కన్నీరే మిగులు
కన్నీరే మిగులు
Published Tue, Sep 27 2016 5:23 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
* భారీ వర్షాలకు మునిగిన ఉద్యాన పంటలు
* రైతులకు తడిసి మోపెడవుతున్న పెట్టుబడి
సత్తెనపల్లి: జిల్లాలో ఖరీఫ్ రైతులు మొన్నటివరకు సాగునీటి సమస్యతో ఇబ్బందులు పడ్డారు. ఇంజన్లు, మోటార్లతో తడి పెట్టి పంటలను కాపాడుకున్నారు. అదనంగా కొంత పెట్టుబడి పెట్టారు. కరువులో అధికమాసం అన్నట్టు తెగుళ్లు సోకి రైతులకు నష్టాలు గురి చేశాయి. వాటిని కూడా తట్టుకుని పంటను నిలబెట్టుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల దెబ్బకు మాత్రం రైతులు అతలాకుతలం అయ్యారు. మండలంలో ఉద్యాన పంటలైన బొప్పాయి, కూరగాయలు, పూల రైతులకు సైతం నష్టాలు తప్పలేదు. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. బొప్పాయి తోటలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 7087 హెక్టార్లలో మిర్చి పంటకు, 196 హెక్టార్లలో కూరగాయల పంటలకు, 15 హెక్టార్లలో పూలతోటలకు, 30 హెక్టార్లలో బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యాన వన శాఖ అధికారులు ప్రకటించారు. క్షేత్ర స్థాయిలో ఇంకా ఎక్కువగానే పంటలు దెబ్బతిన్నాయి. మునుపెన్నడూ లేని స్థితిలో 18 సెం.మీ మేర వర్షం కురవడం, వాగులు, వంకలు పొంగడంతో పాటు చెరువులకు గండ్లు పడి వరద ఉధృతి రావడంతో పంటలన్నీ నీట మునిగాయి. కూరగాయల పంటలపైనే ఆధారపడిన రైతులకు నష్టాలు తప్పలేదు. ఏళ్లుగా పంటల్లో నష్టాన్ని చవిచూడని కొందరు రైతులు ఈ ఏడాది నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. తమకు ఇదే జీవనాధారమని, భారీగా పెట్టుబడులు పెట్టామని, మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి రాలేదని వాపోతున్నారు. ఏటా కొద్దోగొప్పో లాభం వచ్చేదని, ఈసారి తమను వర్షం దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం గ్రామంలో బూతుకూరి బ్రహ్మారెడ్డి ఎనిమిది ఎకరాల్లో, కళ్ళం రంగారెడ్డి 15 ఎకరాల్లో ఇలా మరికొందరు రైతులు మరో 50 ఎకరాల్లో బొప్పాయి పంటలను సాగు చేశారు. ఒక కందులవారిపాలెం గ్రామంలోనే 50 ఎకరాల్లో బొప్పాయి పంట పూర్తిగా దెబ్బ తింది. పంటపై ఇసుక మేట వేసింది. మిర్చి రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు. నియోజకవర్గంలో 1,755 ఎకరాలకు పైగా మిరప నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు పంటలను చూసి లబోదిబో మంటున్నారు.
Advertisement