ఈడీ విచారణకు వాద్రా | Robert Vadra appears before ED in money laundering case | Sakshi
Sakshi News home page

ఈడీ విచారణకు వాద్రా

Published Thu, Feb 7 2019 5:07 AM | Last Updated on Thu, Feb 7 2019 9:57 AM

Robert Vadra appears before ED in money laundering case - Sakshi

తన ఆఫీస్‌లో పార్టీ నేతలతో చర్చిస్తున్న ప్రియాంకా గాంధీ

న్యూఢిల్లీ: యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ అల్లుడు, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా విదేశాల్లో అక్రమాస్తుల కేసుకు సంబంధించి బుధవారం ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలపై వాద్రా ఓ దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరుకావడం ఇదే తొలిసారి. వాద్రాకు తోడుగా ప్రియాంక కూడా ఈడీ కార్యాలయం వరకు రావడం విశేషం. బుధవారం మధ్యాహ్నం 3.45 గంటలకు తన న్యాయవాదులతో కలిసి వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు.

దాదాపు ఐదున్నర గంటలపాటు వాద్రాను విచారించిన అధికారులు, 40కి పైగా ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. రేపు ఉదయం 10.30కి మళ్లీ విచారణకు రావాల్సిందిగా అధికారులు వాద్రాను ఆదేశించారు. అంతకుముందు వాద్రా మాట్లాడుతూ తనకు విదేశాల్లో ఎలాంటి అక్రమాస్తులూ లేవనీ, రాజకీయ కుట్రతోనే ఇదంతా జరుగుతోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను వెంటాడి వేధిస్తున్నారన్నారు. అక్రమాస్తుల కేసులకు సంబంధించి తనకు ముందస్తు బెయిలు కావాలంటూ వాద్రా గతంలో ఢిల్లీలోని ఓ కోర్టును ఆశ్రయించగా, ఈడీ విచారణకు సహకరించాల్సిందిగా కోర్టు ఆయనకు సూచించింది.

ఆర్థిక లావాదేవీలు, లండన్‌లో వాద్రా కొనుగోలు చేసిన, ఆయన అధీనంలో ఉన్న కొన్ని స్థిరాస్తులు తదితరాలపై వాద్రాను నగదు హవాలా నియంత్రణ చట్టం కింద విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని అంతకుముందు అధికార వర్గాలు తెలిపాయి. లండన్‌లోని 12, బ్య్రాన్‌స్టన్‌ స్క్వేర్‌లో 1.9 మిలియన్‌ పౌండ్లు ఖర్చు పెట్టి వాద్రా ఓ ఆస్తిని కొన్నాడనీ, ఇందుకు ఆర్థికంగా ఆయన అక్రమ మార్గాలను వాడినట్లు ప్రధాన ఆరోపణ. లండన్‌లో మరికొన్ని ఆస్తులను వాద్రా అక్రమంగా కలిగి ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని కోర్టుకు ఈడీ తెలిపింది.

నా కుటుంబం వెంటే ఉంటా: ప్రియాంక
భర్త వాద్రాకు తోడుగా ఈడీ కార్యాలయం వరకు ప్రియాంక వచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా మీరు బాధ్యతలు తీసుకుంటున్న తరుణంలో ఏదైనా రాజకీయ సందేశం పంపడానికే మీరు ఇక్కడకు వచ్చారా?’ అని మీడియా ప్రియాంకను ప్రశ్నించగా ‘ఆయన నా భర్త. ఆయనే నా కుటుంబం. నేను నా కుటుంబానికి మద్దతుగా ఉంటాను’ అని ఆమె చెప్పారు. రాజకీయ కక్షసాధింపుతోనే ఇది జరుగుతోందా అన్న ప్రశ్నకు ‘ఇదంతా ఎందుకు జరుగుతోందో అందరికీ తెలుసు’ అని ఆమె బదులిచ్చారు.

బెంగాల్‌ సీఎం మమత కాంగ్రెస్‌ పక్షాన నిలుస్తూ, ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం కావాలనే ఆరోపించారు. వాద్రాను కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని స్థానిక కాంగ్రెస్‌ నేత, ఈ కేసులో ఇంతకుముందే ఈడీ విచారణను ఎదుర్కొన్న జగదీశ్‌ శర్మ అన్నారు. మరో హవాలా కేసుకు సంబంధించి ఈ నెల 12న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా రాజస్తాన్‌ హైకోర్టు గతంలో వాద్రాను ఆదేశించింది. కాగా, వాద్రాకు సన్నిహితుడు, ఆయనకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ ఎల్‌ఎల్‌పీలో ఉద్యోగి మనోజ్‌ అరోరాను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఢిల్లీ కోర్టు ఈ నెల 16 వరకు పొడిగించింది.  

పెట్రోలియం, రక్షణ ఒప్పందాల్లో వాద్రాకు ముడుపులు: బీజేపీ
వాద్రా ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో బీజేపీ ఆయనపై బుధవారం పలు ఆరోపణలు చేసింది. యూపీఏ అధికారంలో ఉన్న కాలంలో పెట్రోలియం, రక్షణకు సంబంధించిన ఒప్పందాల్లో వాద్రాకు ముడుపులు అందాయని ఆ పార్టీ ఆరోపించింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర మాట్లాడుతూ ‘2008–09 కాలంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు అందిన ముడుపులతో వాద్రా లండన్‌లో 8 నుంచి 9 స్థిరాస్తులు కొన్నారు’ అని పేర్కొన్నారు. ‘రోడ్ల వెంట తిరిగే వ్యక్తి కోటీశ్వరుడు అవ్వడానికి సూత్రం ఏంటి? కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన లక్ష్యం అవినీతికి పాల్పడటమే. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలో ప్రతి ఒక్కరూ బెయిల్‌పై బయటే ఉన్నారని అందరికీ తెల్సు. అవినీతి ముఠాకు, పారదర్శక మోదీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటమే 2019 లోక్‌సభ ఎన్నికలు’ అని అన్నారు.  

విధుల్లో ప్రియాంక
కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాలను ఆమె పర్యవేక్షించనున్నారు. భర్త వాద్రాను ఈడీ ఆఫీస్‌ వద్ద దించిన తర్వాత  పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె బాధ్యతలను చేపట్టారు. తర్వాత కార్యకర్తలతో మాట్లాడారు. ప్రియాంకను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా ఆమె అన్న, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గత నెలలో నియమించడం తెల్సిందే. ప్రియాంక పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో గురువారమే తన తొలి కార్యక్రమంలో పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం వ్యూహ రచనకు రాహుల్‌ అధ్యక్షతన అందరు ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌–చార్జ్‌లతో ఈ సమావేశం జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement