సాక్షి, న్యూఢిల్లీ : లండన్‌లో అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను బుధ, గురు వారాలతోపాటు శనివారం నాడు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాదాపు 15 గంటలపాటు విచారించింది. ఇంతకు ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏమిటీ? ఆ ఆరోపణలు ఎలాంటివి, ఇప్పుడు వచ్చాయి ? వాటికి సంబంధించి ఈడీ అధికారుల వద్ద ఉన్న ఆధారాలు ఏమిటీ? ఆయనపై 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ఆరోపణలు చేసినప్పటికీ ఆయన్ని విచారించేందుకు ఎందుకు ఇంతకాలం పట్టింది ? ఆయనపై ఎప్పటి నుంచో ఈ ఆరోపణలు ఉన్నా ఆయన్ని ఇప్పుడే ఎందుకు విచారణ జరపాల్సిన అవసరం ఏర్పడింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది.
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2005లో ఓ రక్షణ ఒప్పందం, 2009లో ఓ పెట్రోలియం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలు, ముఖ్యంగా రక్షణ ఒప్పందం ద్వారా లబ్ది పొందిన ప్రముఖ ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి 2009లో లండన్‌లోని 12 బ్య్రాన్‌స్టన్ స్క్వేర్‌లో ఓ భవనాన్ని తన కంపెనీ ‘వోర్టెక్స్’ ద్వారా 19 లక్షల పౌండ్లకు కొనుగోలు చేశారు. దాన్ని ఆ మరసటి సంవత్సరమే దుబాయ్ వ్యాపారి సీసీ థంపీకి విక్రయించారు. ఆ భవనం పునరుద్ధరణకు సీసీ థంపీ 65 వేల పౌండ్లు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఆ భవనాన్ని బ్రిటన్‌లో సంజయ్ భండారీకి సంబంధం ఉన్న ఓ సింటాక్ కంపెనీకి కొన్న రేటుకే అంటే 19 లక్షల పౌండ్లకే విక్రయించారు. అంటే భండారీ కొనుగోలు చేసిన భవనం తిరిగి భండారీ చేతికే వచ్చిందన్న మాట. భండారి, సీసీ థంపీ, వాద్రాలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నది ఈడీ అధికారుల వాదన. ఒప్పందాల్లో లబ్ది పొందినందుకుగాను భండారీ ఆ భవనాన్ని రాబర్ట్ వాద్రా కోసం ముడుపుల కింద కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. మరి ఈ ఆరోపణకు రుజువు ఏమిటీ?
2016లో ఢిల్లీలోని సంజయ్ భండారీ ఇంటిపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడి చేసినప్పుడు ఓ కంప్యూటర్‌లో భండారి బంధువుకు, వాద్రా కార్యదర్శికి మధ్య నడిచిన ఈమెయిళ్లు దొరికాయి. లండన్‌లో ఉంటున్న భండారీ మేనల్లుడు సుమిత్ ఛద్దా, లండన్ 12 బ్య్రాన్‌స్టన్ స్కేర్ భవనం పునరుద్ధరణ బిల్లుల చెల్లింపుల గురించి వాద్రా కార్యదర్శికి ఆ మెయిల్స్ పంపించారు. అందులో ఓ మెయిల్‌కు వాద్రా స్వయంగా స్పందిస్తూ ‘రేపు ఉదయం ఈ విషయాన్ని పరిశీలిస్తాం. కార్యదర్శి మనోజ్ పరిష్కరిస్తారు’ అని చెప్పారు. భవనం పునరుద్ధర ణకు అయిన 65 వేల పౌండ్లను వాద్రా చెల్లించారనే, అందుకనే భండారి వద్ద కొన్న రేటుకు సీసీ థంపీ తిరిగి విక్రయించారని, తన ఆస్తి కావడం వల్ల వాద్రా పునరుద్ధరణ ఛార్జీలు చెల్లించారన్నది ఈడీ అధికారుల అనుమానం.
సంజయ్ భండారీ 2008లో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆఫ్‌సెట్ ఇండియా సొల్యుషన్స్ కంపెనీ కొన్నేళ్లలో కొన్ని కోట్ల రూపాయలకు ఎలా ఎదిగిందో దర్యాప్తు జరపాల్సిందిగా 2014లో అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐబీ అధికారులను ఆదేశించింది. 2012లో భారత ప్రభుత్వంతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు శిక్షణ విమానాల ఒప్పందాన్ని చేసుకున్న స్విస్ సంస్థ ‘పిలాటస్’తో భండారీకి సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ యాజమాన్యంతో రాబర్ట్ వాద్రా కూడా సంబంధాలు ఉన్నాయంటూ ఐబీ అధికారులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించారు.
లండన్‌లోని ఆస్తులు, ముడుపులకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు సంజయ్ భండారి, తన ఇంటిపై 2016లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో నేపాల్ మీదుగా లండన్ పారిపోయారు. దాంతో లండన్ ఆస్తుల కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. వాద్రా కార్యదర్శి, భండారి బంధువు మధ్య కొనసాగిన ఈ మెయిళ్లు మినహా మరో సాక్ష్యాన్ని ఈడీ అధికారులు సాధించలేకపోయారు. లండన్‌లో తనకు ఎలాంటి ఆస్తులు లేవని చెబుతున్న రాబర్ట్ వాద్రాను విచారిస్తున్న అధికారులు, భండారీతో ఆయనకున్న సంబంధాల గురించే గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారని తెల్సిందే. ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాగానే ఆమె భర్త వాద్రాను విచారించడానికి కారణం ఆమె నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీయడానికి లేదా ఆమె పరువు తీయడానికి ప్రయత్నం కావచ్చు. రఫేల్ యుద్ధ విమానాల డీల్‌లో నరేంద్ర మోదీని ప్రత్యక్షంగా విమర్శిస్తున్న రాహుల్ గాంధీ నోటికి తాళం వేసే ప్రయత్నమూ కావచ్చు. ఏదీ ఏమైనా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడమే అసలు విషయం.
Comments
Please login to add a commentAdd a comment