సాక్షి, పంచకుల: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంను తప్పించేందుకు డేరా అనుచరులు ప్లాన్ వేశారు. అవును. శుక్రవారం పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్‌ను అత్యాచారాల కేసులో దోషిగా తేల్చిన అనంతరం ఆయన్ను తప్పించడానికి డేరా అనుచరులు ప్రయత్నించినట్లు హరియాణా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే, అధికారులు ఆ ప్లాన్‌ను సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు ఎఫ్‌ఐఆర్ కాపీలో ఉంది.
అసలు ప్లానేంటి..
దోషిగా తేలిన తర్వాత కోర్టు బయటకు గుర్మీత్‌తో పాటు వచ్చే పోలీసులపై దాడి చేసి, బాబాను అక్కడి నుంచి తప్పించి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాలని భావించారు.
వాస్తవంగా ఏం జరిగింది..
గుర్మీత్‌ను కోర్టు దోషిగా తేల్చింది. హరియాణా పోలీసులు బాబాను వెంటబెట్టుకుని బయటకు వచ్చారు. స్కార్పియో కారులో ఆయన్ను ఎక్కించారు. బాబాకు అటు వైపు, ఇటు వైపు భద్రతగా గార్డులు కూడా కారులో కూర్చున్నారు. కారు కోర్టు కాంప్లెక్స్‌ను దాటడానికి ఓ పోలీసు బారియర్ నుంచి వెళ్లాలి. అక్కడే కాపు కాశారు డేరా అనుచరులు. అనుకున్న ప్రకారం.. స్కార్పియో కారు బారియర్‌ను చేరుకునే లోపే తమ కారుతో అడ్డగించారు.
బాబాను తమకు అప్పగించాలని పెద్దగా కేకలు వేశారు. దీంతో పోలీసు వాహనం నుంచి ఆరుగురు ఆఫీసర్లు కిందకు దిగారు. వారిని చూసిన డేరా అనుచరులు షాక్ తిన్నారు. సాధారణ గార్డులు దోషికి భద్రతా ఉంటారు. కానీ ఆరుగురు ఆరి తేరిన అధికారులు తుపాకులతో కిందకు దిగడం వారికి మింగుడు పడనివ్వలేదు.
బాబాను తప్పించాలా? లేదా వెనక్కు వెళ్లిపోవాలా? అనే ఆప్షన్లు వారి ముందు మిగిలాయి. ఇందులో వారు మొదటి దాన్ని ఎంచుకుని కారును ఆఫీసర్ల మీదుగా పొనివ్వాలని డ్రైవర్‌కు చెప్పారు. ఇంతలో ఈ విషయాన్ని గుర్తించిన మరి కొంతమంది పోలీసులు బారియర్ ఉన్న ప్రాంతానికి చేరుకుని డేరా అనుచరులను అరెస్టు చేశారు.
ఎఫ్‌ఐఆర్‌లో నిజాలు..
బాబాను తప్పించేందుకు వేసిన ప్లాన్‌ను గురించిన వివరాలన్నింటిని ఎఫ్‌ఐఆర్‌లో హరియాణా పోలీసులు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డేరా అనుచరుల కారు నుంచి ఆటోమేటిక్ మెషీన్ గన్, పిస్టల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
గుర్మీత్‌ను తప్పించడానికి డేరా ప్లాన్..!!
Published Wed, Aug 30 2017 10:03 AM | Last Updated on Tue, Sep 12 2017 1:23 AM
Advertisement