Robert Vadra London house
-
రాబర్ట్ వాద్రా స్కామ్ ఏమిటీ ?
సాక్షి, న్యూఢిల్లీ : లండన్‌లో అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను బుధ, గురు వారాలతోపాటు శనివారం నాడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 15 గంటలపాటు విచారించింది. ఇంతకు ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏమిటీ? ఆ ఆరోపణలు ఎలాంటివి, ఇప్పుడు వచ్చాయి ? వాటికి సంబంధించి ఈడీ అధికారుల వద్ద ఉన్న ఆధారాలు ఏమిటీ? ఆయనపై 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ఆరోపణలు చేసినప్పటికీ ఆయన్ని విచారించేందుకు ఎందుకు ఇంతకాలం పట్టింది ? ఆయనపై ఎప్పటి నుంచో ఈ ఆరోపణలు ఉన్నా ఆయన్ని ఇప్పుడే ఎందుకు విచారణ జరపాల్సిన అవసరం ఏర్పడింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2005లో ఓ రక్షణ ఒప్పందం, 2009లో ఓ పెట్రోలియం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలు, ముఖ్యంగా రక్షణ ఒప్పందం ద్వారా లబ్ది పొందిన ప్రముఖ ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి 2009లో లండన్‌లోని 12 బ్య్రాన్‌స్టన్ స్క్వేర్‌లో ఓ భవనాన్ని తన కంపెనీ ‘వోర్టెక్స్’ ద్వారా 19 లక్షల పౌండ్లకు కొనుగోలు చేశారు. దాన్ని ఆ మరసటి సంవత్సరమే దుబాయ్ వ్యాపారి సీసీ థంపీకి విక్రయించారు. ఆ భవనం పునరుద్ధరణకు సీసీ థంపీ 65 వేల పౌండ్లు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఆ భవనాన్ని బ్రిటన్‌లో సంజయ్ భండారీకి సంబంధం ఉన్న ఓ సింటాక్ కంపెనీకి కొన్న రేటుకే అంటే 19 లక్షల పౌండ్లకే విక్రయించారు. అంటే భండారీ కొనుగోలు చేసిన భవనం తిరిగి భండారీ చేతికే వచ్చిందన్న మాట. భండారి, సీసీ థంపీ, వాద్రాలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నది ఈడీ అధికారుల వాదన. ఒప్పందాల్లో లబ్ది పొందినందుకుగాను భండారీ ఆ భవనాన్ని రాబర్ట్ వాద్రా కోసం ముడుపుల కింద కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. మరి ఈ ఆరోపణకు రుజువు ఏమిటీ? 2016లో ఢిల్లీలోని సంజయ్ భండారీ ఇంటిపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడి చేసినప్పుడు ఓ కంప్యూటర్లో భండారి బంధువుకు, వాద్రా కార్యదర్శికి మధ్య నడిచిన ఈమెయిళ్లు దొరికాయి. లండన్‌లో ఉంటున్న భండారీ మేనల్లుడు సుమిత్ ఛద్దా, లండన్ 12 బ్య్రాన్‌స్టన్ స్కేర్ భవనం పునరుద్ధరణ బిల్లుల చెల్లింపుల గురించి వాద్రా కార్యదర్శికి ఆ మెయిల్స్ పంపించారు. అందులో ఓ మెయిల్‌కు వాద్రా స్వయంగా స్పందిస్తూ ‘రేపు ఉదయం ఈ విషయాన్ని పరిశీలిస్తాం. కార్యదర్శి మనోజ్ పరిష్కరిస్తారు’ అని చెప్పారు. భవనం పునరుద్ధర ణకు అయిన 65 వేల పౌండ్లను వాద్రా చెల్లించారనే, అందుకనే భండారి వద్ద కొన్న రేటుకు సీసీ థంపీ తిరిగి విక్రయించారని, తన ఆస్తి కావడం వల్ల వాద్రా పునరుద్ధరణ ఛార్జీలు చెల్లించారన్నది ఈడీ అధికారుల అనుమానం. సంజయ్ భండారీ 2008లో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆఫ్సెట్ ఇండియా సొల్యుషన్స్ కంపెనీ కొన్నేళ్లలో కొన్ని కోట్ల రూపాయలకు ఎలా ఎదిగిందో దర్యాప్తు జరపాల్సిందిగా 2014లో అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐబీ అధికారులను ఆదేశించింది. 2012లో భారత ప్రభుత్వంతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు శిక్షణ విమానాల ఒప్పందాన్ని చేసుకున్న స్విస్ సంస్థ ‘పిలాటస్’తో భండారీకి సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ యాజమాన్యంతో రాబర్ట్ వాద్రా కూడా సంబంధాలు ఉన్నాయంటూ ఐబీ అధికారులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించారు. లండన్‌లోని ఆస్తులు, ముడుపులకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు సంజయ్ భండారి, తన ఇంటిపై 2016లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో నేపాల్ మీదుగా లండన్ పారిపోయారు. దాంతో లండన్ ఆస్తుల కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. వాద్రా కార్యదర్శి, భండారి బంధువు మధ్య కొనసాగిన ఈ మెయిళ్లు మినహా మరో సాక్ష్యాన్ని ఈడీ అధికారులు సాధించలేకపోయారు. లండన్‌లో తనకు ఎలాంటి ఆస్తులు లేవని చెబుతున్న రాబర్ట్ వాద్రాను విచారిస్తున్న అధికారులు, భండారీతో ఆయనకున్న సంబంధాల గురించే గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారని తెల్సిందే. ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాగానే ఆమె భర్త వాద్రాను విచారించడానికి కారణం ఆమె నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీయడానికి లేదా ఆమె పరువు తీయడానికి ప్రయత్నం కావచ్చు. రఫేల్ యుద్ధ విమానాల డీల్‌లో నరేంద్ర మోదీని ప్రత్యక్షంగా విమర్శిస్తున్న రాహుల్ గాంధీ నోటికి తాళం వేసే ప్రయత్నమూ కావచ్చు. ఏదీ ఏమైనా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడమే అసలు విషయం. -
ఈడీ విచారణకు వాద్రా
న్యూఢిల్లీ: యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అల్లుడు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా విదేశాల్లో అక్రమాస్తుల కేసుకు సంబంధించి బుధవారం ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలపై వాద్రా ఓ దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరుకావడం ఇదే తొలిసారి. వాద్రాకు తోడుగా ప్రియాంక కూడా ఈడీ కార్యాలయం వరకు రావడం విశేషం. బుధవారం మధ్యాహ్నం 3.45 గంటలకు తన న్యాయవాదులతో కలిసి వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు ఐదున్నర గంటలపాటు వాద్రాను విచారించిన అధికారులు, 40కి పైగా ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. రేపు ఉదయం 10.30కి మళ్లీ విచారణకు రావాల్సిందిగా అధికారులు వాద్రాను ఆదేశించారు. అంతకుముందు వాద్రా మాట్లాడుతూ తనకు విదేశాల్లో ఎలాంటి అక్రమాస్తులూ లేవనీ, రాజకీయ కుట్రతోనే ఇదంతా జరుగుతోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను వెంటాడి వేధిస్తున్నారన్నారు. అక్రమాస్తుల కేసులకు సంబంధించి తనకు ముందస్తు బెయిలు కావాలంటూ వాద్రా గతంలో ఢిల్లీలోని ఓ కోర్టును ఆశ్రయించగా, ఈడీ విచారణకు సహకరించాల్సిందిగా కోర్టు ఆయనకు సూచించింది. ఆర్థిక లావాదేవీలు, లండన్‌లో వాద్రా కొనుగోలు చేసిన, ఆయన అధీనంలో ఉన్న కొన్ని స్థిరాస్తులు తదితరాలపై వాద్రాను నగదు హవాలా నియంత్రణ చట్టం కింద విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని అంతకుముందు అధికార వర్గాలు తెలిపాయి. లండన్‌లోని 12, బ్య్రాన్‌స్టన్ స్క్వేర్‌లో 1.9 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టి వాద్రా ఓ ఆస్తిని కొన్నాడనీ, ఇందుకు ఆర్థికంగా ఆయన అక్రమ మార్గాలను వాడినట్లు ప్రధాన ఆరోపణ. లండన్‌లో మరికొన్ని ఆస్తులను వాద్రా అక్రమంగా కలిగి ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని కోర్టుకు ఈడీ తెలిపింది. నా కుటుంబం వెంటే ఉంటా: ప్రియాంక భర్త వాద్రాకు తోడుగా ఈడీ కార్యాలయం వరకు ప్రియాంక వచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా మీరు బాధ్యతలు తీసుకుంటున్న తరుణంలో ఏదైనా రాజకీయ సందేశం పంపడానికే మీరు ఇక్కడకు వచ్చారా?’ అని మీడియా ప్రియాంకను ప్రశ్నించగా ‘ఆయన నా భర్త. ఆయనే నా కుటుంబం. నేను నా కుటుంబానికి మద్దతుగా ఉంటాను’ అని ఆమె చెప్పారు. రాజకీయ కక్షసాధింపుతోనే ఇది జరుగుతోందా అన్న ప్రశ్నకు ‘ఇదంతా ఎందుకు జరుగుతోందో అందరికీ తెలుసు’ అని ఆమె బదులిచ్చారు. బెంగాల్ సీఎం మమత కాంగ్రెస్ పక్షాన నిలుస్తూ, ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం కావాలనే ఆరోపించారు. వాద్రాను కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని స్థానిక కాంగ్రెస్ నేత, ఈ కేసులో ఇంతకుముందే ఈడీ విచారణను ఎదుర్కొన్న జగదీశ్ శర్మ అన్నారు. మరో హవాలా కేసుకు సంబంధించి ఈ నెల 12న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా రాజస్తాన్ హైకోర్టు గతంలో వాద్రాను ఆదేశించింది. కాగా, వాద్రాకు సన్నిహితుడు, ఆయనకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ఎల్ఎల్పీలో ఉద్యోగి మనోజ్ అరోరాను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఢిల్లీ కోర్టు ఈ నెల 16 వరకు పొడిగించింది. పెట్రోలియం, రక్షణ ఒప్పందాల్లో వాద్రాకు ముడుపులు: బీజేపీ వాద్రా ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో బీజేపీ ఆయనపై బుధవారం పలు ఆరోపణలు చేసింది. యూపీఏ అధికారంలో ఉన్న కాలంలో పెట్రోలియం, రక్షణకు సంబంధించిన ఒప్పందాల్లో వాద్రాకు ముడుపులు అందాయని ఆ పార్టీ ఆరోపించింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ ‘2008–09 కాలంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు అందిన ముడుపులతో వాద్రా లండన్‌లో 8 నుంచి 9 స్థిరాస్తులు కొన్నారు’ అని పేర్కొన్నారు. ‘రోడ్ల వెంట తిరిగే వ్యక్తి కోటీశ్వరుడు అవ్వడానికి సూత్రం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అవినీతికి పాల్పడటమే. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలో ప్రతి ఒక్కరూ బెయిల్‌పై బయటే ఉన్నారని అందరికీ తెల్సు. అవినీతి ముఠాకు, పారదర్శక మోదీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటమే 2019 లోక్‌సభ ఎన్నికలు’ అని అన్నారు. విధుల్లో ప్రియాంక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను ఆమె పర్యవేక్షించనున్నారు. భర్త వాద్రాను ఈడీ ఆఫీస్ వద్ద దించిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె బాధ్యతలను చేపట్టారు. తర్వాత కార్యకర్తలతో మాట్లాడారు. ప్రియాంకను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆమె అన్న, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గత నెలలో నియమించడం తెల్సిందే. ప్రియాంక పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో గురువారమే తన తొలి కార్యక్రమంలో పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం వ్యూహ రచనకు రాహుల్ అధ్యక్షతన అందరు ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్–చార్జ్‌లతో ఈ సమావేశం జరగనుంది. -
ఈడీ ఎదుట హాజరైన వాద్రా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బావ, వాణిజ్యవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం భార్య ప్రియాంక గాంధీతో కలిసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. మనీల్యాండరింగ్ కేసులో ఈనెల ఆరున ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని గతవారం ముందస్తు బెయిల్‌కు వాద్రా దరఖాస్తు చేసుకున్న క్రమంలో ఢిల్లీ కోర్టు ఆయనను ఆదేశించింది. లండన్‌లో పలు స్ధిరాస్ధుల కొనుగోలు, స్వాధీనానికి సంబంధించి మనీల్యాండరింగ్ కేసులో వాద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, ఢిల్లీ కోర్టు వాద్రాకు ఈనెల 16 వరకూ మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా లండన్‌లో స్ధిరాస్తుల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు, ఆస్తుల వివరాలపై వాద్రాను ప్రశ్నించనున్న ఈడీ మనీల్యాండరింగ్ చట్టం కింద ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేయనుంది. మరోవైపు వాద్రాను ఈడీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలతో విరుచుకుపడింది. యూపీఏ హయంలో రాబర్ట్ వాద్రా భారీగా లబ్దిపొందారని, ఈ మొత్తంతో వాద్రా విదేశాల్లో కోట్లాది రూపాయలతో విలాసవంతమైన ఆస్తులను కొనుగోలు చేశారని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్ర ఆరోపించారు. -
రాబర్ట్ వాద్రా బినామీ బాగోతం బట్టబయలు!
ఆయుధాల డీలర్ బినామీగా లండన్‌లో ఇల్లు కొనుగోలు న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఓ ఆయుధాల డీలర్‌తో సంబంధాలు ఉన్నట్టు తాజా దర్యాప్తులో వెల్లడైంది. సదరు డీలర్‌ను బినామీగా పెట్టుకొని లండన్‌లో ఆయన పెద్ద భవనాన్ని (మాన్షన్) సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తు ఫైల్‌ను ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సమీక్షిస్తోంది. గత నెలలో ఆయుధాల డీలర్ సంజయ్ భండారికి చెందిన 17 నివాసాలు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్ మెంట్ సంస్థలు దాడులు నిర్వహించాయి. సంజయ్‌కి, వాద్రాకు ఉన్న సంబంధాలపై ఈ దాడుల్లో కీలక వివరాలు వెల్లడయ్యాయి. వాద్రా, అతని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మనోజ్ అరోరా.. భండారికి పంపిన ఈమెయిల్స్, విచారణలో భండారి తెలిపిన వివరాలు దర్యాప్తు నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. లండన్ బ్రియాన్స్టన్లోని ఎల్లెర్టన్ హౌస్ రూ. 19 కోట్లకు కొనుగోలు చేయగా.. దాని చెల్లింపులు, అదనపు హంగులు చేకూర్చే విషయమై ఈ ఈమెయిల్స్‌లో వాద్రా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, వాద్రా లాయర్లు మాత్రం ఈ అంశాలను తిరస్కరిస్తున్నారు.