రైతుల కన్నీరు తుడవండి
రైతుల కన్నీరు తుడవండి
Published Sat, Sep 24 2016 8:56 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
సీఎంను కోరిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిరెడ్డి
పట్నం బజారు: వర్షాలకు రైతులు చిగురుటాకులా వణికుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అరండల్‌పేటలోని నగర వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించాలని కోరారు. రుణాల రీషెడ్యూల్ చేయాలని, భూమి శిస్తును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంద శాతం సబ్సిడీతో విత్తనాలను అందించాలని కోరారు. రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు భరోసా కల్పించేలా ప్రకటన చేయాలన్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ఇబ్బందులు వచ్చాయని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి) మాట్లాడుతూ ఎకరాకు 30 వేలపైబడి నష్ట పరిహారమివ్వాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి లక్కాకుల థామస్ నాయుడు మాట్లాడుతూ తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు వలివేటి వెంకటరమణ, మేరువ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement