Panchkula CBI court
-
పంచకుల కోర్టుకు హనీప్రీత్..
సాక్షి, చండీగఢ్: డేరా బాబా సన్నిహితురాలు హనీప్రీత్ ఇన్సాన్‌ను పంచకుల ఘర్షణ కేసుకు సంబంధించి బుధవారం పంచ్‌కుల జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఆమె సహచరుడు సుఖ్దీప్ కౌర్‌ను కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. గత ఏడాది అక్టోబర్ 3న హనీప్రీత్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన ఘర్షణల్లో ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. ఆమెపై పోలీసులు రాజద్రోహం అభియోగాలనూ నమోదు చేశారు. డేరా చీఫ్‌ను దోషిగా నిర్ధారిస్తే అల్లర్లను ప్రేరేపించాలని హనీప్రీత్ ఓ డేరా సభ్యుడికి రూ 1.25 కోట్లు చెల్లించినట్టు ఆరోపణలున్నాయి. -
‘నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు’
సాక్షి, అంబాలా : గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రిక, పంచకుల అల్లర్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న హనీప్రీత్ ఇన్సాన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పంచకుల అల్లర్ల కేసును వాదిస్తున్న ముగ్గురి లాయర్లకు ఫీజు ఇచ్చేందుకు తన దగ్గర ఒక్కరూపాయి కూడా లేదని హనీప్రీత్ ఇన్సాన్ జైలు అధికారులకు లేఖ రాశారు. పంచకుల అల్లర్ల తరువాత సీజ్ చేసిన తన బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకునే సదుపాయాన్నికల్పించాలని ఆమె జైలు అధికారులకు కోరారు. డేరా సచ్చాసౌధా మాజీ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు రేప్ కేసులో 20 పంచకుల కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో జరిగిన అల్లర్లకు హనీప్రీత్ సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ అల్లర్ల కోసం హనీ ప్రీత్ రూ. 2 కోట్లు ఖర్చు చేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ కేసును సిట్ అధికారలు ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన లాయర్లకు ఫీజు చెల్లించేందుకుతన వద్ద ఒక్క రూపాయి కూడా లేదని.. సీజ్ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బును డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించాలంటూ ఆమె జైలు అధికారులను కోరారు. పంచకుల అల్లర్ల తరువాత 38 రోజులు పాటు హనీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే డేరాకు సంబందించిన బ్యాంక్‌కు ఖాతాలతో పాటు హనీప్రీత్ బ్యాంక్ ఖాతాలను అధికారులు సీజ్ చేశారు. -
హనీప్రీత్‌కు ఆశ్రయం ఇచ్చిందెవరు?
పంచకుల : ఇన్నాళ్లు పోలీసులకు కనిపించుకుండాపోయిన హనీప్రీత్ సింగ్‌కు ఎవరు ఆశ్రయం ఇచ్చారనే విషయాన్ని పంజాబ్ పోలీసులు శోధిస్తున్నారు. ఆ వివరాలు తెలిస్తే వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించనున్నారు. డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ అరెస్టు అయిన తర్వాత పంచకులలో డేరాలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ప్రాణనష్టం కలిగించడంతోపాటు ఆస్తి నష్టం కూడా కలిగించారు. ఈ అల్లర్లకు కారణం గుర్మీత్ కూతురుగా చెప్పుకునే హనీప్రీత్ అని పోలీసులు భావించారు. ఈ మేరకు ఆమెపై ఆరోపణలు నమోదుచేసి అరెస్టు చేసే లోపే ఆమె తప్పించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ పోలీసులకు కనిపించకుండా దాదాపు 39 రోజులుగా ఉన్నారు. అయితే, ఆమె అనూహ్యంగా మంగళవారం మీడియా ముందుకు వచ్చి జిరాక్పురా-పాటియాలా హైవే వద్ద పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఆమెను సీబీఐ ప్రత్యేక కోర్టుకు తరలించిన పోలీసులు జైలుకు పంపించారు. బుధవారం నుంచి ఆమెను ప్రశ్నించనున్నారు. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు తప్పించుకొని ఉంటున్న ఆమెకు ఎవరు ఆశ్రయం ఇచ్చారనేది కీలకంగా మారింది. 'మంగళవారం 2గంటల ప్రాంతంలో ఆమెను అరెస్టు చేశాం. ఆమెను ఇంకా విచారించాల్సి ఉంది. అలాగే, ఆమెకు ఇన్నాళ్లు ఎవరు ఆశ్రయం కల్పించారనే విషయం కూడా మేం కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది' అని ఈ కేసును విచారిస్తున్న కమినర్ ఏఎస్ చావ్లా తెలిపారు. -
గుర్మీత్‌ను తప్పించడానికి డేరా ప్లాన్..!!
-
గుర్మీత్‌ను తప్పించడానికి డేరా ప్లాన్..!!
సాక్షి, పంచకుల: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంను తప్పించేందుకు డేరా అనుచరులు ప్లాన్ వేశారు. అవును. శుక్రవారం పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్‌ను అత్యాచారాల కేసులో దోషిగా తేల్చిన అనంతరం ఆయన్ను తప్పించడానికి డేరా అనుచరులు ప్రయత్నించినట్లు హరియాణా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే, అధికారులు ఆ ప్లాన్‌ను సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. అసలు ప్లానేంటి.. దోషిగా తేలిన తర్వాత కోర్టు బయటకు గుర్మీత్‌తో పాటు వచ్చే పోలీసులపై దాడి చేసి, బాబాను అక్కడి నుంచి తప్పించి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాలని భావించారు. వాస్తవంగా ఏం జరిగింది.. గుర్మీత్‌ను కోర్టు దోషిగా తేల్చింది. హరియాణా పోలీసులు బాబాను వెంటబెట్టుకుని బయటకు వచ్చారు. స్కార్పియో కారులో ఆయన్ను ఎక్కించారు. బాబాకు అటు వైపు, ఇటు వైపు భద్రతగా గార్డులు కూడా కారులో కూర్చున్నారు. కారు కోర్టు కాంప్లెక్స్‌ను దాటడానికి ఓ పోలీసు బారియర్ నుంచి వెళ్లాలి. అక్కడే కాపు కాశారు డేరా అనుచరులు. అనుకున్న ప్రకారం.. స్కార్పియో కారు బారియర్‌ను చేరుకునే లోపే తమ కారుతో అడ్డగించారు. బాబాను తమకు అప్పగించాలని పెద్దగా కేకలు వేశారు. దీంతో పోలీసు వాహనం నుంచి ఆరుగురు ఆఫీసర్లు కిందకు దిగారు. వారిని చూసిన డేరా అనుచరులు షాక్ తిన్నారు. సాధారణ గార్డులు దోషికి భద్రతా ఉంటారు. కానీ ఆరుగురు ఆరి తేరిన అధికారులు తుపాకులతో కిందకు దిగడం వారికి మింగుడు పడనివ్వలేదు. బాబాను తప్పించాలా? లేదా వెనక్కు వెళ్లిపోవాలా? అనే ఆప్షన్లు వారి ముందు మిగిలాయి. ఇందులో వారు మొదటి దాన్ని ఎంచుకుని కారును ఆఫీసర్ల మీదుగా పొనివ్వాలని డ్రైవర్‌కు చెప్పారు. ఇంతలో ఈ విషయాన్ని గుర్తించిన మరి కొంతమంది పోలీసులు బారియర్ ఉన్న ప్రాంతానికి చేరుకుని డేరా అనుచరులను అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్లో నిజాలు.. బాబాను తప్పించేందుకు వేసిన ప్లాన్‌ను గురించిన వివరాలన్నింటిని ఎఫ్ఐఆర్లో హరియాణా పోలీసులు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డేరా అనుచరుల కారు నుంచి ఆటోమేటిక్ మెషీన్ గన్, పిస్టల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
గుర్మీత్ కళ్లలో కన్నీటి సుడులు
సాక్షి, హరియాణా: డేరా సచ్చా సౌధా గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మాట వేదం.. ఆయన అడుగేస్తే ఓ సంచలనం.. ఎప్పుడు, ఎక్కడ ఆయన్ను చూసినా చుట్టూ భారీ భద్రతా వలయం.. ఒక్కసారి ఆయన చూపు తాకడం కోసం లక్షలాది మంది అభిమాన గణం ఎదురుచూపులు.. ఓ వీవీఐపీను పోలి ఉంటుంది ఆయన జీవితం. ఉత్తర భారతంలో ఎంతో మంది అభిమానులను, మద్దతుదారులను కూడగట్టుకున్న ఆయన పేరు.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పుతో దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇద్దరు మహిళా స్వాధీలపై అత్యాచారం కేసులో ఆయన్ను శుక్రవారం సీబీఐ న్యాయస్థానం దోషిగా తేల్చింది. అత్యాచారం కేసులో ఆయనకు ఈ నెల 28న శిక్ష ఖరారు చేయనుంది. న్యాయస్థానం తీర్పుతో డేరా చీఫ్ షాక్‌కు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం జైలుకు బయల్దేరి వెళ్లే ముందు ఆయన కళ్లలో కన్నీటి సుడులు తిరగాయి. సాధారణ బాబాలు, సాధువులతో పోల్చితే గుర్మీత్ అనుభవించిన జీవితం విభిన్నం. బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. రాక్‌స్టార్‌గా మ్యూజిక్ వీడియోలు చేసినా.. అదో క్రేజ్..!. గుర్మీత్ జీవితంలోని పలు ఆసక్తికర విశేషాలను ఓ సారి చూద్దాం. ♦ గుర్మీత్ అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని పట్ణణాలు, గ్రామాల్లో ఆయనకు భారీ సంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు. ఆయన కోసం ప్రాణమిచ్చేందుకు సిద్ధమని కూడా కొందరు అభిమానులు అంటూ ఉంటారు. ♦ రాజకీయంగానూ గుర్మీత్ బలాఢ్యులే. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హరియాణాలో ఆయన భాజపాకు మద్దతు ప్రకటించారు. డేరా సచ్చా సౌధా నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రముఖ నేతలతో పాటూ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ కూడా పాల్గొన్నారు. ఇక పంజాబ్‌లో అప్పట్లో భాజపా-అకాళీదళ్ ప్రభుత్వానికి ఆయన మద్దతు ప్రకటించారు. ♦ 2008లో గుర్మీత్ లక్ష్యంగా దాడి జరిగింది. అప్పటి నుంచి ఆయన జడ్ ప్లస్ కేటగిరీ కింద సెక్యూరిటీ పొందుతున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కార్లలో చక్కర్లు కొడుతున్నారు. ♦ తొలి రోజు జైల్లో గుర్మీత్ యోగాతో తన రోజును ప్రారంభించారు. దీన్ని బట్టి ఆయనకు రోజూ యోగా చేసే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. యోగా అనంతరం టీ, రెండు ముక్కల బ్రెడ్‌ను గుర్మీత్ ఆహారంగా తీసుకుంటారని తెలిసింది. ♦ గుర్మీత్‌కు నటనంటే విపరీతమైన ఆసక్తి. తన పలుకుబడిని ఉపయోగించి రెండు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’(ఎంఎస్‌జీ), ‘మెసెంజర్ ఆఫ్ గాడ్2’ సినిమాల్లో వెండి తెరపై మెరిశారు. ఈ సినిమాలకు సహ రచయితగా కూడా వ్యవహరించారు. లెదర్ దుస్తులు, వజ్రాలు అంటే గుర్మీత్‌కు ప్రేమ. ప్రేమ అనే పదం సరిపోదనుకుంటే పిచ్చి అని కూడా చెప్పుకోవచ్చు. లెదర్, డైమండ్లతో తయారుచేయించిన దుస్తుల్లో కనిపిస్తూ సినిమాల్లో సందేశాలు ఇచ్చారు. ♦ 'లవ్ చార్జర్' అనే మ్యూజిక్ వీడియోతో గుర్మీత్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. పలు అంతర్జాతీయ వేదికలపై ఈ వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియో మెగా హిట్ అయిందని.. దాదాపు 20 లక్షల కాపీలు అమ్ముడుపోయాయని డేరా సచ్చా సౌధా అప్పట్లో చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ♦ సంక్షేమ, ఆధ్యాత్మిక సంస్థగా పేర్కొనే డేరా సచ్చా సౌధా 1948లో స్థాపితమైంది. 1990లో దీని బాధ్యతలను గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా డేరాకు ఐదు కోట్ల మంది మద్దతుదారులు ఉన్నట్లు సంస్థ పేర్కొంటోంది. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ, సబ్సిడీపై ఆహార వస్తువులు, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ఈ సంస్థ ముఖ్యంగా దళితులు, నిమ్న కులాలకు చెందినవారిని ఎక్కువగా ఆకర్షిస్తోంది. ♦ తుది తీర్పు సందర్భంగా పంచకులలోని సీబీఐ కోర్టుకు వెళ్లే ముందు కూడా గుర్మీత్ తన దర్పాన్ని ప్రదర్శించుకున్నారు. దాదాపు 200 కార్ల కాన్వాయ్‌తో కోర్టుకు చేరుకున్నారు. 2002లో ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో గుర్మీత్‌ను పంచకుల సీబీఐ న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. ఈ నెల 28న ఆయనకు జైలు శిక్ష ఖరారు చేయనుంది. ♦ గుర్మీత్ అరెస్టు తర్వాత పంజాబ్, హరియాణాల్లో డేరాకు గల 32 ఆశ్రమాలను అధికారులు సీజ్ చేశారు. హరియాణాలోని సిర్సాలో గల డేరా హెడ్ క్వార్టర్స్ నుంచి గుర్మీత్ అనుచరులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. -
భారత్ వెళ్తున్నారా.. ప్రాణాలకు ముప్పే!
మెల్బోర్న్ : భారత్ వెళ్లే తమ దేశ ప్రజలను చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్ సింగ్ అలియాస్ బాబా గుర్మీత్ సింగ్ రాం రహీంను అత్యాచారం కేసులో దోషిగా తేల్చుతూ పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన నేపథ్యంలో భారత్‌లో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందని ఆస్ట్రేలియా అధికారులు తమ పౌరులకు వివరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ట్రేడ్ మంత్రిత్వశాఖ (డీఎఫ్ఏటీ) ఈ హెచ్చరికలు జారీ చేసింది. గుర్మిత్ కేసు తీర్పు అనంతరం హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విధ్వంసకాండ మొదలై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్లు పేర్కొంది. ఈ ఘర్షణలో దాదాపు 30 మంది వ్యక్తులు మృత్యువాత పడ్డారని, కావున అత్యవసర పని ఉంటే తప్పా భారత్‌కు ఇప్పట్లో వెళ్లకూడదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 2002లో గుర్మీత్ తన ఆశ్రమంలో సాధ్విలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలున్నాయన్న పంచకుల కోర్టు.. అతను ముమ్మాటికీ శిక్షార్హుడేనని పేర్కొంది. గుర్మీత్‌కు విధించే శిక్షలను సోమవారం (ఆగస్ట్ 28న) ఖరారు చేయనుండటంతో శుక్రవారం భారత్‌లో విధ్వంసకాండ మొదలైందని, ఒకవేళ భారత్ వెళ్తున్నారంటే పూర్తి అప్రమత్తంగా ఉండాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని డీఎఫ్ఏటీ ఆస్ట్రేలియా పౌరులకు సూచించింది.