రాబర్ట్ వాద్రా బినామీ బాగోతం బట్టబయలు!
-
ఆయుధాల డీలర్ బినామీగా లండన్‌లో ఇల్లు కొనుగోలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఓ ఆయుధాల డీలర్‌తో సంబంధాలు ఉన్నట్టు తాజా దర్యాప్తులో వెల్లడైంది. సదరు డీలర్‌ను బినామీగా పెట్టుకొని లండన్‌లో ఆయన పెద్ద భవనాన్ని (మాన్షన్) సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తు ఫైల్‌ను ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సమీక్షిస్తోంది.
గత నెలలో ఆయుధాల డీలర్ సంజయ్ భండారికి చెందిన 17 నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్ మెంట్ సంస్థలు దాడులు నిర్వహించాయి. సంజయ్‌కి, వాద్రాకు ఉన్న సంబంధాలపై ఈ దాడుల్లో కీలక వివరాలు వెల్లడయ్యాయి. వాద్రా, అతని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మనోజ్ అరోరా.. భండారికి పంపిన ఈమెయిల్స్, విచారణలో భండారి తెలిపిన వివరాలు దర్యాప్తు నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. లండన్ బ్రియాన్‌స్టన్‌లోని ఎల్లెర్టన్ హౌస్ రూ. 19 కోట్లకు కొనుగోలు చేయగా.. దాని చెల్లింపులు, అదనపు హంగులు చేకూర్చే విషయమై ఈ ఈమెయిల్స్‌లో వాద్రా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, వాద్రా లాయర్లు మాత్రం ఈ అంశాలను తిరస్కరిస్తున్నారు.