త్రిపురను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలో వరదల కారణంగా రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మీడియాకు తెలిపారు. వరదల కారణంగా 24 మంది మృతిచెందినట్లు తెలిపారు. 1.28 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారని పేర్కొన్నారు.
అఖిలపక్ష సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ వరదల కారణంగా ఏర్పడిన నష్టం రూ.15 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. క్లిష్ట సమయాల్లో కలిసికట్టుగా పని చేస్తామని అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ నిబద్ధతను వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో పంపిణీ చేసేందుకు సరిపడా ఆహార ధాన్యాలు, ఇంధనం నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం మార్కెట్లపై నిఘా సారిస్తుందని అన్నారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం త్రిపురలో వరద పరిస్థితులు నెమ్మదించాయి. పలు నదులు ప్రమాద స్థాయికి దిగువన ప్రవహిస్తున్నాయి. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారి కోసం వైమానిక దళం హెలికాప్టర్ల నుండి నాలుగు వేలకు పైగా ఆహార ప్యాకెట్లను జారవిడిచింది. ఇదిలావుండగా బంగ్లాదేశ్‌లో వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరుకుంది. ఆ దేశంలోని 11 జిల్లాల్లో వరదలకు దాదాపు 49 లక్షల మంది ప్రభావితులయ్యారు. బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ తమ దేశానికి సహాయం చేయాలని స్వచ్ఛంద సంస్థలను కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment