గుర్మీత్ కళ్లలో కన్నీటి సుడులు
సాక్షి, హరియాణా: డేరా సచ్చా సౌధా గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మాట వేదం.. ఆయన అడుగేస్తే ఓ సంచలనం.. ఎప్పుడు, ఎక్కడ ఆయన్ను చూసినా చుట్టూ భారీ భద్రతా వలయం.. ఒక్కసారి ఆయన చూపు తాకడం కోసం లక్షలాది మంది అభిమాన గణం ఎదురుచూపులు.. ఓ వీవీఐపీను పోలి ఉంటుంది ఆయన జీవితం.
ఉత్తర భారతంలో ఎంతో మంది అభిమానులను, మద్దతుదారులను కూడగట్టుకున్న ఆయన పేరు.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పుతో దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇద్దరు మహిళా స్వాధీలపై అత్యాచారం కేసులో ఆయన్ను శుక్రవారం సీబీఐ న్యాయస్థానం దోషిగా తేల్చింది. అత్యాచారం కేసులో ఆయనకు ఈ నెల 28న శిక్ష ఖరారు చేయనుంది.
న్యాయస్థానం తీర్పుతో డేరా చీఫ్ షాక్‌కు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం జైలుకు బయల్దేరి వెళ్లే ముందు ఆయన కళ్లలో కన్నీటి సుడులు తిరగాయి. సాధారణ బాబాలు, సాధువులతో పోల్చితే గుర్మీత్ అనుభవించిన జీవితం విభిన్నం. బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. రాక్‌స్టార్‌గా మ్యూజిక్ వీడియోలు చేసినా.. అదో క్రేజ్..!. గుర్మీత్ జీవితంలోని పలు ఆసక్తికర విశేషాలను ఓ సారి చూద్దాం.
♦ గుర్మీత్ అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని పట్ణణాలు, గ్రామాల్లో ఆయనకు భారీ సంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు. ఆయన కోసం ప్రాణమిచ్చేందుకు సిద్ధమని కూడా కొందరు అభిమానులు అంటూ ఉంటారు.
♦ రాజకీయంగానూ గుర్మీత్ బలాఢ్యులే. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హరియాణాలో ఆయన భాజపాకు మద్దతు ప్రకటించారు. డేరా సచ్చా సౌధా నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రముఖ నేతలతో పాటూ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ కూడా పాల్గొన్నారు. ఇక పంజాబ్‌లో అప్పట్లో భాజపా-అకాళీదళ్ ప్రభుత్వానికి ఆయన మద్దతు ప్రకటించారు.
♦ 2008లో గుర్మీత్ లక్ష్యంగా దాడి జరిగింది. అప్పటి నుంచి ఆయన జడ్ ప్లస్ కేటగిరీ కింద సెక్యూరిటీ పొందుతున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కార్లలో చక్కర్లు కొడుతున్నారు.
♦ తొలి రోజు జైల్లో గుర్మీత్ యోగాతో తన రోజును ప్రారంభించారు. దీన్ని బట్టి ఆయనకు రోజూ యోగా చేసే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. యోగా అనంతరం టీ, రెండు ముక్కల బ్రెడ్‌ను గుర్మీత్ ఆహారంగా తీసుకుంటారని తెలిసింది.
♦ గుర్మీత్‌కు నటనంటే విపరీతమైన ఆసక్తి. తన పలుకుబడిని ఉపయోగించి రెండు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’(ఎంఎస్‌జీ), ‘మెసెంజర్ ఆఫ్ గాడ్2’ సినిమాల్లో వెండి తెరపై మెరిశారు. ఈ సినిమాలకు సహ రచయితగా కూడా వ్యవహరించారు. లెదర్ దుస్తులు, వజ్రాలు అంటే గుర్మీత్‌కు ప్రేమ. ప్రేమ అనే పదం సరిపోదనుకుంటే పిచ్చి అని కూడా చెప్పుకోవచ్చు. లెదర్, డైమండ్లతో తయారుచేయించిన దుస్తుల్లో కనిపిస్తూ సినిమాల్లో సందేశాలు ఇచ్చారు.
♦ 'లవ్ చార్జర్' అనే మ్యూజిక్ వీడియోతో గుర్మీత్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. పలు అంతర్జాతీయ వేదికలపై ఈ వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియో మెగా హిట్ అయిందని.. దాదాపు 20 లక్షల కాపీలు అమ్ముడుపోయాయని డేరా సచ్చా సౌధా అప్పట్లో చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
♦ సంక్షేమ, ఆధ్యాత్మిక సంస్థగా పేర్కొనే డేరా సచ్చా సౌధా 1948లో స్థాపితమైంది. 1990లో దీని బాధ్యతలను గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా డేరాకు ఐదు కోట్ల మంది మద్దతుదారులు ఉన్నట్లు సంస్థ పేర్కొంటోంది. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ, సబ్సిడీపై ఆహార వస్తువులు, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ఈ సంస్థ ముఖ్యంగా దళితులు, నిమ్న కులాలకు చెందినవారిని ఎక్కువగా ఆకర్షిస్తోంది.
♦ తుది తీర్పు సందర్భంగా పంచకులలోని సీబీఐ కోర్టుకు వెళ్లే ముందు కూడా గుర్మీత్ తన దర్పాన్ని ప్రదర్శించుకున్నారు. దాదాపు 200 కార్ల కాన్వాయ్‌తో కోర్టుకు చేరుకున్నారు. 2002లో ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో గుర్మీత్‌ను పంచకుల సీబీఐ న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. ఈ నెల 28న ఆయనకు జైలు శిక్ష ఖరారు చేయనుంది.
♦ గుర్మీత్ అరెస్టు తర్వాత పంజాబ్, హరియాణాల్లో డేరాకు గల 32 ఆశ్రమాలను అధికారులు సీజ్ చేశారు. హరియాణాలోని సిర్సాలో గల డేరా హెడ్ క్వార్టర్స్ నుంచి గుర్మీత్ అనుచరులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి.