
న్యూఢిల్లీ : 93 ఏళ్ల పద్మశ్రీ అవార్డు గ్రహీత కేవలం 8 రోజుల్లోనే కరోనాను జయించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ప్రముఖ కవి, సాహిత్య విభాగంలో పద్మశ్రీ అందుకున్న ఆనంద్ మోహన్ జుష్తీ గుల్జార్ దెహల్వి శ్వాసకోశ సమస్యతో జూన్ 1న నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఐసీయాకి తరలించి డాక్టర్ అభిషేక్ దేశ్వాల్ నాయకత్వంలోని ప్రత్యేక బృందం ఆయనకు చికిత్స అందించింది. ఆదివారం నిర్వహించిన పరీక్షలో కరోనా నెగిటివ్ అని తేలడంతో ఆయన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు.
అంతేకాకుండా జుష్తీ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనకు సహకారం అందించిన వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జుష్తీ.. ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాక మీరంతా మా ఇంటికి విందుకు రావాలి అంటూ వైద్య సిబ్బందిని ఆహ్వానించారు. 93 ఏళ్ల వయసులోనూ చాలా త్వరగా కోలుకున్న జుష్తీకి అభినందనలు అంటూ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ అజిత్ కుమార్ ట్వీట్ చేశారు. జుష్తీ రికవరీపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. రచనలతోనే కాదు అతి తక్కువ రోజుల్లోనే కరోనాపై విజయం సాధించి ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మరింత కాలం జీవించాలని కోరుకుంటున్నాం’ అంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. (కేజ్రీవాల్‌కు రేపు కరోనా పరీక్షలు? )