
భారత్ వెళ్తున్నారా.. ప్రాణాలకు ముప్పే!
మెల్‌బోర్న్ : భారత్ వెళ్లే తమ దేశ ప్రజలను చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్ సింగ్ అలియాస్ బాబా గుర్మీత్ సింగ్ రాం రహీంను అత్యాచారం కేసులో దోషిగా తేల్చుతూ పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన నేపథ్యంలో భారత్‌లో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందని ఆస్ట్రేలియా అధికారులు తమ పౌరులకు వివరించారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ట్రేడ్ మంత్రిత్వశాఖ (డీఎఫ్‌ఏటీ) ఈ హెచ్చరికలు జారీ చేసింది. గుర్మిత్ కేసు తీర్పు అనంతరం హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విధ్వంసకాండ మొదలై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్లు పేర్కొంది. ఈ ఘర్షణలో దాదాపు 30 మంది వ్యక్తులు మృత్యువాత పడ్డారని, కావున అత్యవసర పని ఉంటే తప్పా భారత్‌కు ఇప్పట్లో వెళ్లకూడదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
2002లో గుర్మీత్ తన ఆశ్రమంలో సాధ్విలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలున్నాయన్న పంచకుల కోర్టు.. అతను ముమ్మాటికీ శిక్షార్హుడేనని పేర్కొంది. గుర్మీత్‌కు విధించే శిక్షలను సోమవారం (ఆగస్ట్ 28న) ఖరారు చేయనుండటంతో శుక్రవారం భారత్‌లో విధ్వంసకాండ మొదలైందని, ఒకవేళ భారత్ వెళ్తున్నారంటే పూర్తి అప్రమత్తంగా ఉండాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని డీఎఫ్ఏటీ ఆస్ట్రేలియా పౌరులకు సూచించింది.