
కూతురితో కలిసి పుస్తకాలతో కుస్తీ..
అగర్తలా: చదువుకోవడానికి వయసు అడ్డంకి కాదని, చదవాలన్న తాపత్రయం ఉంటే ఎప్పటికైనా చదువును కొనసాగించొచ్చునని ఓ తల్లి నిరూపిస్తోంది. 36 ఏళ్ల స్మృతి బానిక్ అనే మహిళ తన కూతురితో పాటు పరీక్షలకు సిద్ధమవుతోంది. త్రిపురలోని సెపాహిజాలా జిల్లా పుర్బా లక్ష్మిబిల్ గ్రామానికి చెందిన ఈ తల్లీకూతుళ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మార్చి 3న ప్రారంభమైన త్రిపుర టెన్త్ బోర్డు పరీక్షలకు వెళుతున్న ఈ తల్లీకూతుళ్ల విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చదువుకోవాలన్న తాపత్రయంతో ఇన్నేళ్ల తర్వాత కూతురితో కలిసి పుస్తకాలతో కుస్తీ పడుతోంది ఆ మాతృమూర్తి.
స్మృతి బానిక్ పడుతున్న శ్రమను గుర్తించాలని, కష్టపడితే ఎవరైనా ఏదైనా చేయవచ్చు అంటూ టిల్లా ఉన్నత విద్యా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంజలీ సర్కార్ మెచ్చుకున్నారు. ప్రతిరోజూ రెండు గంటల సమయాన్ని పరీక్ష కోసం కచ్చితంగా కేటాయిస్తూ పరీక్షలకు సన్నద్ధమయ్యేదాన్ని అని బానిక్ చెప్పారు. ఇది తన ఇరవై ఏళ్ల కల అని, అందుకే అప్పటి నుంచి ఈ సమయం కోసం ఎదురుచేసేదాన్నని ఇప్పుడు తన కల నెరవేర బోతుందని చెప్పుకొచ్చింది. 1996లో జిబాన్ బానిక్ తో వివాహం తర్వాత తనపై ఉన్న ఒత్తిళ్ల మేరకు చదువుకు ఫుల్ స్టాప్ చెప్పాల్సి వచ్చిందని చెప్పింది. దీంతో స్మృతి టెన్త్ క్లాస్ ను మధ్యలోనే చదువు ఆపేసింది. తొలి ఎగ్జామ్ బెంగాల్ సబ్జెక్ట్ బాగా రాశానని, గత రెండు నెలల నుంచి చదువుతూనే ఉన్నట్లు వివరించింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు కాగా, మొదటి కూతురుతో కలిసి పరీక్షలకు హాజరవుతుండగా, రెండో అమ్మాయి ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతుంది అని తన నేపథ్యాన్ని చెప్పుకొచ్చింది.