ ‘అమ్మకు వందనం’ లేదు. సాగుబడి మొదలై నెల కావస్తున్నా‘రైతు భరోసా’ జాడలేదు.
నిరుద్యోగులకు నెలకు రూ. 3,000, మహిళలకు నెలకు రూ. 1,500,ఇంటింటికీ మూడు ఉచిత సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కబుర్లు ఎటు పోయాయో తెలియదు. తెల్లారిలేస్తే మారణకాండే పాలకులకు నిత్యకృత్యమైంది. ఇలాంటి ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజైనా అధికారంలో కొనసాగే నైతిక హక్కుంటుందా? కేంద్రం కళ్లు తెరవాలి. ఈ అరాచకానికి అడ్డుకట్ట వేయాలి. ఉపేక్షిస్తే సర్వోన్నత న్యాయస్థానంతో చెప్పించుకునే స్థితి వస్తుందని గుర్తించాలి.
నెత్తుటి పాలనపై రణభేరి!
Published Thu, Jul 25 2024 12:02 AM | Last Updated on Thu, Jul 25 2024 12:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment