‘పంటనష్టోయిన రైతులకు పరిహారం చెల్లించాలి’
విజయవాడ : వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు నుంచి రూ.20 పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన సోమవారం పర్యటించారు. అనంతరం వైఎస్ జగన్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారని, అయితే అంతకంటే ఎక్కువే నష్టం జరిగి ఉండచ్చొన్నారు. గతేడాది ఇన్పుట్ సబ్సిడీ ఇంకా ఇవ్వలేదని, రైతులకు రుణమాఫీ కాలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మాఫీ కాని రుణాలకు రూ.2 వరకూ వడ్డీ చెల్లిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే బంగారంపై రైతులకు లోన్లు ఇవ్వొద్దని చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. పులిచింతల ప్రాజెక్ట్ పూర్తయినా ప్రభుత్వం పూర్తిస్థాయిలో నీళ్లు నింపలేని పరిస్థితిలో ఉందన్నారు. 45 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నా కేవలం 30 టీఎంసీలే నిల్వ ఉంచుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి పునరావాసం కింద రూ.150 కోట్లు ఇస్తే పూర్తిస్థాయిలో నీరు నిల్వ చేసుకోవచ్చన్నారు. ఇటు కృష్ణా నుంచి 19 టీఎంసీలు, అటు గోదావరి నుంచి రోజుకు 26 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని వైఎస్ జగన్ అన్నారు.