
రూ.350 కోట్ల నుంచి రూ.30 కోట్లకు!
ఢిల్లీ: భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిషేధం ఎదుర్కొంటున్న మ్యాగీ ఇన్ స్టెంట్ న్యూడుల్స్ అమ్మకాలు దేశంలో భారీ స్థాయిలో పడిపోయాయి. భారత్ లో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం విధించడంతో దాదాపు 90 శాతం అమ్మకాలను తాము కోల్పోయినట్లు పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి. గత నెల నుంచి పోలిస్తే మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు రూ.320 కోట్లకు తగ్గినట్లు పేర్కొన్నాయి. మ్యాగీ ఉత్పత్తులపై నిషేధానికి ముందు రూ.350 కోట్ల అమ్మకాలుంటే.. ఆ అమ్మకాల విలువ నెల వ్యవధిలోనే రూ.30 కోట్లకు పడిపోయింది.
మ్యాగీపై నిషేధానికి ముందు దాని అమ్మకాల ద్వారా వచ్చే వార్షికాదాయం రూ.4,200 కోట్లు ఉండగా నెలసరి అమ్మకాలు విలువ రూ. 350 కోట్లు. వినియోగ దారుల్లో నెలకొన్న భయంతోనే మ్యాగీ నూడుల్స్ అమ్మకాల విలువ గణనీయంగా తగ్గిపోయినట్లు ఆ సంస్థకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో పాటు భారత్ లో ఆహార ఉత్పత్తి చేసే పరిశ్రమలపై భద్రతాధికారుల వేధింపులు ఎక్కువగా ఉన్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.