ఆయుధ వ్యాపారి సంజయ్ భండారి, రాబర్ట్ వాద్రా ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : నగదు అక్రమ చలామణి ద్వారా విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు గట్టి షాక్ తగిలింది. రాబర్ట్ వాద్రా బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి సంస్థ ఆఫ్‌సెట్ ఇండియా సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్, ఈ గ్రూపు సంస్థలు, ఇతర విభాగాలతో అన్ని వ్యాపార లావాదేవీలను కేంద్రం నిషేధించింది. ఈ మేరకు రక్షణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో (ఫిబ్రవరి 2018)మొట్టమొదటిసారిగా ఆఫ్‌సెట్ ఇండియా సొల్యూషన్స్‌తో వ్యాపారాన్ని ఆరునెలలపాటు నిషేధించింది. తాజాగా తదుపరి ఆదేశాల వరకు నిషేధం కొనసాగుతుందని వెల్లడించడం గమనార్హం
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక ఒప్పందాలతో (2005లో రక్షణ ఒప్పందం, 2009లో పెట్రోలియం,తదితర) భండారీకి సంబంధం ఉన్నాయని ఆరోపణలు. సంజయ్ భండారీ 2008లో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆఫ్‌సెట్ ఇండియా సొల్యుషన్స్ కంపెనీ కొన్నేళ్లలో కొన్ని కోట్ల రూపాయలకు ఎలా ఎదిగిందో దర్యాప్తు జరపాల్సిందిగా 2014లో అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐబీ అధికారులను ఆదేశించింది. 2012లో భారత ప్రభుత్వంతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు శిక్షణ విమానాల ఒప్పందాన్ని చేసుకున్న స్విస్ సంస్థ 'పిలాటస్'తో భండారీకి సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ యాజమాన్యంతో రాబర్ట్ వాద్రా కూడా సంబంధాలు ఉన్నాయంటూ ఐబీ అధికారులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు 2016 లో ఐటీ దాడుల నేపథ్యంలో డిఫెన్స్ డీలర్ సంజయ్ భండారి లండన్ పారిపోయాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ రాబర్ట్ వాద్రా కస్టోడియల్ రిమాండ్‌ను కోరుతోంది. పెట్రో, రక్షణ వ్యవహారాల్లో భండారి లంచాలు తీసుకున్నారని దర్యాప్తు ఏజెన్సీ పేర్కొంది. అలాగే లండన్ నుంచి భండారిని తిరిగి ఇండియాకు రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment